Share News

Miss World 2025: అందాల పోటీలపై రాజకీయ రచ్చ.. ఎవరికి లాభం..

ABN , Publish Date - Mar 20 , 2025 | 03:26 PM

మే నెలలో మిస్ వరల్డ్ అందాల పోటీలు ఇండియాలో జరగనున్నాయి. అది కూడా మన తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణలో జరగనున్నాయి. ఈ పోటీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ప్రస్తుతం దీనిపై రాజకీయ రచ్చ మొదలైంది.

Miss World 2025: అందాల పోటీలపై రాజకీయ రచ్చ.. ఎవరికి లాభం..
Miss World 2025

72వ మిస్ వరల్డ్ అందాల పోటీలు తెలంగాణలో జరగనున్న సంగతి తెలిసింది. ఈ పోటీలను నిర్వహించడానికి ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, గత కొద్దిరోజులనుంచి మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో నిర్వహించటం, అందుకోసం 200 కోట్లు ఖర్చు పెట్టడంపై రాజకీయంగా పెను దుమారం చెలరేగుతోంది. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. రాష్ట్రం అప్పుల్లో అల్లాడుతున్న టైంలో అందాల పోటీల కోసం వందల కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ట్విటర్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. వరుస ట్వీట్లతో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. మరి, ప్రతిపక్షం విమర్శిస్తున్నట్లుగా అందాల పోటీలు నిర్వహించటం ఖర్చుదండగా?.. పోటీల వల్ల రాష్ట్రానికి ఒరిగేదిమిటి?..


తెలంగాణలో 10 చోట్ల పోటీలు..

మిస్ వరల్డ్ 2025 పోటీలు మే 7వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 140 దేశాలకు చెందిన వారు పాల్గొననున్నారు. 3 వేల మంది ప్రపంచ మీడియా ప్రతినిధులు హాజరుకానున్నారు. తెలంగాణలోని 10 ప్రాంతాల్లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ప్రారంభ, ముగింపు కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరుగుతాయి. దీనికోసం హైటెక్స్, శిల్పారామం, గచ్చిబౌలి స్టేడియాలను పరిశీలిస్తున్నారు. మిగిలిన 8 ఈవెంట్లు తెలంగాణలోని పోచంపల్లి, యాదగిరిగుట్ట,రామప్ప, లక్నవరం, నాగార్జున సాగర్, వికారాబాద్ వంటి ప్రాంతాల్లో జరగనున్నాయి. ఇక, ఈ మిస్ వరల్డ్ పోటీలను రాష్ట్ర పర్యాటకం, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ అభివృద్దికి వేదికగా మలుచుకుంటామని పర్యాటక శాఖ వెల్లడించింది.


మొత్తం పది చోట్ల మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించటం ద్వారా ఆయా ప్రాంతాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రమోషన్ చేసినట్లు ఉంటుందని భావిస్తోంది. పోచంపల్లి ఈవెంట్ సందర్భంగా సుందరీమణులు పోచంపల్లికి వెళ్లనున్నారు. చేనేత కార్మికులతో ముచ్చటించనున్నారు. చేనేత వస్త్రాల తయారీని వారు పరిశీలించనున్నారు. ఆ తర్వాత పోచంపల్లి చీరెలను ధరించి స్టేజి మీద ర్యాంప్ వాక్ చేయనున్నారు. ఇలా చేయటం ద్వారా చేనేత వస్త్రాలకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు వస్తుందని సాంస్కృతిక శాఖ భావిస్తోంది. బౌద్ధులను ఆకర్షించేందుకు నాగార్జున సాగర్ లోని బుద్ధవనాన్ని ఎంపిక చేశారు. అందాల పోటీల్లో పాల్గొనే వారంతా బుద్ధవనం ప్రాజెక్టును సందర్శించనున్నారు.


పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా..

తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులను, పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంగా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తోంది. ఈ పోటీల సందర్భంగా 140 దేశాలకు చెందిన ప్రతినిధుల ముందు తెలంగాణ రాష్ట్ర వారసత్వ సంపద, చేనేత రంగం, జానపద నృత్యాలు, సంగీతం, వంటకాల వంటివి ప్రదర్శించనున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో తెలంగాణలోని వివిధ ప్రాంతాల విశిష్టతలను తెలుపుతూ వీడియోలను కూడా రూపొందించనున్నారు. తద్వారా రాష్ట్ర పర్యాటకానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభిస్తుందని, 200 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించటం వల్ల లాభమే తప్ప నష్టం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం నొక్కి వక్కానిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ మిస్ వరల్డ్ పోటీలపై విమర్శలు చేయడానికి కారణం లేకపోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేసులను నిర్వహించారు. ఇందుకోసం 40 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దీన్ని కాంగ్రెస్ నాయకులు తప్పబట్టారు. ఫార్ములా ఈ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద మొత్తంలో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిందంటూ మండిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vishnupriya Questioned By Police: పోలీసుల విచారణకు విష్ణుప్రియ.. ఏం అడిగారంటే

Medak: దొంగ బాబా అరెస్టు.. మహిళలకు మత్తుమందు ఇస్తూ.. వీడి అరాచకం మాములుగా లేదు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 20 , 2025 | 08:22 PM