Share News

CS Javahar Reddy: అమ్మ.. జవహరా!

ABN , Publish Date - Jun 07 , 2024 | 02:34 AM

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటే మొత్తం అధికార యంత్రాంగానికి సూపర్‌బాస్‌. ఆ పోస్టులో ఉన్నవారికి పని ఒత్తిడితోపాటు ఎక్కడా లేని బరువు బాద్యతలు ఉంటాయి.

CS Javahar Reddy: అమ్మ.. జవహరా!

అందుకే రిజిస్ట్రేషన్‌ శాఖ తీసుకున్నారా?

సీఎస్‌గా ఉంటూనే ఆ శాఖ బాధ్యతలూ..

ఆ తర్వాతే అసైన్డ్‌ భూకొనుగోళ్ల ఆరోపణలు

భోగాపురం భూముల కేసులో కొత్త కోణం

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటే మొత్తం అధికార యంత్రాంగానికి సూపర్‌బాస్‌. ఆ పోస్టులో ఉన్నవారికి పని ఒత్తిడితోపాటు ఎక్కడా లేని బరువు బాద్యతలు ఉంటాయి. అందుకే సీఎస్‌గా ఉన్న అధికారులు అదనంగా మరే ఇతర ప్రభుత్వ శాఖలు తమ వద్ద ఉంచుకోరు. ఇది అనవాయితీ. జగన్‌ హయాంలో సీఎస్‌గా పనిచేసిన జవహర్‌రెడ్డి దీనికి బ్రేక్‌వేశారు. సీఎ్‌సగా ఉంటూనే రెవెన్యూలో అతి కీలకమైన స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్‌ విభాగాన్ని తనకు కావాలని తీసుకున్నారు. అది కూడా సీఎస్‌ అయిన వెంటనే కాదు. ఎన్నికలకు సరిగ్గా నాలుగైదు నెలల క్రితమే ఆయన ముచ్చటపడి ఆ శాఖను తన ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ పరిణామంపై ఐఏఎస్‌ వర్గాల్లోనే భిన్నమైన చర్చ జరిగింది. జవహర్‌రెడ్డి ఎందుకు ఈ డిపార్ట్‌మెంట్‌ను తీసుకున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? అని అప్పట్లో చర్చోపచర్చలు సాగాయి. అంతకు ముందు ఈ విభాగం స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ వద్ద ఉండేది. ఆయనకు కూడా అనేకనేక శాఖలు ఉన్నాయి. వాటికి తోడు పూర్తిస్థాయి అదనపు ఇన్‌చార్జి బాధ్యతలు కూడా ఉన్నాయి. దీంతో ఆయనకు భారం తగ్గించేందుకు సీఎస్‌ ఆ విభాగాన్ని తీసుకున్నారా అన్న చర్చ జరిగింది.


ఇదీ సంగతి!..

ఐదు నెలల తర్వాత సీన్‌ కట్‌చేస్తే....విశాఖతోపాటు బోగాపురం ఏరియాలో జవహర్‌రెడ్డి భూములు కొన్నారని, అందులో భారీగా అసైన్డ్‌ భూములున్నాయని జనసేన నేత మూర్తియాదవ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. తనవద్ద ఆధారాలున్నాయని, నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని మీడియా ముందే సవాల్‌ చేశారు. జీవో 596 ఆధారంగా అసైన్డ్‌ భూములకు శాశ్వత హక్కులు కల్పించిన త ర్వాత తన బినామీలతో జవహర్‌రెడ్డి భూములు కొనిపించారని ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మూర్తియాదవ్‌పై లీగల్‌ చర్యలు తీసుకుంటానని సీఎస్‌ హెచ్చరించినా ఆ దిశగా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. పైగా,. మూర్తి యాదవ్‌ మరో ముందడుగువేసి ముగ్గురు వ్యక్తుల పేర్లు ప్రకటించారు. అందులో సీఎస్‌ కుటుంబ సభ్యుడి పేరు కూడా ఉండటం గమనార్హం. అసైన్డ్‌ భూములు కొట్టేసేందుకే జీఓ 596 తీసుకొచ్చారని, ఇందులో జవహర్‌రెడ్డి పాత్ర ఉందని మూర్తియాదవ్‌ బలమైన ఆరోపణలు గుప్పించారు. భూములు కొన్న తర్వాత రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి ఎలాంటి డాక్యుమెంట్లు, వివరాలు బయటకు రాకుండా సీఎస్‌ కుట్రలు చేశారని కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల్లో నిజం ఎంతో నిర్ధారణ కాలేదుగానీ, రిజిస్ట్రేషన్‌ శాఖ అయితే సీఎస్‌ వద్దే ఉంది.


ఇప్పటికే భోగాపురం మండలంలో ‘పెద్దసారు బంధువు’ అంటూ ఓ వ్యక్తి వందల ఎకరాల అసైన్డ్‌ భూములు కొన్నారు. తమకు చిల్లరపడేసి కోట్ల రూపాయల భూములు తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆ వ్యక్తి పేరును ప్రజలు బహిరంగంగా చెబుతున్నారు. ఈ పరిణామంపై సీఎస్‌ ఇప్పటిదాకా పెదవివిప్పలేదు. దీంతో అధికారవర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఒక వేళ నిజంగా భూములు కొని ఉంటే, ఈ ప్రయోజనం కోసమే సీఎస్‌ రిజిస్ట్రేషన్‌ శాఖను తన వద్ద ఉంచుకున్నారా? ఈ కారణంతోనే రజత్‌ భార్గవ నుంచి ఆ విభాగాన్ని తీశారా? అన్న అనుమానాలు అధికారవర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. రిజిస్ట్రేషన్‌ శాఖ తన వద్దే ఉంటే, భూములు కొన్నా బయటకు రాకుండా జాగ్రత్త పడొచ్చన్న కారణంతోనే జవహర్‌ ఆశాఖను తీసుకొని ఉంటారా? అని పలువురు సీనియర్‌ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

’’ప్రభుత్వం మారింది. త్వరలో విశాఖ, భోగాపురం భూముల గోల్‌మాల్‌పై ‘సిట్‌’తో ప్రత్యేక దర్యాప్తు చేయించనున్నారు. దీంతో అసలు నిజాలు వెలుగుచూస్తాయి. కానీ, సీఎస్‌ రిజిస్ర్టేషన్ల శాఖను తీసుకోవడం, ఆ వెంటనే ఆయనపై ఆరోపణలు రావడం యాదృశ్చికంగా కనిపించడం లేదు. దీనిపై జవహర్‌రెడ్డి మాట్లాడితేనే అసలు విషయాలు తెలుస్తాయి. ’’ అని ఓ సీనియర్‌ ఐఏఎస్‌ ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు. అయితే, ఇదే విషయమై జవహర్‌రెడ్డి మాట్లాడేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

Updated Date - Jun 07 , 2024 | 07:19 AM