AP Pensions: ఏపీలో పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధం.. ఎవరికి ఎంత పెరిగింది..!?
ABN , Publish Date - Jun 30 , 2024 | 09:39 PM
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచిన సంగతి తెలిసిందే. ఆ పెంచిన పెన్షన్‌ను జులై-01న స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు అందజేయబోతున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచిన సంగతి తెలిసిందే. ఆ పెంచిన పెన్షన్‌ను జులై-01న స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు అందజేయబోతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్దిదారులకు సీఎం పింఛను ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ఇలా పెన్షన్లు పంపిణీ చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. విజనరీ, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన సీబీఎన్‌కు మాత్రమే ఇది సాధ్యమైందని టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.
ఇక అసలు విషయానికొస్తే.. ఏపీలో ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం మొదటి నెల నుంచే ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు పింఛను పెంపు తొలి నెల నుంచే అమలు చేస్తోంది. జులై-01న ఏపీ వ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్ల పంపిణీ జరగనుంది. కాగా.. మొత్తం 28 విభాగాలకు చెందిన లబ్దిదారులకు పెంచిన పింఛన్లు ప్రభుత్వం అందజేయనుంది. ఈ పింఛను పెంచడంతో పాటు గడిచిన మూడు నెలల నుంచి పింఛను పెంపును సీఎం వర్తింపచేశారు. పెరిగిన పింఛను రూ.4000, మూడు నెలలకు సొమ్ము రూ.3000 కలిపి రూ. 7000 ప్రభుత్వం ఇవ్వనున్నది.
ఎవరికి ఎంత పెంపు..?
వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్య కారులు, కళాకారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్ జెండర్స్ వంటి వారికి రూ.4000 పింఛను.
దివ్యాంగులకు రూ.3000 నుంచి ఒకేసారి రూ. 6000 చేసిన కూటమి ప్రభుత్వం.
పూర్తి వైకల్యం ఉన్న వారికి రూ.5 వేల నుంచి రూ.15 వేలకు పెంపు.
తీవ్ర అనారోగ్యంతో (కిడ్నీ, లివర్, గుండె మార్పిడి) ఉండే వారికి ఇచ్చే పింఛను రూ.5000 నుంచి రూ.15000కు పెంపు.
ఈ విభాగంలో పింఛను పొందే వారి సంఖ్య 24318
పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వం పై నెలకు రూ.819 కోట్ల అదనపు ఖర్చు.
పింఛన్ల కోసం రూ. 4408 కోట్లు ఒక్క రోజులో పంపిణీ చేస్తున్న ప్రభుత్వం.
గడిచిన మూడు నెలలకు కలిపి పెంచిన మొత్తం ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.1650 కోట్లు అదనపు ఖర్చు.
గత ప్రభుత్వంలో పింఛను కోసం కేవలం నెలకు రూ.1939 కోట్లు ఖర్చు.
దాదాపు 1,20,097 మందితో పింఛను పంపిణీ కార్యక్రమానికి సమాయత్తం.
ఏడాదికి ఇకపై పింఛన్ల కోసం రూ.34 వేల కోట్లు ఖర్చు చేయనున్న చంద్రబాబు ప్రభుత్వం.
చంద్రబాబు షెడ్యూల్ ఇలా..!
సోమవారం ఉదయం 5:45గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి 06:00గంటలకు పెనుమాక గ్రామానికి చేరుకోనున్నారు. ఉదయం 6:00 నుంచి 6:20 గంటల వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎస్టీ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా ఆయన పింఛన్లు పంపిణీ చేయనున్నారు. 6:30నుంచి 7:15వరకు పెనుమాక మసీదు సెంటర్‌లో ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు, ప్రజలతో మాట మంతి నిర్వహిస్తారు. కార్యక్రమం అనంతరం ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.