Share News

పారిశ్రామిక కేంద్రం షాద్‌నగర్‌!

ABN , First Publish Date - 2023-10-13T23:07:05+05:30 IST

పారిశ్రామిక ప్రాంతంగా దినదినాభివృద్ధి చెందుతూ వివిధ రాష్ర్టాల వారికి ఉపాధిని కల్పిస్తూ మినీ ఇండియాగా పేరు పొందిన ఘనత షాద్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానిది. హైదరాబాద్‌ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించింది కూడా ఇక్కడినుంచే. రాష్ట్రంలో తొలి పంచాయతీ సమితిని నిర్మించుకున్న ప్రాంతంగా నిలిచిన చరిత్ర షాద్‌నగర్‌ నియోజకవర్గం సొంతం. దక్షిణాది ప్రాంతాల వారికి రాజధాని హైదరాబాద్‌ ముఖ ద్వారంగా కనిపించే షాద్‌నగర్‌ అసెంబ్లీ వ్యాపార, వ్యవసాయ రంగాల్లో కూడా అగ్రగామిగా నిలించింది.

పారిశ్రామిక కేంద్రం షాద్‌నగర్‌!

8 దశాబ్ధాల ప్రస్థానంలో కాంగ్రెస్‌దే ఆధిపత్యం

వలస ఓటర్ల సంఖ్య అధికం

తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రాతినిధ్యం ఇక్కడి నుంచే

షాద్‌నగర్‌ అసెంబ్లీ ప్రత్యేకతలు ఎన్నో..

పారిశ్రామిక ప్రాంతంగా దినదినాభివృద్ధి చెందుతూ వివిధ రాష్ర్టాల వారికి ఉపాధిని కల్పిస్తూ మినీ ఇండియాగా పేరు పొందిన ఘనత షాద్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానిది. హైదరాబాద్‌ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించింది కూడా ఇక్కడినుంచే. రాష్ట్రంలో తొలి పంచాయతీ సమితిని నిర్మించుకున్న ప్రాంతంగా నిలిచిన చరిత్ర షాద్‌నగర్‌ నియోజకవర్గం సొంతం. దక్షిణాది ప్రాంతాల వారికి రాజధాని హైదరాబాద్‌ ముఖ ద్వారంగా కనిపించే షాద్‌నగర్‌ అసెంబ్లీ వ్యాపార, వ్యవసాయ రంగాల్లో కూడా అగ్రగామిగా నిలించింది.

షాద్‌నగర్‌, అక్టోబరు, 13 : షాద్‌నగర్‌ 1952లో అసెంబ్లీ నియోజకవర్గంగా అవతరించింది. ఇక్కడి ఫరూఖ్‌నగర్‌ మండలం బూర్గుల గ్రామవాసి రామకృష్ణారావు తొలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సాధించి అప్పటి హైదరాబాద్‌ రాష్ర్టాన్ని ఏలిన తొలి ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. ఆ తర్వాత విశాలాంధ్ర అవతరణలో భాగంగా తన పదవికి రాజీనామా చేసి ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌గా పని చేశారు. విశాలాంధ్ర అవతరణ తర్వాత 1957లో జరిగిన ఎన్నికల్లో తొలి ముస్లిం మహిళ షాజాహాన్‌బేగం గెలిచారు. ఆ తర్వాత 1962 వరకు మాత్రమే ఈ నియోజకవర్గం జనరల్‌ కేటగిరీలో ఉంది. 1962 నుంచి 2004 వరకు ఎస్సీ నియోజకవర్గంగా కొనసాగింది. 2009 నుంచి తిరిగి జనరల్‌ నియోజకవర్గ స్థానానికి చేరింది.

ముందు నుంచీ కాంగ్రెస్‌ ఆధిపత్యమే

షాద్‌నగర్‌ అసెంబ్లీలో బరిలో 1983 వరకు కాంగ్రెస్‌ ఆధిపత్యమే కొనసాగింది. అప్పటి వరకు జరిగిన 7 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. 1983లో ఎన్టీఆర్‌ ప్రభంజనం కొనసాగిన సమయంలో కూడా ఇక్కడ కాంగ్రెస్‌ గెలవడం విషేశం. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తొలిసారి తెలుగుదేశం పార్టీని విజయం వరించింది. తర్వాత 1994లో రెండోసారి కూడా టీడీపీకి విజయం దక్కింది. అనంతరం 2009 వరకు కూడా కాంగ్రెస్‌దే హవా కొనసాగింది. 2014లో షాద్‌నగర్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ గెలుపొందింది. 2018లో కూడా ఆ పార్టీ విజయాన్ని అందుకుంది. ఈ విడత కూడా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఇక్కడ 11సార్లు విజయం సాధించిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీకి ఉంది. కాగా అత్యధిక మెజార్టీ మాత్రం టీడీపీ అభ్యర్థి బక్కని నర్సింహులు మీదే నమోదైంది. ఆయన 45వేల ఓట్లపై చిలుకు మెజార్టీ సాధించారు.

నియోజకవర్గ ప్రత్యేకతలు

- షాద్‌నగర్‌ నియోజకవర్గంలో తొలి పంచాయతీ సమితిని 1956లో పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రారంభించారు. తర్వాత కాలంలోని ప్రధానమంత్రులైన ఇందిరాగాంధీ, పీవీ నర్సింహారావు పంచాయతీ సమితి కార్యక్రమానికి హాజరు కావడం విశేషం.

-ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరించిన ఈవీఎం ఓటింగ్‌ విధానాన్ని 1983లో షాద్‌నగర్‌ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. తొలి ఫలితం కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చింది.

- తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ 2003లో ఈ ప్రాంతాన్ని సందర్శించి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఇమ్యూనైజేషన్‌ వ్యాక్సిన్‌ సెంటర్‌ను ఇక్కడే ప్రారంభించారు.

- 2001లో ప్రపంచ బ్యాంకు అఽఽధ్యక్షుడు ఉల్ఫేన్‌సన్‌ ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని కమ్మదనం వన సంరక్షణ సమితిని సందర్శించారు.

- 1991లో అప్పటి చిన్న నీటి పారుదల శాఖ మంత్రి శంకర్‌రావు నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రయోగాత్మకంగా చేపట్టిన కృత్రిమ వర్షాలను ఇక్కడి నుంచే ప్రారంభించారు.

- 2004 జనవరి 1న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. అదేవిధంగా గ్రామ పంచాయతీలలో ఆన్‌లైన్‌ వ్యవస్థ కూడా ఇక్కడి నుంచే ప్రారంభమైంది.

- ఆరు మండలాలతో కూడిన షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, ఫరూఖ్‌నగర్‌ మండలాల్లో సుమారు 300కు పైగా ఉన్న పరిశ్రమల్లో 70వేల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా వివిధ రాష్ర్టాల నుంచి వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. కేశంపేట, కొందుర్గు, చౌదరిగూడ మండలాలు పూర్తిగా వ్యవసాయం మీద ఆఽధారపడగా.. షాద్‌నగర్‌ మున్సిపాలిటీ వ్యాపార రంగానికి మొదటి నుంచీ ప్రసిద్ధి.

ప్రస్తుతం 2,25,470 మంది ఓటర్లు

ప్రస్తుతం షాద్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలో 2,25,470 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 1,13,872 మంది కాగా, 1,11,583 మంది మహిళా ఓటర్లున్నారు. ఇతరులు 15 మంది ఉన్నారు. మొత్తం నియోజకవర్గంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడాని 252 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-10-13T23:07:05+05:30 IST