Breaking : సీఎం కేసీఆర్ సతీమణికి అస్వస్థత.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
ABN , First Publish Date - 2023-03-12T14:33:03+05:30 IST
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి (CM KCR Wife) అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం స్వల్ప అస్వస్థతకు గురవ్వగా శోభను (KCR Wife Shobha) హుటాహుటిన గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రికి తరలించారు. శోభా వెంట కేసీఆర్ కూడా ఆస్పత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తన తల్లిని చూడటానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) ఆస్పత్రికి వెళ్లారు. అమ్మ ఆరోగ్యంపై డాక్టర్లను అడిగి కవిత వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి నుంచి నేరుగా మీడియాతో మాట్లాడకుండానే బంజారాహిల్స్‌లోని తన నివాసానికి కవిత వెళ్లిపోయారు.
భేటీ జరిగిన కొన్ని నిమిషాలకే..!
ఇవాళ మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌తో కవిత భేటీ అయ్యారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు (KTR, Harish Rao) కూడా పాల్గొన్నారు. ఈడీ విచారణలో ఏం జరిగింది..? అనేదానిపై చర్చించారు. అనంతరం 16న మరోసారి విచారణకు వెళ్లడంపైన కూడా కేసీఆర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై న్యాయనిపుణులు, బీఆర్ఎస్ లీగల్ సెల్ సభ్యులతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. దీంతో పాటు ఈడీ విచారణలో ఎలా వ్యవహరించాలనేదానిపై కవితకు కేసీఆర్ కొన్ని కీలక సలహాలు, సూచనలు చేసినట్లుగా సమాచారం. అయితే.. ఈ సమావేశం జరిగిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే శోభ అస్వస్థతకు గురయ్యారు.
నిలకడగానే..!
ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ వెంటనే.. కవిత, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో కలిసి శోభను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడకానే ఉందని వైద్యులు చెబుతున్నారు. అమ్మ ఆరోగ్యం గురించి ఆరా తీసిన తర్వాత ఆస్పత్రి నుంచి కవిత ఇంటికెళ్లారు. హరీష్, కేటీఆర్ ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నారు. కొన్ని వైద్య పరీక్షల తర్వాత శోభ డిశ్చార్జ్ అవుతారని.. సతీమణితో కలిసే కేసీఆర్ ఇంటికెళ్తారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఏమేం పరీక్షలు చేస్తున్నారు..? అస్వస్థతకు గురవ్వడానికి కారణాలేంటి..? అనే విషయాలు మాత్రం తెలియరాలేదు.