AP High Court : విజిలెన్స్‌కు అపరిమిత అధికారాలపై కౌంటర్ వేయండి
ABN , Publish Date - Jun 28 , 2024 | 04:48 AM
విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ శాఖకు అపరిమిత అధికారాలు కట్టబెట్టాలంటూ ఆ శాఖ ఐజీ రఘురామిరెడ్డి ప్రభుత్వానికి రాసిన లేఖపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. విచారణను జూలై 8కి వాయిదా వేసింది.
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
అమరావతి, జూన్ 27(ఆంధ్రజ్యోతి): విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ శాఖకు అపరిమిత అధికారాలు కట్టబెట్టాలంటూ ఆ శాఖ ఐజీ రఘురామిరెడ్డి ప్రభుత్వానికి రాసిన లేఖపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. విచారణను జూలై 8కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి గురువారం ఆదేశాలిచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఐజీ రఘురామిరెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. ‘రాష్ట్రంలోని ఏ కార్యాలయాన్ని, సంస్థనైనా సందర్శించేందుకు, తనిఖీ చేసేందుకు, రికార్డులు జప్తు చేసేందుకు, వారెంట్ లేకుండా అరెస్టు చేసేందుకు వీలుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖలో పనిచేసే గెజిటెడ్ అధికారులను అధీకృత అధికారులుగా నియమించాలి.
అపరిమిత అధికారాలు కల్పించాలి’ అని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ లేఖను సవాల్ చేస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లేఖకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి తీసుకున్న చర్యలను చట్ట, రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరారు. లేఖ ఆధారంగా చర్యలు చేపట్టకుండా సీఎం సహా సంబంధిత అధికారులు ఎలాంటి ఉత్తర్వులు, నోటీసులు, సర్క్యులర్లు, ఆర్డినెన్స్ జారీ చేయకుండా నిషేధం విధించాలని కోరారు.
ఈ వ్యాజ్యం గురువారం మరోసారి విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున న్యాయవాది అఖిల్ చౌదరి వాదనలు వినిపిస్తూ.. ‘ఈ వ్యవహారంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. విధానపరమైన నిర్ణయం ఏమైనా తీసుకున్నారా? తీసుకోబోతున్నారా? ఏమి చేయబోతున్నారో స్పష్టతనిస్తూ కౌంటర్ వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి’ అని కోరారు. ఈ వాదనలపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఏఏ అంశాలపై కౌంటర్ వేయాలో ఎలా ఆదేశించగలమని ప్రశ్నించారు.