మాంబేడులో జల్లికట్టు జోరు
ABN , Publish Date - Jan 22 , 2024 | 12:27 AM
సంక్రాంతి ముగిసినా జల్లికట్టు జోరు తగ్గలేదు. వెదురుకుప్పం మండలం మాంబేడులో ఆదివారం జల్లికట్టు నిర్వహించారు.

సంక్రాంతి ముగిసినా జల్లికట్టు జోరు తగ్గలేదు. వెదురుకుప్పం మండలం మాంబేడులో ఆదివారం జల్లికట్టు నిర్వహించారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కల్పించడంతో అధిక సంఖ్యలో జనం తరలివచ్చారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు తమ గిత్తల కొమ్ములకు రంగులు దిద్దారు. బహుమతులుగా ఉపయోగించే పట్టీలను రాజకీయ ప్రముఖులు, వివిధ దేవుళ్లు, గిత్తల యజమానుల కుటుంబీకుల ఫొటోలతో కట్టారు. కొన్నింటికి వస్త్రాలనూ కప్పి అల్లిలోకి వదిలారు. ఇలా దూసుకొస్తున్న ఎద్దులను నిలువరించేందుకు యువకులు పోటీ పడ్డారు. ఈ ప్రయత్నంలో కొందరు కింద పడి గాయపడ్డారు. పట్టీలను సొంతం చేసుకునే క్రమంలో గిత్తలతో కుస్తీ పడ్డారు. పట్టీలను చేజిక్కించుకున్న యువకులు కేరింతలు కొట్టారు. మిద్దెలు, గోడలు, చెట్లను ఎక్కి జనం జల్లికట్టును వీక్షిస్తూ.. చప్పట్లు, ఈలలతో హోరెత్తించారు. జల్లికట్టుతో గ్రామం జనసంద్రంగా మారింది. ఈ సందర్భంగా టీడీపీ తరపున అన్నప్రసాద వితరణను ఆ పార్టీ ఎన్‌ఆర్‌ఐ కో-ఆర్డినేటరు గురుసాల కిషన్‌చంద్ ప్రారంభించారు.
- వెదురుకుప్పం