Share News

Pawan Kalyan: మహిళా సర్పంచ్‌ను వేధించిన ఘటనపై విచారణకు పవన్ ఆదేశం..

ABN , Publish Date - Jul 24 , 2024 | 07:29 PM

నెల్లూరు జిల్లా ముత్తుకూరు సర్పంచ్‌ బూదూరు లక్ష్మి(Bhuduru Lakshmi) సంతకాన్ని ఫోర్జరీ చేసి పంచాయతీ నిధులు స్వాహా చేసిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) విచారణకు ఆదేశాలు జారీ చేశారు. మహిళా సర్పంచ్‍ను కులం పేరుతో దూషించి బెదిరింపులకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Pawan Kalyan: మహిళా సర్పంచ్‌ను వేధించిన ఘటనపై విచారణకు పవన్ ఆదేశం..
Deputy CM Pawan Kalyan

అమరావతి: నెల్లూరు జిల్లా ముత్తుకూరు సర్పంచ్‌ బూదూరు లక్ష్మి(Bhuduru Lakshmi) సంతకాన్ని ఫోర్జరీ చేసి పంచాయతీ నిధులు స్వాహా చేసిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) విచారణకు ఆదేశాలు జారీ చేశారు. మహిళా సర్పంచ్‍ను కులం పేరుతో దూషించి బెదిరింపులకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వైకాపా నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, అతని అనుచరులు తన సంతకాలు ఫోర్జరీ చేసి దూషించారంటూ మహిళా సర్పంచ్ లక్ష్మి.. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో అసెంబ్లీ వద్దకు వెళ్లి డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.


వైసీపీ పాలనలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం..

గత వైసీపీ ప్రభుత్వంలో సర్పంచులను నామ మాత్రం చేసిన వైసీపీ పాలకులు, వారి అనుచరులు పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని డిప్యూటీ సీఎం మండిపడ్డారు. ఎన్డీయే పాలనలో కచ్చితంగా పంచాయతీలను బలోపేతం చేస్తామని అన్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, వైసీపీ నాయకులు మహిళా సర్పంచ్‌ను బెదిరించి, కుల దూషణ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ బూదూరు లక్ష్మి తనకు ఫిర్యాదు చేసినట్లు పవన్ చెప్పారు. ఆమె సంతకం ఫోర్జరీ చేసి కోట్ల రూపాయలు స్వాహా చేసిన ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


మహిళా సర్పంచ్ ఆవేదన చూశా..

సర్పంచ్ లక్ష్మి ఐదేళ్ల పాలనలో ఎన్నో ఇబ్బందులు, అవమానాలు పడిన విషయం ఆమె మాటల్లో తెలుస్తోందని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఆమెను మాజీ మంత్రితో కుమ్మక్కై వైకాపా నాయకులు, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి కులదూషణ చేసి వేధింపులకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. ఊరి నుంచి వెళ్లిపోవాలని బాధితురాలని బెదిరించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోర్జరీ సంతకాలు చేసి నిధులు స్వాహా చేశారని, దీనిపై వెంటనే పూర్తి వివరాలు అందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఘటనపై విచారణ చేపట్టి తగిన న్యాయం చేస్తామని మహిళా సర్పంచ్‌కు హమీ ఇచ్చినట్లు వెల్లడించారు.

Updated Date - Jul 24 , 2024 | 08:55 PM