MP Mithun Reddy: మదనపల్లి ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి స్పందన.. సంచలన ప్రకటన
ABN , Publish Date - Jul 25 , 2024 | 05:01 PM
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కుటుంబంపైనే పెద్ద ఎత్తున అనుమానాలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తొలిసారిగా స్పందించారు...
న్యూ ఢిల్లీ/అన్నమయ్య జిల్లా: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కుటుంబంపైనే పెద్ద ఎత్తున అనుమానాలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తొలిసారిగా స్పందించారు. ‘మదనపల్లి ఆర్‌డీఓ ఆఫీసు ఫైళ్ల దహనంపై పసలేని ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనతో మాకు ఎలాంటి సంబంధం లేదు. మా వ్యక్తిగత ఇమేజ్ దెబ్బ తీసేందుకు కుట్ర జరుగుతోంది. మా ఆస్తుల వివరాలన్నీ ఎలక్షన్ అఫిడవిట్లలోనే ఉన్నాయి. ఈ ఘటనకు సంభందించి నిజానిజాలు ప్రభుత్వం బయటపెట్టాలి. ఈ ఘటనకు సంబంధించి అరెస్ట్ అయిన అనురాగ్ టీడీపీకి చెందిన వారే. మాపై పత్రికలు కథనాలు ప్రచురించే ముందు మా వివరణ తీసుకోవాలి. ఏకపక్షంగా కథనాలు వేయవద్దు. వివరణ అడిగితే నేను అన్ని అంశాలు చెప్తాను. ఇదిలాగే కొనసాగితే పరువు నష్టం దావా వేస్తాం’ అని మిథున్ రెడ్డి చెప్పుకొచ్చారు.
నిరూపిస్తే తప్పుకుంటా!
‘మా ఆస్తుల వివరాలు అఫిడవిట్లలో ఉన్నాయి. చట్టబద్ధంగా ఆదాయ పన్ను కడుతూ వ్యాపారం చేస్తున్నాం. ఎవరి దగ్గర ఒక్క రూపాయి ఎలక్షన్ ఫండ్ తీసుకోలేదు . నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. రికార్డ్స్ తారుమారు చేశారని ఆరోపణలు చేస్తున్నారు. ఇది మా ఇమేజ్ దెబ్బ తీసేందుకు కుట్రలు. సాక్షాదారులు చూపమంటే తోక ముడిచారు. ఆరోపణలు నిరూపించకుంటే క్షమాపణ చెప్పాలి. లేదంటే , పరువు నష్టం దావా వేస్తా’ అని మిథున్ రెడ్డి ఒకింత హెచ్చరించారు.
వందల్లో ఫిర్యాదులు!
ఇదిలా ఉంటే.. మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అక్రమాలు, అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పెద్దిరెడ్డి కుటుంబం చేతిలో మోసపోయిన బాధితులు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి క్యూ కట్టారు. వందల సంఖ్యల్లో భూ బాధితులు కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. మదనపల్లి, పుంగనూరు, తంబళ్లపల్లి, పీలేరు నాలుగు నియోజకవర్గాల నుంచి బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పెద్దిరెడ్డి కుటుంబం దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలకు భయపడి తమ బాధను ఇంతకాలం బయటకొచ్చి చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫైళ్ల దహనం ఘటనపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. మదనపల్లి డివిజన్‌లోని 11 మండలాల తహసీల్దార్‌లతో సిసోడియా సమావేశమయ్యారు. ఫైళ్ల దహనం ఘటనపై పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది.
అనుమానం ఇక్కడే..!
ఇదిలా ఉంటే.. మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు మాధవరెడ్డిని ఆయన ఇంట్లోనే పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. రీ-సర్వేలో పలువురి భూములు తమ అనుకూలమైన వారి పేరిట వైసీపీ నాయకులు మార్పులు చేయించినట్లుగా తెలుస్తోంది. ఒరిజనల్ రికార్డులను సబ్ కలెక్టర్ కార్యాలయంలో రైతులు సమర్పించగా.. రాగానిపల్లి భూముల వ్యవహారంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో విచారణను తప్పుదోవ పట్టించేందుకే ఒరిజనల్ రికార్డులు కాల్చివేశారానే అనుమానాలు వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో కుట్ర కోణం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. సోమవారం నాడు డీజీపీ తిరుమల రావు కూడా మూడు గంటలపాటు నిశితంగా పరిశీలించి.. ఇది యాక్సిడెంట్ కాదని, ఇన్సిడెంట్‌గా అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే.. ఆఫీసులో షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశమే లేదని.. కిటికీ బయట అగ్గిపుల్లలు కూడా కనిపించాయన్నారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తామన్నారు.