Godavari: గోదావరి ఉగ్రరూపం.. గంట గంటకూ పెరుగుతున్న వరద ప్రవాహం..
ABN , Publish Date - Sep 11 , 2024 | 08:07 AM
ఉగ్రరూపంతో గోదావరి పొంగి ప్రవహిస్తోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గంట గంటకూ గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది.
రాజమండ్రి: ఉగ్రరూపంతో గోదావరి పొంగి ప్రవహిస్తోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గంట గంటకూ గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు గోదావరిలో కలుస్తోంది. బ్యారేజ్ వద్ద నీటి మట్టం 14.20 అడుగులకు పెరిగింది. బ్యారేజ్‌కు చెందిన 175 గేట్లు పూర్తిగా ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ నుంచి 13.27 లక్షల క్యూసెక్కులు వరద నీరు దిగువకు విడుదల చేయడం జరుగుతోంది. పాపికొండల విహార యాత్ర తాత్కాలికంగా అధికారులు నిలిపివేశారు. గోదావరి వరద నేపథ్యంలో తూర్పుగోదావరి, అల్లూరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్‌లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. వరద బాధితుల కోసం పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. గోదావరి మహోగ్రరూపంతో జలదిగ్బందంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు ఉన్నాయి. కాజ్ వేలపై వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. పి.గన్నవరం మండలం, మామిడికుదురు మండలాల్లో కాజేవేలు నీట మునిగాయి. నాటుపడవల పైనే ప్రయాణం సాగిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యా సంస్థలకు ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులు సెలవులు ప్రకటించారు. ఆలమూరు మండలంలోని లంక గ్రామాలన్నీ జలదిగ్బంధంలో ఉన్నాయి. సీతానగరం మండలంలోని ములకల్లంక, రాజమండ్రి అర్బన్ మండలం బ్రిడ్జిలంక, కేతవారిలంక, వెదురు లంక ప్రజలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు.17 చోట్ల ఇంజన్ బోట్లను అధికారులు ఏర్పాటు చేశారు
అల్లూరి జిల్లాలోని విలీన మండలాల్లో శబరి, సీలేరు ఉపనదులతో పాటు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. భద్రాచలం-కూనవరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పాఠశాలలుకు సెలవులు ప్రకటించారు. మూడు రోజుల నుంచి ఆర్టీసీ బస్సు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరంలో శబరి, గోదావరి సంగమం వద్ద ఉన్న వంతెనను వరద నీరు తాకింది. సోకిలేరు, చంద్రవంక, చీకటివాగు, కుయుగూరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. చింతూరు మండలంలో 22 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. వీఆర్ పురం మండలం మండలంలోని ప్రధాన రహదారులపై ప్రవహిస్తున్న వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయారు.