Share News

Minister Narayana: అమరావతికి భూములు ఇచ్చే రైతులకు అండగా మంత్రి నారాయణ

ABN , Publish Date - Sep 19 , 2024 | 10:26 PM

అమరావతి రాజధానికి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చే రైతులకు అండగా మంత్రి నారాయణ ఉండనున్నారు. భూములు ఇవ్వడానికి ముందుకువస్తున్న రైతుల ఇళ్లకు స్వయంగా వెళ్లి అంగీకార పత్రాలు స్వీకరించనున్నారు. రైతులకు ఉన్న అనుమానాలు నివృత్తి చేస్తూ వారికి భరోసా ఇస్తున్నారు.

 Minister Narayana: అమరావతికి భూములు ఇచ్చే రైతులకు అండగా మంత్రి నారాయణ

అమరావతి: అమరావతి రాజధానికి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చే రైతులకు అండగా మంత్రి నారాయణ ఉండనున్నారు. భూములు ఇవ్వడానికి ముందుకువస్తున్న రైతుల ఇళ్లకు స్వయంగా వెళ్లి అంగీకార పత్రాలు స్వీకరించనున్నారు. రైతులకు ఉన్న అనుమానాలు నివృత్తి చేస్తూ వారికి భరోసా ఇస్తున్నారు. తుళ్లూరు మండలం రాయపూడి గ్రామ శివారులో సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో పొలాల మధ్య నిమ్మ తోటలో నివాసం ఉంటున్న రైతు కుటుంబం వద్దకు వెళ్లిన మంత్రి నారాయణ వివరాలు అడిగి తెలుసుకున్నారు.


సీఆర్డీఏకు ల్యాండ్ పూలింగ్ ద్వారా 4.91 ఎకరాల భూమిని మంత్రి చేతుల మీదుగా రైతు మెహబూబ్ సుభాని అప్పగించారు. రాజధాని కోసం రైతులు కేవలం 58 రోజుల్లో 34 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాటతో ల్యాండ్ పూలింగ్‌కి కొంత భూమి ఇవ్వలేదని అన్నారు.


గత రెండు రోజుల నుంచి తాను రైతుల వద్దకే వెళ్లి 17 ఎకరాలు తీసుకున్నానని వివరించారు. ఈ రోజు(గురువారం) నిడమర్రు, కురగల్లు, రాయపూడి గ్రామాల్లో 21 ఎకరాలు ఇవ్వడానికి రైతులు ముందుకు వచ్చారని తెలిపారు. ల్యాండ్ పూలింగ్‌కి ఇచ్చిన వారికి 15 రోజుల్లోగా రిటర్న్ బుల్ ఫ్లాట్స్ కేటాయిస్తామని హామీ ఇచ్చారు.


గతంలో లాటరీ విధానం ద్వారా రిటర్నబుల్ ప్లాట్‌లు కేటాయించామని చెప్పారు. ఇప్పుడు ముందుగా భూమి ఇచ్చిన వారికి తమ ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్న ఫ్లాట్స్ ఇస్తామని మాటిచ్చారు. రైతులకు నచ్చిన ఫ్లాట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. దేశంలో టాప్ 5 నగరాల్లో.. అమరావతి ఒకటి ఉండేలా చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.

Updated Date - Sep 19 , 2024 | 10:26 PM