Share News

CM Chandrababu : ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదు

ABN , Publish Date - Dec 06 , 2024 | 03:46 AM

రాష్ట్రంలో మద్దతు ధరకు ధాన్యం అమ్ముకోవడానికి ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి చందబ్రాబు స్పష్టం చేశారు. ఇంకా గత ప్రభుత్వంలో మాదిరిగానే వ్యవహరిస్తే మాత్రం ఉపేక్షించేది లేదని అధికారులకు గట్టి హెచ్చరిక చేశారు.

CM Chandrababu : ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదు

  • గతంలో మాదిరిగా చేస్తే ఉపేక్షించను

  • అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక

  • గత ఐదేళ్లూ అన్నదాతలు ఎన్ని బాధలు పడ్డారో చూశాం

  • అందుకే కొనుగోళ్ల విధానంలో సమూల మార్పులు

  • అయినా ఎక్కడైనా సమస్య ఉంటే నేనే వెళ్తా

  • 48 గంటల్లోగా మద్దతు ధర జమ చేయాల్సిందే

  • బియ్యం స్మగ్లింగ్‌కు అధికారులు, ఉద్యోగులదే బాధ్యత

  • ధాన్యం కొనుగోలులో లోపాలపై సీఎం సమీక్ష

అమరావతి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మద్దతు ధరకు ధాన్యం అమ్ముకోవడానికి ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి చందబ్రాబు స్పష్టం చేశారు. ఇంకా గత ప్రభుత్వంలో మాదిరిగానే వ్యవహరిస్తే మాత్రం ఉపేక్షించేది లేదని అధికారులకు గట్టి హెచ్చరిక చేశారు. ఐదేళ్లలో రైతులు పంటలు అమ్ముకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూశామని, అందుకే ఈసారి ధాన్యం కొనుగోళ్లలో సమూల మార్పులు తీసుకువచ్చామని చెప్పారు. అయినప్పటికీ ప్రస్తుత ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో లోపాలు కనిపిస్తున్నాయని, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సమస్యలను అధిగమించాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యం, సహాయ నిరాకరణ కారణంగా రైతులు ఇబ్బందిపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు క్షేత్ర స్థాయికి వెళ్లి ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియలో లోపాలపై ముఖ్యమంత్రి గురువారమిక్కడ ఉండవల్లిలోని తన నివాసం నుంచి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌, కమిషనర్‌ జి.వీరపాండియన్‌, కార్పొరేషన్‌ ఎండీ మన్‌జీర్‌ జిలానీ అమూన్‌, రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని ఆదేశించారు.


‘గతంలో ర్యాండమ్‌ పద్ధతిలో ప్రభుత్వం సూచించిన రైసు మిల్లులకు మాత్రమే ధాన్యాన్ని పంపాల్సి వచ్చేది. ఇప్పుడు రైతులు అమ్మిన ధాన్యాన్ని ఏ మిల్లుకైనా పంపించుకునే సౌలభ్యం కల్పించాం. రైతులు వాట్సాప్‌ ద్వారా తమ పంటను అమ్ముకునే సౌకర్యం కూడా కల్పించాం. గత ప్రభుత్వంలో నెలల తరబడి ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యేవి కాదు. ఇప్పుడు మేం 24 నుంచి 48 గంటల్లోపే ధాన్యం డబ్బులు చెల్లిస్తున్నాం. ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు రైతులు, మిల్లర్లు, అధికారులతో ఉమ్మడి కమిటీలు ఏర్పాటు చేశాం. కొనుగోళ్ల ప్రక్రియను సులభతరం చేసేందుకు తీసుకొచ్చిన విధానాలను సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత కింది స్థాయి అధికారులు, ఉద్యోగులు, ప్రభుత్వ సిబ్బందిపైనే ఉంది. ఽధాన్యాన్ని ఆరబెట్టే యంత్రాల (డ్రయ్యర్లు) ఏర్పాటు ద్వారా ధాన్యంలో తేమ విషయంలో తలెత్తుతున్న సమస్యలకు ఎంతవరకు పరిష్కారం చూపవచ్చో అధికారులే పరిశీలించాలి. రాష్ట్రంలో రేషన్‌ బియ్యం రీ సైక్లింగ్‌, స్మగ్లింగ్‌ పెద్ద మాఫియాగా మారిపోయింది. ఈ సమస్య పరిష్కారానికి అధికార యంత్రాంగం ప్రత్యేక ప్రణాళికతో పని చేయాలి. బియ్యం స్మగ్లింగ్‌పై విచారణ చేసి చర్యలు తీసుకోవడంతోపాటు ఇక మీద ఎక్కడా స్మగ్లింగ్‌ జరగకుండా చూడాలి. జరిగితే అధికారులు, ఉద్యోగులదే బాధ్యత’ అని తేల్చిచెప్పారు.


  • సంచుల కొరత రానివ్వొద్దు..

ధాన్యం అమ్ముకోవడానికి రైతులు సంచుల కోసం ఇబ్బందిపడే పరిస్థితి రాకుండా చూడాలని, రైతులు తమ చుట్టూ తిరగాలనే సంస్కృతిని విడనాడాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వానికి సహకరించబోమని, రైతులను ఇబ్బందులు పెడతామంటే కుదరదని, అలాంటి మిల్లర్లపై చర్యలకు వెనుకాడొద్దని కలెక్టర్లకు సూచించారు. మిల్లుల్లో అన్‌ లోడింగ్‌లో జాప్యాన్ని నివారించేందుకు ధాన్యం రవాణా వాహనాలకు జీపీఎస్‌ విధానాన్ని అమలు చేయాలన్నారు. వాట్సాప్‌ ద్వారా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సక్రమంగా అమలవుతుందా.. ఫలితాలు ఎలా ఉన్నాయనేది కూడా పరిశీలించాలని చెప్పారు. రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల వివరాలను ప్రతి రోజూ మీడియా ద్వారా వెల్లడించాలని, తద్వారా సమాచారం ప్రజలకు చేరుతుందని తెలిపారు.

  • 37 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణ లక్ష్యం

ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో 37 లక్షల మెటిక్ర్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. గత ప్రభుత్వంలో ఈ సమయానికి కేవలం 5.22 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయగా.. ఈ ఏడాది ఇప్పటికి 10,59,457 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొన్నామని చెప్పారు. 48 గంటల వ్యవధిలోనే మొత్తం 1.45 లక్షల మంది రైతుల ఖాతాల్లో మద్దతు ధర జమ చేశామన్నారు. గురువారం నాటికి రూ. 2,331 కోట్లు చెల్లించగా.. ఇందులో రూ.2,202 కోట్లు 24 గంటల్లోనే చెల్లించామని, మిగిలిన రూ. 128 కోట్లు 48 గంటల వ్యవధిలో చెల్లించామని వివరించారు. మొత్తం 14 జిల్లాల్లో కొనుగోళ్లు చేస్తుండగా.. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1.84 లక్షల మెట్రిక్‌ టన్నులు, పశ్చిమగోదావరి-1.81 లక్షలు, ఏలూరు-1.69 లక్షలు, కోనసీమ-1.44 లక్షలు, కృష్ణా జిల్లాలో 1.40 లక్షల మెట్రిక్‌ టన్నుల చొప్పున కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. మరో 9 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయన్నారు.

  • ధాన్యం కొనుగోళ్ల తీరుపై రైతుల నుంచి ఐవీఆర్‌ఎస్‌ ద్వారా సమాచారం తీసుకుంటున్నాం. ఎక్కడైనా సమస్య ఉందని తెలిస్తే.. నేనే స్వయంగా అక్కడకు వెళ్తాను. అక్కడే అధికారులు సమాధానం చెప్పాల్సి వస్తుంది.

  • ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా మద్దతు ఉండి.. నిధులు అందుబాటులో ఉన్నా అధికారులు, ఉద్యోగుల వైఫల్యంతో మాకు చెడ్డపేరు వస్తే ఎందుకు సహించాలి?

- సీఎం చంద్రబాబు

Updated Date - Dec 06 , 2024 | 03:46 AM