Chandrababu: మంత్రి పదవుల కోసం టీడీపీలో భారీ పోటీ!
ABN , Publish Date - Jun 07 , 2024 | 02:54 AM
రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కోసం భారీ పోటీ నెలకొంది. ఈసారి పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలు గెలుపొందడంతో మంత్రి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది.
మంత్రి పదవుల కోసం టీడీపీలో
కేబినెట్‌లో చేరనున్న లోకేశ్!
పవన్ చేరికపై రాని స్పష్టత
జనసేనకు 3-4 బెర్తులు
రేసులో నాదెండ్ల, కొణతాల,
కందుల దుర్గేశ్, నానాజీ కూడా
బీజేపీకి రెండు పదవులిచ్చే చాన్సు
జిల్లాలు, సామాజిక సమీకరణల
ఆధారంగా చంద్రబాబు కసరత్తు
అమరావతి, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కోసం భారీ పోటీ నెలకొంది. ఈసారి పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలు గెలుపొందడంతో మంత్రి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. మెరుగైన జట్టును ఎంపిక చేసుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు గట్టి కసరత్తు చేస్తున్నారు. తొలివిడతలో 9 లేదా 18మందితో మంత్రివర్గాన్ని ఏర్పరచి తర్వాత విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. బాబు మంత్రివర్గంలో జనసేనకు 3 లేక 4 బెర్తులు, బీజేపీకి 1 లేదా 2మంత్రి పదవులు ఇవ్వనున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంత్రివర్గంలో చేరతారా లేదా అన్నదానిపై స్పష్టత రాలేదు. ఆయన చేరితే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
పవన్ చేరని పక్షంలో ఆ పార్టీ నుంచి నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, కందుల దుర్గేశ్, పంతం నానాజీల్లో ఇద్దరు ముగ్గురికి అవకాశం రావచ్చని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. బీజేపీ నుంచి సుజనా చౌదరి, డాక్టర్ పార్థసారథి, సత్యకుమార్‌లలో ఇద్దరికి అవకాశం ఉండవచ్చని సమాచారం. టీడీపీ యువనేత లోకేశ్ మంత్రివర్గంలో చేరడం ఖరారైంది. లోకేశ్, మనోహర్ ఇద్దరూ మంత్రివర్గంలోకి వస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొందరు సీనియర్లకు అవకాశం ఉండదని అంటున్నారు. లోకేశ్ మంత్రివర్గంలోకి రానిపక్షంలో ధూళిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులులో ఒకరికి చాన్స్ దక్కవచ్చు. కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్‌బాబు, అనగాని సత్యప్రసాద్, తెనాలి శ్రావణ్‌కుమార్ కూడా బెర్తులు ఆశిస్తున్నారు.
గోదావరిలో ఇద్దరు ముగ్గురికి..
ఉభయ గోదావరి జిల్లాల నుంచి టీడీపీ కోటా కింద యనమల రామకృష్ణుడు, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ పేర్లు పరిశీలనకు రావచ్చని, వీరిలో ఇద్దరు ముగ్గురికే అవకాశం దక్కుతుందంటున్నారు. రఘురామకృష్ణరాజు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్లు కూడా పరిశీలనకు తీసుకునే అవకాశం ఉంది.
ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అచ్చెన్నాయుడు, కళావెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, కూన రవికుమార్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పి. నారాయణ మంత్రివర్గంలో చేరడం ఖాయమైంది. మరో బెర్తు కోసం ఆనం రామనారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి మధ్య పోటీ నెలకొంది.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో బీజేపీ కోటా నుంచి సుజనా చౌదరికి అవకాశం లభిస్తే కొందరు టీడీపీ సీనియర్లకు చాన్సులు తగ్గిపోతాయి. ఈ జిల్లా నుంచి కొల్లు రవీంద్ర, శ్రీరాం తాతయ్య, బొండా ఉమా, వెనిగండ్ల రాము పేర్లు పరిశీలనకు రావచ్చంటున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కిశోర్‌కుమార్‌రెడ్డి, అమరనాథ్‌రెడ్డిల్లో ఒకరికి చాన్స్ రావచ్చని అంటున్నారు.
అనంతపురం జిల్లాలో పయ్యావుల కేశవ్, కాల్వ శ్రీనివాసులు, గుమ్మనూరు జయరాం, సబితమ్మ, కందికుంట వెంకటప్రసాద్ పేర్లు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి పేర్లు పరిశీలించే అవకాశం ఉంది.
కర్నూలు జిల్లాలో బీసీ జనార్దనరెడ్డి, కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి, భరత్, ఫరూక్ పేర్లు వినిపిస్తున్నాయి. కడప జిల్లాలో రెడ్డప్పగారి మాధవి, వరదరాజులరెడ్డి, రాంభూపాల్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.