Ayyannapatrudu: ఏపీ సభాపతిగా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవ ఎన్నిక
ABN , Publish Date - Jun 22 , 2024 | 11:30 AM
నవ్యాంధ్రప్రదేశ్ 3వ శాసనసభా సభాపతిగా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయ్యన్న పేరును ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. నూతన స్పీకర్‌గా అయ్యన్న బాధ్యతలు స్వీకరించారు. ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ పక్షనేతలు గౌరవప్రదంగా సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు.
అమరావతి: నవ్యాంధ్రప్రదేశ్ 3వ శాసనసభా సభాపతిగా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయ్యన్న పేరును ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. నూతన స్పీకర్‌గా అయ్యన్న బాధ్యతలు స్వీకరించారు. ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ పక్షనేతలు గౌరవప్రదంగా సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. ఈ కార్యక్రమానికి వైసీపీ అధినేత జగన్ దూరంగా ఉన్నారు. అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అయ్యన్నపాత్రుడు ఎన్నికయ్యారు. ఆయనకు నాలుగు దశాబ్దాలకుపైగా రాజకీయ అనుభవం ఉంది.
1983లో తెలుగుదేశం ఆవిర్భావంతో రాజకీయాల్లోకి అయ్యన్నపాత్రుడు ప్రవేశించారు. అప్పటి నుంచి పార్టీకి అన్ని విధాలుగా అండగా నిలిచారు. ఏడుసార్లు ఎమ్మెల్యే గా.. ఒకసారి ఎంపీగా అయ్యన్నపాత్రుడు విజయం సాధించారు. పట్టభద్రుడైన అయ్యన్నపాత్రుడు ఇప్పటి వరకూ అయిదు సార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. సాంకేతిక విద్య, క్రీడా, రహదారులు భవనాలు, అటవీ, పంచాయతీ రాజ్ వంటి కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. 1983 నుంచి ఇప్పటివరకూ 10 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో, 2 సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో అయ్యన్న పాత్రుడు పోటీ చేశారు.