AP Politics: జగన్‌కి ఇద్దరు బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..
ABN , Publish Date - Sep 03 , 2024 | 03:12 PM
బాలీవుడ్ నటి జైత్వానీ వ్యవహారంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. మాజీ జగన్‌పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఆయనపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు.. ఆయనకూ ఇద్దరు ఆడబిడ్డలున్నారు కదా? అని ప్రస్తావిస్తూ..
కడప, సెప్టెంబర్ 03: బాలీవుడ్ నటి కాదంబరి జైత్వాల్ వ్యవహారంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. ఈ కేసులో నాటి సీఎం వైఎస్ జగన్ అనుసరించిన వ్యవహార శైలిని తూర్పారబట్టారు. ఆయనకూ ఇద్దరు బిడ్డలున్నారు కదా? జైత్వాల్‌కు జరిగిన అన్యాయంపై ఎందుకు స్పందించలేదని అని ప్రశ్నించారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన షర్మిల.. ముంబై నటి కాదంబరి జైత్వాల్‌ను కట్టడి చేయడానికి, ఆమెను అడ్డుకోవడానికి ఎన్నో ప్లాన్స్ వేశారని విమర్శించారు.
కాదంబారి జైత్వాల్ ఒక మహిళా డాక్టర్ అని.. ఆమెను మానసికంగా వేధించారని విమర్శించారు. యాక్టింగ్ ఫీల్డ్‌లోకి వచ్చి ఎదగాలని భావించిన మహిళను మానసికంగా వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జైత్వాల్ సామాన్యురాలైతే రూ. 100 కోట్లు ఇచ్చి నొక్కిపెట్టేసేవారన్నారు. జైత్వాల్‌కి అండగా పోరాటం చేయడానికి తాము సిద్ధం అని షర్మిల ప్రకటించారు. ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన మహిళను ఇక్కడికి తీసుకొచ్చి అరెస్ట్ చెయ్యడం దుర్మార్గం అఅని గత ప్రభుత్వం తీరును తూర్పారబట్టారు. నాటి సీఎం జగన్‌కు తెలియకుండానే ఐఎఎస్, ఐపిఎస్‌లు ఇలా వ్యవహారిస్తారా? అని షర్మిల ప్రశ్నించారు. ఇద్దరు కుమార్తెలున్న జగన్.. కాదంబరికి జరిగిన అన్యాయంపై ఎందకు స్పందించలేదని నిలదీశారు.
జగన్.. సజ్జన్ జిందాల్ వారి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని గొప్పుగా చెప్పుకున్నారని గుర్తు చేసిన షర్మిల.. జిందాల్‌కు ఎందుకు కోట్ల రూపాయల ఆస్తిని కట్టబెట్టారో జగన్ సమాధానం చెప్పాలన్నారు. జగన్, బాబు ఇద్దరూ బీజేపీకి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. ఇంత బానిసలుగా ఎందుకు తయారయ్యారో బాబు, జగన్ సమాధానం చెప్పాలన్నారు. కడప ఉక్కు పరిశ్రమను ఆదిలోనే తుంచివేశారని షర్మిల విమర్శించారు. కడప స్టీల్ ప్లాంట్ సాధించేందుకు ఉద్యమిస్తామన్నారు. అవసరమైన ప్రాణ త్యాగాలకు సైతం సిద్ధం అని షర్మిల ప్రకటించారు. కడప ఉక్కు పరిశ్రమకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కట్టుబడి ఉన్న నేత అని చెప్పారు.
ఇదే సమయంలో గుడ్ల వల్లేరు కాలేజీ ఘటనపై వైఎస్ షర్మిల స్పందించారు. అది ఒక ఫేక్ న్యూస్ అని అన్నారు. 300 వీడియోల్లో ఒక్కటి కూడా ఎందుకు బయటపడలేదని షర్మిల ప్రశ్నించారు. షవర్ లోపల పెట్టి ఉంటే.. వాటర్ పడితే బ్లర్ అవుతుందన్నారు.