‘సెకీ’ సౌర విద్యుత్‌పై ట్రాన్స్‌మిషన్ చార్జీల పిడుగు
ABN , Publish Date - Aug 20 , 2024 | 05:06 AM
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ)తో సౌర విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి జగన్ హయాం లో చేసుకున్న ఒప్పందంలోని లోగుట్టు బయటపడింది.
యూనిట్‌కు 80 పైసల చొప్పున డిస్కంలపై రూ.2,460 కోట్ల భారం
జగన్ హయాం నాటి ఒప్పందం గుట్టు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు రట్టు
ఒప్పందంపై నాడు గొప్పలు.. నేడు తిప్పలు
అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ)తో సౌర విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి జగన్ హయాం లో చేసుకున్న ఒప్పందంలోని లోగుట్టు బయటపడింది. సోలార్ పవర్ సూపర్ అంటూ.. నాడు అసెంబ్లీలోను, బయటా గొప్పలు పోయిన వైసీపీ.. డిస్కమ్‌లపై రూ.2,460 కోట్ల భారాన్ని గుట్టుచప్పుడు కాకుండా మోపేసింది. 2021, డిసెంబరు 1న చేసుకున్న 7 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై అంతర్రాష్ట్ర ట్రాన్స్‌మిషన్ చార్జీలు(ఐఎ్‌సటీఎస్) పడుతున్నాయని డిస్కమ్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యూనిట్‌కు 80 పైసల చొప్పన.. 25 ఏళ్లకు రూ.2,460 కోట్ల మేర భారాన్ని మోయాల్సి వస్తుందని చెబుతున్నాయి. వాస్తవానికి 2021, డిసెంబరు 1న సెకీ, రాష్ట్ర డిస్కమ్‌లు, అదానీ సంస్థలు ఒప్పందాలు చేస్తున్నాయి. దీనిపై అప్పట్లో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ.. యూనిట్‌కు రూ.2.49 చొప్పున సెకీతో సోలార్ విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలను చేసుకున్నామని వెల్లడించారు.
రాజస్థాన్ నుంచి వస్తున్న విద్యుత్తుకు ట్రాన్స్‌మిషన్ చార్జీలు వర్తించవని కూడా చెప్పారు. అప్పటి సీఎం జగన్ సైతం అసెంబ్లీలో పలుమార్లు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ యూనిట్ రూ.2.49కే కొనుగోలు చేశామని, ట్రాన్స్‌మిషన్ చార్జీలు లేకుండానే సౌర విద్యుత్తు వస్తుందన్నారు. కానీ.. నిపుణలు మాత్రం ఎప్పటికప్పుడు ట్రాన్స్‌మిషన్ చార్జీలు ఉంటాయని చెబుతూనే వచ్చారు.
ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు ఇంధన రంగంపై విడుదల చేసిన శ్వేతపత్రాల సందర్భంగా కూడా వెల్లడించారు. దీంతో మరోసారి ఒప్పందాన్ని సమీక్షించిన డిస్కమ్‌లు ట్రాన్స్‌మిషన్ చార్జీలపై త్రైపాక్షిక ఒప్పందంలో స్పష్టత లేదని గుర్తించాయి. దీంతో.. ఈ నెల 2న కర్నూలులో డిస్కమ్‌లు సమావేశమై ట్రాన్స్‌మిషన్ చార్జీలపై ఆందోళన వ్యక్తం చేశాయి. మరోవైపు ఈఆర్‌సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి కూడా ఈ అంశంపై చర్చించారు.
ఆ వెంటనే ఈ నెల 9న జీఎన్‌ఏ నియంత్రణ మేరకు ట్రాన్స్‌మిషన్ చార్జీలు 100 శాతం వర్తించబోవన్న అభిప్రాయానికి వచ్చారు. అయితే.. ట్రాన్స్‌మిషన్ చార్జీల మినహాయింపుపై సెకీ ఎలాంటి బాధ్యత వహించడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర గ్రామీణ వ్యవసాయ విద్యుత్తు సరఫరా కంపెనీ బాధ్యత తీసుకుని ట్రాన్స్‌మిషన్ చార్జీలు వర్తించబోవంటూ సర్టిఫికెట్ తీసుకోవాలని ఈఆర్‌సీ సూచింది.
వీటన్నింటినీ పరిశీలిస్తున్న డిస్కంలు యూనిట్‌కు రూ.80 పైసలు చొప్పున ట్రాన్స్‌మిషన్ చార్జీలు చెల్లించాల్సిందేనన్న ఒప్పందం గుట్టును గుర్తించాయి. మొత్తానికి.. ఒప్పందం చేసుకున్న నాలుగేళ్ల తర్వాత ఈ భారం బయటపడడం గమనార్హం.