ఇక ‘పట్టా’ పక్కా

ABN , First Publish Date - 2023-02-09T00:39:27+05:30 IST

పోడు రైతుల కష్టాలు కడతేరనున్నాయి. సాగులో ఉన్న వీరి భూములకు పట్టాలు జారీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీంతో ఏళ్ల ఎదురుచూపులకు తెరపడనుంది. త్వరలోనే పోడు రైతులకు హక్కు పత్రాలు అందజేస్తామని సర్కారు ప్రకటించడంపై లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

ఇక ‘పట్టా’ పక్కా

చిగురిస్తున్న రైతుల ఆశలు

ఏళ్ల నిరీక్షణకు తెర!

భూపాలపల్లి జిల్లాలో 25,394 దరఖాస్తులు

2005 చట్టం ప్రకారం లబ్ధిదారుల ఎంపిక

కమిటీ నిర్ణయం మేరకే పట్టాల పంపిణీ

కాకతీయఖని, ఫిబ్రవరి 8: పోడు రైతులకు హక్కు పత్రాలు అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగా లబ్ధిదారులను గుర్తించేందుకు ఇప్పటికే కమిటీలను నియమించింది. వాటి ద్వారా దరఖాస్తులను స్వీకరించింది. 2005 డిసెంబరు 13కు ముందు నుంచి సాగు చేసుకుంటున్న పోడు రైతులందరికీ హక్కు పత్రాలను అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 72,952.11 ఎకరాలకు 25,394 దరఖాస్తులు వచ్చాయి.

దరఖాస్తుదారుల్లో గిరుజనులకంటే గిరిజనేతరులే అధికంగా ఉన్నారు. అయితే.. వీరిలో అర్హులెవరు, అనర్హులు ఎవరు? అని తేల్చేందుకు ప్రభుత్వం మూడు కమిటీలను నియమించింది. దరఖాస్తులన్నింటినీ పూర్తిగా పరిశీలించాకే ఆర్‌వోఎఫ్‌ఆర్‌ 2005 చట్టం ప్రకారం అర్హులను గుర్తించి హక్కు పత్రాలను అందజేస్తారు. ఈ ప్రక్రియలో డిస్ట్రిక్ట్‌ లెవల్‌ కమిటీ(డీఎల్‌సీ)దే తుది నిర్ణయం.

భూపాలపల్లి జిల్లాలో 25,394 దరఖాస్తులు..

పోడు భూముల హక్కు పత్రా ల కోసం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం మినహా 10 మండలాల నుంచి అంచనాలకు మించి అర్జీలు వచ్చాయి. 72,952.11 ఎకరాలకు 25,394 మంది దరఖాస్తులు చేసుకున్నారు. భూపాలపల్లి మండలంలోని 16 గ్రామాల నుంచి 16,256.07 ఎకరాలకు 5,027 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. వీరిలో 1,227 మంది గిరిజనులు ఉండగా, 3,800 మంది గిరిజనేతరులు ఉన్నారు. చిట్యాల మండలంలోని నాలుగు గ్రామ పంచాయతీల నుంచి 3420.39 ఎకరాలకు 1,007 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 313 మంది గిరిజనులు ఉండగా 694 మంది గిరిజనేతరులు ఉన్నారు. గణపురం మండలంలోని రెండు గ్రామ పంచాయతీల నుంచి 473.15 ఎకరాలకు 252 మంది అర్జీలు పెట్టుకున్నా రు. వీరిలో 28 మంది గిరిజనులుండగా 224 మంది గిరిజనేతరులు ఉన్నారు. కాటారం మండలంలో 10 గ్రామ పంచాయతీల నుంచి 3415.32 ఎకరాలకు 1,582 మంది దరఖాస్తు చేసుకున్నారు. 270 మంది గిరిజను లుండగా 1,312 మంది గిరిజనేతరులు ఉన్నారు. మహదేవపూర్‌ మండ లంలోని 14 గ్రామపంచాయతీల నుంచి 8399.01 ఎకరాలకు 4,042 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో 796 మంది గిరిజనులు ఉండగా 3,246 మంది గిరిజనేతరులు ఉన్నారు. మహాముత్తారం మండలంలోని 18 గ్రామపంచాయతీల నుంచి 23928.33 ఎకరాలకు 6,780 మంది దరాఖాస్తు చేసుకున్నారు. వీరిలో 3,021 మంది గిరిజనులు ఉండగా 3759 మంది గిరిజనేతరులు ఉన్నారు. మల్హర్‌ మండలంలోని తొమ్మిది గ్రామాల నుంచి 7214.27 ఎకరాలకు 3,307 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 965 మంది గిరిజనులు ఉండగా 2,342 మంది గిరిజనేతరులు ఉన్నారు. పలిమల మండలంలోని ఎనిమిది గ్రామాల నుంచి 5996.27 ఎకరాలకు 1,830 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 762 మంది గిరిజనులు, 1,068 మంది గిరిజనేతరులు ఉన్నారు. రేగొండ మండలంలోని ఎనిమిది గ్రామ పంచాయతీల నుంచి 3036.15 ఎకరాలకు 1,224 మంది అర్జీలు పెట్టుకున్నారు. వీరిలో 176 మంది గిరిజనులుండగా 1,048 మంది గిరిజనేతరులు ఉన్నారు. టేకుమట్ల మండలంలోని రెండు గ్రామపంచా యతీల నుంచి 810.15 ఎకరాలకు 343 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పది మంది గిరిజనులుండగా 333 మంది గిరిజనేతరులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులను పరిశీలిస్తే మహాముత్తారం మండలం నుంచి అత్యధికంగా వచ్చాయి.

క్షుణ్ణంగా పరిశీలించాకే..

పోడు భూములను సాగుచే సుకుంటున్న నిరుపేదలను గుర్తించి అర్హులైన గిరిజను లకు హక్కు పత్రాలను అం దించేందుకు ప్రభుత్వం ఫారెస్ట్‌ రైట్స్‌ కమిటీ(ఎఫ్‌ఆర్సీ), సబ్‌డివిజనల్‌ లెవల్‌ కమిటీ (ఎస్‌డీఎల్‌సీ),డిస్ర్టిక్ట్‌ లెవల్‌ కమిటీ(డీఎల్‌సీ)ని నియమించింది. ఎఫ్‌ఆర్సీ కమిటీలో గ్రామ పంచాయతీ సభ్యులు, పంచాయతీ సెక్రటరీ, అటవీశాఖ అధికారులు ఉంటారు. వీరు భూముల వద్దకు వెళ్లి క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఎస్‌డీఎల్‌సీకి నివేదిక పంపిస్తారు. ఈ కమిటీలో ఆర్డీవో, తాహసీల్దార్లు, ఎఫ్‌ఆర్వోలు, ఎంపీడీవోలు ఉంటారు. వీరు సమర్పించిన నివేదికలను ఎస్‌డీఎల్‌సీ అధికారులు పరిశీలించి వాటిని డీఎల్‌సీ కమిటీ పంపిస్తారు. డిస్ర్టిక్ట్‌ లెవల్‌ కమిటీలో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా ఉన్నత అధికారులు, ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారి, ప్రజాప్రతినిధులు ఉంటారు. వీరంతా అర్జీలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలిస్తారు. వాటిని ఆమోదించాలా... తిరస్కరించాలా..? అనే అంశంపై చర్చించి అర్హులకు హక్కు పత్రాలను అందజేస్తారు. అయితే.. ఇప్పటికే ఎస్‌డీఎల్‌సీ కమిటీ సర్వే, గ్రామ సభలు నిర్వహించి సభలు పూర్తి చేసినట్టు కలెక్టర్‌ తెలిపారు. దీంతో ఫిబ్రవరి మొదటి వారం లేదా రెండో వారంలో అర్హులకు భూ పట్టా, పాస్‌ పుస్తకాలు ఇచ్చేందుకు దరఖాస్తుల ఆమోదం, పాస్‌పుస్తకాల ముద్రణ వంటి పనులు పూర్తి చేయాలని సంబందిత అధికారులను ఆయన ఆదేశించారు.

- ఆర్‌వోఎఫ్‌ఆర్‌ చట్టం ద్వారా లబ్ధిదారుల ఎంపిక

భూపాలపల్లి జిల్లాలోని 72,952.11 ఎకరాలకు పది మండలాల నుంచి 25,394 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 7568 మంది గిరిజనులు ఉండగా 1,7826 మంది గిరిజనేతరులు ఉన్నారు. అయితే ఆర్‌వోఎఫ్‌ఆర్‌ చట్టం ప్రకారం 2005 కంటే ముందు నుంచి పోడు భూముల్లో సాగు చేసుకునే వారు ఏవైనా రెండు ఆధారాలు సమర్పిస్తే వెంటనే వాటిని ఆమోదిస్తారు. అయితే సబ్‌డివిజనల్‌ కమిటీ 689 మంది గిరిజనుల దరఖాస్తులను సిఫార్సు చేసిందని, వాటిని డీఎల్‌సీ కమిటీ మరోసారి పరిశీలించి ఎస్‌ఎల్‌సీకి పంపించనున్నామని కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు. ఇదిలా ఉండగా గిరిజనులకు మాత్రమే పోడు పట్టాలు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు గిరిజనేతరులకు ఎలా ఇస్తుందననే విమర్శలు వస్తున్నాయి.

Updated Date - 2023-02-09T00:39:31+05:30 IST