Ambati Rayudu : పోలవరం ప్రాజెక్టు ఎవరికీ అర్థం కాదు
ABN , Publish Date - Jun 19 , 2024 | 03:46 AM
తనకు అర్థం కాలేదు కాబట్టి.. పోలవరం సబ్జెక్ట్ ఇంకెవరికీ అర్థం కాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అంతేకాదు.. ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని తొలిసారిగా చెప్పిన గొప్పతనం కూడా తనదేనని గొప్పగా చెప్పుకొన్నారు.
ఎందుకంటే నాకే అర్థం కాలేదు
మాజీ మంత్రి అంబటి రాంబాబు వింత వ్యాఖ్యలు
అమరావతి, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): తనకు అర్థం కాలేదు కాబట్టి.. పోలవరం సబ్జెక్ట్ ఇంకెవరికీ అర్థం కాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అంతేకాదు.. ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని తొలిసారిగా చెప్పిన గొప్పతనం కూడా తనదేనని గొప్పగా చెప్పుకొన్నారు. సీఎం చంద్రబాబు తాజాగా పోలవరంలో పర్యటించి.. వైసీపీ ప్రభుత్వం వల్లే ప్రాజెక్టు ఆలస్యమైందని విమర్శించారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు మంగళవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘పోలవరం ప్రాజెక్టు వెరీ వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్.
అది ఎవరికీ అర్థం కాదు. ఎందుకంటే నాకే అర్థం కాలేదు. పోలవరం ప్రాజెక్టుకు ఎన్నోసార్లు వెళ్లాను. ఎంతోమంది నిపుణులను అడిగాను. అయినా నాకు అర్థం కాలేదు’ అన్నారు. కాఫర్ డ్యామ్‌లు నిర్మించకుండా డయాఫ్రమ్‌వాల్ కట్టినందునే దెబ్బతిన్నదని అంబటి సూత్రీకరించారు. అంబటి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2019లో వైసీపీ అధికారపగ్గాలు చేపట్టాక.. 2020 డిసెంబరు నాటికి, 2021 ఆగస్టు నాటికి.. 2022 డిసెంబరు నాటికల్లా పోలవరం ప్రాజెక్టుని పూర్తిచేస్తామంటూ డెడ్‌లైన్లు విధిస్తూ వచ్చింది తప్ప.. చేసిందేమీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా ప్రకటనలు చేసిన రోజున కాఫర్‌డ్యామ్ నిర్మించలేదని తెలియదా అని నిపుణులు నిలదీస్తున్నారు. పోలవరానికి జగన్ హయాంలో ఎంత వ్యయం చేశారో వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతా అయిపోయాక.. పోలవరం ప్రాజెక్టు కాంప్లికేటెడ్ అంటూ అంబటి గొంతు చించుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.