పెద్ద సారూ.. వసూళ్లూ.. పెద్దగానే..!!
ABN , Publish Date - Sep 26 , 2024 | 11:57 PM
ల్లా రెవెన్యూ శాఖలో ఆయనో పెద్ద సార్.. పెద్ద సార్ అంటే.. మరీ అంత పెద్ద సార్ కాదు కానీ.. మొత్తానికి పెద్దసారే.. ఆయన.. తన స్థాయికి తగ్గట్టు వసూళ్లు కూడా పెద్దగానే చేస్తున్నారు. ఎంత పెద్దగా అంటే జిల్లా వ్యాప్తంగా ఈ వసూళ్లు చేయడానికి ముగ్గురు బ్రోకర్లను పెట్టుకునేంత. ఈ బ్రోకర్లు సార్ చేతికి మట్టి అంటకుండా అంతా తామే చూసుకుంటారు.
22ఏ, ఫ్రీహోల్డ్ ఫైళ్లలో భారీ కలెక్షన్లు
సార్ చేతికి అంటకుండా... బ్రోకర్లే పని కానిచ్చేస్తారు..
కింది స్థాయి సిబ్బందికి ఆయనంటే హడల్
నోరు తెరిస్తే బండబూతులే
కలెక్టరేట్లో ఎక్కడ చూసినా ఆ సార్.. గురించే చర్చ
(రాయచోటి-ఆంధ్రజ్యోతి)/కలెక్టరేట్: జిల్లా రెవెన్యూ శాఖలో ఆయనో పెద్ద సార్.. పెద్ద సార్ అంటే.. మరీ అంత పెద్ద సార్ కాదు కానీ.. మొత్తానికి పెద్దసారే.. ఆయన.. తన స్థాయికి తగ్గట్టు వసూళ్లు కూడా పెద్దగానే చేస్తున్నారు. ఎంత పెద్దగా అంటే జిల్లా వ్యాప్తంగా ఈ వసూళ్లు చేయడానికి ముగ్గురు బ్రోకర్లను పెట్టుకునేంత. ఈ బ్రోకర్లు సార్ చేతికి మట్టి అంటకుండా అంతా తామే చూసుకుంటారు. తమ పనులు చేయించుకునే వాళ్లు సైతం పెద్ద మొత్తంలోనే అడుగుతున్నా అందులోనూ అప్పటి అధికార వైసీపీలోని ముఖ్యులతో చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉండే పెద్దసార్ కాబట్టి.. ఎందుకొచ్చిన తంటరా బాబూ... అనుకుంటూ కిక్కురుమనకుండా అడిగినంత ఇచ్చేశారు. ఇప్పుడు ఈ పెద్దసార్ వసూళ్ల బాగోతం రెవెన్యూ శాఖలో, చుట్టుపక్కల జిల్లాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వంలో 22ఏ, ఫ్రీహోల్డ్ ఫైళ్లను ఆదాయవనరుగా మార్చుకున్న సదరు పెద్ద సారు.. భారీగానే వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ కలెక్టరేట్‌లో ఏవైనా 22ఏ, ఫ్రీహోల్డ్ ఫైళ్లు వేగంగా కదులుతున్నాయి అంటే ఈ పెద్దసారుకు బాగానే ముట్టిందనేది అర్థమవుతుందని పలువురు పేర్కొంటుంటారు. వసూళ్లలోనే కాకుండా తన కింద పనిచేసే సిబ్బందిని బండబూతులు తిట్టడంలోనూ ఆయన పెద్దతనమే చూపించేవాడని చెబుతున్నారు. ఆయన కింద వివిధ సెక్షన్లలో పనిచేసే పలువురు సిబ్బంది ఈయన ఆగడాలు భరించలేకున్నాం. దయవుంచి ఆయనను ఇక్కడి నుంచి బదిలీ చేయించమని కూటమి ప్రభుత్వంలోని ముఖ్యులను కలిసి మొరపెట్టుకున్నారంటే ఈయన పెద్దతనం ఏపాటిదో ఇట్లే అర్థం చేసుకోవచ్చు. ఈ పెద్దసార్ చేసిన పెద్ద పెద్ద పనుల్లో మచ్చుకు కొన్ని..
- జిల్లాలో రాయచోటి, మదనపల్లె, రాజంపేట సబ్ డివిజన్‌లలో చుక్కల భూములు ఎక్కువ. దీంతో వివాదాలు కూడా ఎక్కువే. ఈ నేపధ్యంలో 22ఏ ఫైళ్లు (నిషేధిత భూములు) ఎక్కువగా వస్తుంటాయి. అదే సమయంలో అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండటంతో నిబంధనలతో సంబంధం లేకుండా అడ్డదిడ్డమైన ఫైళ్లు అనేకం వచ్చాయి. ఈ ఫైళ్లను ఆదాయ వనరుగా మార్చుకున్న కొందరు అధికారులు అడ్డూఅదుపు లేకుండా చెలరేగిపోయారు. తాము ఎటువంటి ఫైళ్లు క్లియర్ చేస్తున్నామనే స్పృహ లేకుండా చేసేసి రెండు చేతులా డబ్బు సంపాదించుకున్నారు. ఇలా వచ్చిన ఫైళ్లు వేగంగా క్లియర్ కావడానికి పెద్దసార్ ప్రత్యేక శ్రద్ధ చూపేవాడని ఆరోపణలు ఉన్నాయి. తమ బ్రోకర్ల చేతిలోకి డబ్బు పడగానే ఏ సెక్షన్‌లో పనిచేసే ఒక ఉద్యోగికి ఫోన్ చేసి ఆ ఫైల్ త్వరగా చూడమని బెదిరించేవాడని తెలుస్తోంది. మదనపల్లె మండలం బసినికొండ గ్రామంలో సర్వే నెంబరు 1/1 లో 4.91 ఎకరాలు నిషేధిత జాబితా నుంచి బయటపడడం వెనుక భారీ మొత్తం చేతులు మారిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో పెద్దసార్‌కు పెద్దమొత్తమే ముట్టినట్లు సమాచారం.
- రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లె చెందిన ఓ వైసీపీ నాయకుడు రామాపురం మండలం చిట్లూరు గ్రామం జాతీయ రహదారికి పక్కన ఉన్న రెండు ఎకరాల పొలం ఫైల్ క్లియర్ కోసం రూ.40 లక్షలు సమర్పించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
- రాయచోటి పట్టణం పెమ్మాడపల్లె గ్రామం గున్నికుంట్ల రోడ్డులో ఓ చుక్కల భూమిని నిబంధనలకు విరుద్ధంగా క్లియర్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికోసం ఈ పెద్దసార్ రూ.5 లక్షలు తీసుకున్నట్లు కలెక్టర్ కార్యాలయం, రాయచోటి తహసీల్దార్ కార్యాలయం కోడై కూస్తోంది.
- గతంలో సుండుపల్లె మండలంలో పనిచేస్తున్న ఓ తహసీల్దార్‌ను మదనపల్లె సబ్‌డివిజన్ బదిలీ చేసేందుకు మామూళ్లు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
- రాయచోటి మండలం సుద్దలవాండ్లపల్లె రోడ్డులో సర్వే నెంబరు 535, 533లో కొంత చుక్కల భూమికి ఎన్‌వోసీ ఇచ్చేందుకు ఇటీవలే సదరు పెద్దసార్ ఫైల్ ముందుకు నడిపినట్లు సమాచారం. అయితే ఆయన కంటే పెద్దసార్ ఆ ఫైల్‌లో లోపాలున్నాయని తిరస్కరించినట్లు తెలుస్తోంది.
- 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ప్రతి మండలానికి ఎన్నికల బడ్జెట్ విడుదల అయింది. తహసీల్దార్లకు ఈ మొత్తం ఇవ్వడంలోనూ ఆ సార్ చిలక్కొట్టుడు కొట్టాడనే ఆరోపణలు ఉన్నాయి.
- కొత్త జిల్లాలో తనకు వాహన సదుపాయం లేకపోయినా ప్రతి నెలా వాహన అలవెన్స్ తీసుకుంటున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.
- సుమారు మూడు నెలల క్రితం ప్రమాదవశాత్తు టిప్పర్ తగిలి జాతీయ రహదారి దగ్గర ఉన్న కలెక్టరేట్ ఆర్చి ధ్వంసం అయింది. దానిని రిపేరు చేయించడానికి ఆర్‌అండ్‌బీ శాఖ వేసిన అంచనా మొత్తం కంటే ఎక్కువగా బిల్లు పెడితే ఆయన కంటే పెద్దసార్ దానిని తిరస్కరించినట్లు ప్రచారంలో ఉంది.
ఫ్రీహోల్డ్‌లో కాసుల పంటే
వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీహోల్డ్ చట్టం లబ్ధిదారులకు ఎంత మేలు చేసిందో కానీ.. రెవెన్యూలో పలువురికి కాసుల పంటే పండించిందని చెప్పవచ్చు. జిల్లా వ్యాప్తంగా లక్షా 42 వేల ఎకరాలు ఫ్రీహోల్డ్‌లో ఉండగా అందులో 4800 ఎకరాలు ఇప్పటికే రిజిస్టర్ కూడా అయిపోయాయి. అందులో దాదాపు 45 శాతం అక్రమంగా జరిగినట్లు ఇటీవలే రెవెన్యూ అధికారులు తమ విచారణలో తేల్చారు. ఈ ఫైళ్లలో పెద్దసార్‌కు పెద్ద వాటానే దక్కినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నిర్ధేశించిన నిబంధనలు లేకపోయినా అన్ని వేల ఎకరాలు ఎలా జరిగాయో? ఆ ఫైళ్లు క్లియర్ కావడానికి ఈ పెద్దసార్ ఏ విధంగా సంతకం చేశాడో? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
అన్నీ చూసుకునే ముగ్గురు బ్రోకర్లు
ఈయన మామూళ్ల వ్యవహారాన్ని ఒక్కో రెవెన్యూ డివిజన్‌కు ఒక్కో బ్రోకర్ పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ముగ్గురూ ఈయన సామాజికవర్గానికి చెందిన బయటి వ్యక్తులు కావడం విశేషం. రాయచోటిలో పుష్ప.... మదనపల్లెలో సత్య... రాజంపేటలో హనుమంతు.. అనే వాళ్లు బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. కలెక్టర్ కార్యాలయానికి 22ఏ ఫైల్ రాగానే ఈయనే తన బ్రోకర్లను రంగంలోకి దింపేవాడని సమాచారం. ఆ బ్రోకర్లు ఫైల్ పంపిన వ్యక్తులతో మాట్లాడి డీల్ సెట్ చేసే వాళ్లని పలువురు పేర్కొంటున్నారు. బ్రోకర్ల చేతికి డబ్బు పడగానే ఫైల్ కదలికలో వేగం పెరిగేదని తెలుస్తోంది. మదనపల్లె, రాజంపేట బ్రోకర్లు తాము వసూలు చేసిన మొత్తాన్ని రాయచోటిలోని బ్రోకర్ చేతికి ఇచ్చేవారని సమాచారం. ఈ మొత్తం కూడా ఎప్పటికప్పుడు కాకుండా.. నెలకో, రెండు నెలలకో ఈ సార్ తీసుకునేవాడని సమాచారం.
నోరు తెరిస్తే బండబూతులే
ఏ యూనివర్సిటీ అయినా బండబూతులు తిట్టే వాళ్లకు పీహెచ్‌డీ ఇచ్చేట్లయితే మా సార్‌కు ఇచ్చేయవచ్చు.. ఇదీ ఈయన కింద వివిధ సెక్షన్లలో పనిచేసే సిబ్బంది మనసులో మాట. సిబ్బందిని ఎంత మాట అంటే..అంత మాట అనేస్తాడని పలువురు వాపోతున్నారు. పత్రికల్లో రాయలేని విధంగా బూతులు తిడతాడని ఆవేదన చెందుతున్నారు. గతంలో ఓ సెక్షన్ సూపరింటెండెంట్‌పై ఈ సార్ దురుసుగా ప్రవర్తిస్తే.. అప్పుడున్న కలెక్టర్ ఇతడితో క్షమాపణలు చెప్పించినట్లు తెలిసింది. ఈ పెద్దసార్ ఉండే.. పెద్ద ఇంటికి నెలనెలా బాడుగను ఈయనకు మామూళ్లు వసూలు చేసి పెట్టే బ్రోకర్లే చెల్లిస్తుండటం విశేషం.