ఉత్సవమూర్తుల ఊరేగింపులో ఉద్రిక్తత
ABN , Publish Date - Aug 29 , 2024 | 12:00 AM
చెన్నూరులో శివపార్వతుల విగ్రహాల ఊరేగింపులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. వివరాలిలా..
ఇరువర్గాల మోహరింపు
పోలీసుల రంగప్రవేశం
చెన్నూరు, ఆగస్టు 28 : చెన్నూరులో శివపార్వతుల విగ్రహాల ఊరేగింపులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. వివరాలిలా..
చెన్నూరు ట్రంకురోడ్డులో దాదాపు 500 ఏళ్ల క్రితం నిర్మించిన నాగలింగేశ్వర ఆలయం ఉంది. దాని ఎదురుగానే ఖిల్లా మసీదు ఉంది. ఖిల్లా మసీదులో ఎప్పుడు నమాజ్ చేసినా శివాలయంలో భక్తులు పూజా కార్యక్రమాలు, మంగళవాయిద్యాలు నిలిపివేసి సహకరిస్తుంటారు. కాగా.. రెండురోజుల క్రితం నాగలింగేశ్వరాలయంలో ధ్వజస్తంభ శిఖర కలశ ప్రతిష్ఠ మహోత్సవాలు ప్రారంభించారు. గురువారం నాటితో ఈ ఉత్సవాలు పూర్తికానున్నాయి. దాతలు ఇచ్చిన ఉత్సవ విగ్రహాలను బుధవారం ఉదయం ఊరేగించాలని భక్తులు నిర్ణయించారు. ఈ ఊరేగింపును శివాలయానికి ఎదురుగా మసీదుకు ఉత్తరం వైపుగా తీసుకెళ్లారు. అయితే మసీదుకు చెందిన కొందరు ఊరేగింపును మసీదు ముందు వైపు ట్రంకు రోడ్డు గుండా నిర్వహించాలని.. మసీదు ఉత్తరం వైపు చేస్తే ఒప్పుకోమంటూ వాదనకు దిగారు. దీంతో పెద్ద ఎత్తున వాదనలు జరిగాయి. పరిస్థితి విషమించే పరిస్థితి ఏర్పడడంతో సీఐ పురుషోత్తంరాజు అక్కడకు వచ్చి ఇరువర్గాలకు నచ్చచెప్పి పంపించారు. ఈ లోగా క్రేన సహాయంతో ఆలయంలో ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయడం మొదలు పెట్టారు. ఇరువర్గాలు మళ్లీ అక్కడకు పెద్దఎత్తున చేరుకుని వాదనకు దిగడంతో పోలీసు శాఖ ఉన్నతాధికారులకు సీఐ సమాచారం అందించారు. దీంతో చెన్నూరుకు ప్రత్యేక పోలీసు దళం వచ్చింది. అలాగే అడిషనల్ ఎీస్పీ వెంకటరాముడు, సీఐలు బాబా, సయ్యద్‌హాసం, సిబ్బంది వచ్చారు. మేం ప్రశాంతంగా ఊరేగింపు నిర్వహిస్తున్నాం, మాకు అడ్డు తగలడమేమిటని ఏఎస్పీని ఆలయ నిర్వాహకులు ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లుగా ఇదే మార్గంలో ఊరేగింపు జరుగుతోందన్నారు. చివరకు ఏఎస్పీ వారికి నచ్చచెప్పి.. మసీదు పక్క నుంచి వెళ్లిన ఉత్సవమూర్తుల ఊరేగింపు తిరిగి హైస్కూలు, పాతబస్టాండు మీదుగా ఆలయానికి వచ్చేలా చేశారు.
అనంతరం ఏఎస్పీ ఆధ్వర్యంలో ఇరువర్గాలను పిలిపించి పోలీస్ స్టేషన ఆవరణలో సమావేశం ఏర్పాటు చేశారు. ఇరువర్గాలు శాంతియుతంగా ఉండాలని సమావేశంలో సీఐ పదేపదే చెప్పారు. అయినా ఇరువర్గాలు వాదులాటకు దిగారు. దీంతో ఏఎస్పీ వెంకటరాముడు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య చిన్నదైనా దానిని భూతద్దంలో చూసే ప్రయత్నం మానుకోవాలన్నారు. అందరూ కలిసిమెలిసి ఉంటేనే మత సామరస్యం వెల్లివిరుస్తుందని అన్నారు. ఎప్పుడూ లేని విధంగా ఒక చిన్న విషయానికి ఇంత రాద్ధాంతం చేయడం, ఇరువర్గాలను మోహరించడం సరైన పద్ధతి కాదన్నారు. గురువారం జరిగే కార్యక్రమానికి అందరూ సహకరించాలని అక్కడ ఎలాంటి గొడవలు జరగరాదని గట్టిగా చెప్పారు.
మసీదు, శివాలయం వద్దే పోలీసుల మకాం
శివపార్వతుల ఊరేగింపులో తలెత్తిన ఉద్రిక్తత నేపథ్యంలో ఏఎస్పీ వెంకటరాముడు ఆధ్వర్యంలో సీఐలు పురుషోత్తంరాజు, సయ్యద్ హసం, బాబా తదితరులు బుధవారం రాత్రి స్థానిక ట్రంకు రోడ్డుపైనే కాపలా కూర్చున్నారు. రాత్రివేళ ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా కడప నుంచి అవసరమైన ఫోర్స్‌ను తెప్పించారు. అలాగే ప్రతిష్ఠ కార్యక్రమం అయిపోయేంత వరకు ఇక్కడే ఉంటామని, ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఏఎస్పీ హెచ్చరించారు.