Share News

YCP: వైసీపీ కార్యాలయాలకు నోటీసులు

ABN , Publish Date - Jun 25 , 2024 | 12:27 PM

బాపట్ల జిల్లా: పట్టణంలో వైసీపీ జిల్లా కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకట రమణ పేరుతో నోటీసులు జారీ చేశారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో నోటీసును ఆఫీస్ గోడకు మున్సిపల్ సిబ్బంది అంటించారు. అలాగే సిబ్బంది మోపిదేవికు రిజిస్టర్ పోస్టులో నోటీసులు పంపించారు.

YCP:  వైసీపీ కార్యాలయాలకు నోటీసులు

బాపట్ల జిల్లా: పట్టణంలో వైసీపీ (YCP) జిల్లా కార్యాలయానికి (Offices) నోటీసులు (Notices) ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకట రమణ (Mopidevi Venkataramana) పేరుతో నోటీసులు జారీ చేశారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో నోటీసును ఆఫీస్ గోడకు మున్సిపల్ సిబ్బంది అంటించారు. అలాగే సిబ్బంది మోపిదేవికు రిజిస్టర్ పోస్టులో నోటీసులు పంపించారు. ఎలాంటి అనుమతులు లేకుండా భవనం నిర్మాణం చేశారంటూ బాపట్ల మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు.


అలాగే పల్నాడు జిల్లా, వైసీపీ కార్యాలయంకు ఉడా, లింగంగుంట్ల పంచాయతీ అధికారులు నోటీసులు పంపారు. అనుమతులు లేకుండా భవనం నిర్మాణం చేపట్టారని ఆ నోటీసులో పేర్కొన్నారు. కార్యాలయంకి వచ్చి సమాధానం చెప్పాలన్నారు. నరసరావుపేట మండలం, లింగంగుంట్ల వద్ద అనుమతులు లేకుండా వైసీపీ జిల్లా కార్యాలయం కట్టారు.


కాగా విజయనగరంలో వైసీపీ కార్యాలయ నిర్మాణం మలుపు తిరిగింది. నిన్నటి వరకు నిర్మాణపనుల్లో కార్మికులు తలమునకలై ఉన్నారు. అయితే వైసీపీ కార్యాలయాల అక్రమ నిర్మాణాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో విజయనగరంలోని వైసీపీ కార్యాలయ నిర్మాణానికి కార్పొరేషన్ అధికారులు అనుమతులు లేవని నోటీసులు అతికించారు. దీంతో కార్మికులు పనులు నిలిపివేశారు. గంటల వ్యవధిలోనే వైసీపీ నేతలు ఆ నోటీసులను పీకేసారు.


జగన్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను వైసీపీ కార్యాలయాల నిర్మాణాల కోసం రాష్ట్రవ్యాప్తంగా కారుచౌకగా లీజుకు తీసుకున్నారు. అనుమతులు లేకుండానే జిల్లా కేంద్రాల్లో నిర్మాణాలు చేపట్టారు. 18 జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల భవనాలకు స్థానిక సంస్థల నుంచి అనుమతులు తీసుకోలేదు. శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తాడేపల్లి, నరసరావుపేట, బాపట్ల, నెల్లూరు, నంద్యాల, కడప, అన్నమయ్య, అనంతపురం, పుట్టపర్తి, తిరుపతిలో భవన నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తు కూడా చేయలేదు. విశాఖ, విజయనగరం, మచిలీపట్నం, కర్నూలులో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసినా.. వాటికి ఇంకా అనుమతులు రాలేదు. ఒక్క ఒంగోలులోనే అన్ని అనుమతులు తీసుకుని వైసీపీ జిల్లా కార్యాలయాన్ని నిర్మించారు. అల్లూరి సీతారామరాజు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, చిత్తూరు జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల నిర్మాణాల కోసం కేటాయించిన భూములు ఖాళీగానే ఉన్నాయి. సాధారణంగా భవన నిర్మాణాలు చేపట్టే ముందు స్థానిక సంస్థల అనుమతులు తీసుకుంటారు. అధికారంలో ఉన్నామన్న ధీమానో ఏమో కానీ వైసీపీ కార్యాలయాల నిర్మాణాల కోసం స్థానిక సంస్థల నుంచి ఎలాంటి అనుమతులూ తీసుకోలేదు.


నాడు జగన్‌ ఏమన్నారంటే...

ముఖ్యమంత్రిగా జగన్‌ అధికారపగ్గాలు చేపట్టిన కొత్తలో ప్రజా వేదికకు అనుమతులు లేవంటూ కూల్చివేయించారు. అనుమతులు లేని కార్యాలయంలో కలెక్టర్లు, ఎస్పీలు, సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, మంత్రులతో కూర్చుని ముఖ్యమంత్రి హోదాలో సమీక్షలు నిర్వహించడం ఏమిటంటూ అప్పట్లో జగన్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా అనుమతులు లేని కట్టడాలను కూల్చేస్తామని ప్రకటించారు. అయితే అక్రమ కట్టడాల పేరిట ప్రతిపక్ష నేతలను వేధించారు. పలువురు నేతలకు చెందిన కట్టడాలను కూల్చేశారు. కానీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా వైసీపీ కార్యాలయాల భవనాల నిర్మాణాలు చేపట్టారు. జగన్‌ ప్రభుత్వంలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు శంకుస్థాపనలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరి జగన్‌ చెప్పిన నిబంధనలు ఈ భవనాలకు వర్తించవా? ఆయన చెప్పినట్టు ఈ అక్రమ కట్టడాలనూ కూల్చివేయాలి కదా?


తప్పు చేసి గగ్గోలు

స్థానిక సంస్థలు అనుమతులు లేని భవనాలకు నోటీసులు జారీ చేస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపట్టిన వైసీపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ నిందిస్తోంది. తన తప్పులు కప్పిపెట్టి చంద్రబాబు ప్రభుత్వంపై బురదజల్లాలని చూస్తోంది. అక్రమ నిర్మాణాలను కూల్చేస్తుంటే జగన్‌, ఆయన రోత పత్రిక గతాన్ని మరిచి అన్యాయమంటూ గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందని జగన్‌ భావించారు. కానీ వాస్తవ విషయాలను ప్రజలు గుర్తించడంతో వ్యతిరేకత రావడం లేదు. దీంతో వైసీపీకి పాలుపోవడం లేదు. కిందస్థాయి నేతలు కూడా అక్రమ కట్టడాల కూల్చివేతలపై నోరు మెదపలేకపోతున్నారు. గతంలో చేసిన తప్పులకు వైసీపీ ఇప్పుడు మూల్యం చెల్లిస్తోంది.


విజయనగరం, పుట్టపర్తిలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వైసీపీ జిల్లా కార్యాలయాలకు స్థానిక సంస్థలు నోటీసులు జారీ చేశాయి. విజయనగరం నడిబొడ్డున దాసన్నపేట రింగురోడ్డును ఆనుకుని నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయం భవనానికి సోమవారం టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. భవనం గోడకు నోటీసులను అతికించారు. సర్వే నంబరు 569లో చేపడుతున్న నిర్మాణానికి అనుమతులు లేవని అందులో పేర్కొన్నారు. వెంటనే నిర్మాణ ప్రక్రియ ఆపాలని, వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అలాగే శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వైసీపీ జిల్లా కార్యాలయ భవనాన్ని ఎందుకు కూల్చివేయకూడదో చెప్పాలంటూ పుట్టపర్తి పురపాలక సంఘం టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అధికారులు నోటీసులు జారీ చేశారు.


పార్వతీపురంలో ఎటువంటి అనుమతి లేకుండా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయానికి సంబంధించి నోటీసులు జారీ చేస్తామని పట్టణ టౌన్‌ప్లానింగ్‌ అధికారి తెలిపారు. ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ అధికారులు ఆ భవన నిర్మాణానికి కేటాయించిన స్థలం వివరాలు సేకరించామని చెప్పారు. నోటీసులను జారీ చేసేందుకు అవసరమైన ప్రక్రియను ప్రారంభించామని వెల్లడించారు. ఏదేమైనా వైసీపీ కార్యాలయ భవనం విషయంలో అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తారో వేచి చూడాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

నీట్ పరీక్షలు మళ్ళీ నిర్వహించాలంటూ ఎస్ఎఫ్ఐ నిరసన ర్యాలీ..

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఇంఛార్జి దీపాదాస్ మున్షీ ఫోన్

నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న తెలంగాణ ఎంపీలు

అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీని పట్టుకున్న పోలీసులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 25 , 2024 | 12:33 PM