Share News

ధగధగ

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:44 AM

ఇంద్రకీలాద్రి దేవీశరన్నవరాత్రులకు శోభాయమానంగా ముస్తాబైంది. ఉత్సవాలను పురస్కరించుకుని మంగళవారం విద్యుత్‌ దీపాలతో అలంకరించిన ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా ప్రకాశించింది. ఓంకారం, కనకదుర్గమ్మ రూపాలు కనుల విందు చేశాయి. వివిధ వర్ణాల విద్యుత్‌ దీపాలతో ఇంద్రకీలాద్రి ధగధగా మెరిసిపోయింది.

ధగధగ

గత వైఫల్యాలను గుర్తిస్తేనే ‘విజయ’వంతం

కీలకమైన పాయింట్లలో నిరంతర పర్యవేక్షణ అవసరం

అనధికారానికి అడ్డుకట్ట వేస్తే అంతా సాఫీ

శరన్నవరాత్రులకు దగ్గర పడుతున్న సమయం

ఇంద్రకీలాద్రి దేవీశరన్నవరాత్రులకు శోభాయమానంగా ముస్తాబైంది. ఉత్సవాలను పురస్కరించుకుని మంగళవారం విద్యుత్‌ దీపాలతో అలంకరించిన ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా ప్రకాశించింది. ఓంకారం, కనకదుర్గమ్మ రూపాలు కనుల విందు చేశాయి. వివిధ వర్ణాల విద్యుత్‌ దీపాలతో ఇంద్రకీలాద్రి ధగధగా మెరిసిపోయింది. భక్తులను తన్మయత్వానికి గురిచేసింది. విజయవాడ నగరమంతటా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది.

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాల అంకురార్పణకు హడావుడి మొదలైంది. మూడో తేదీ నుంచి అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉత్సవాల కోసం అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాన్ని అందంగా ముస్తాబు చేసినప్పటికీ సామాన్య భక్తుల మనస్సు గెలుచుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఉత్సవాల్లో ఇదే కనిపించింది. గంటల తరబడి సుదూరం నడిచిన భక్తుల్లో ముందు జరుగుతున్న కొన్ని పరిణామాలు ఆగ్రహావేశాలను రగిలిస్తున్నాయి. ఈ ఏడాది ఉత్సవాలను విజయవంతం చేయడానికి పోలీస్‌, రెవెన్యూ, వీఎంసీ, దేవదాయ శాఖలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఇప్పటి వరకు ఉత్సవాల్లో ప్రతి ఏడాది ఉత్పన్నమవుతున్న సమస్యలను గుర్తించి పరిష్కరి ంచినప్పుడే ఈ ప్రణాళిలకు ప్రభుత్వం పట్టం కట్టే అవకాశాలు ఉంటాయి. - (ఆంధ్రజ్యోతి - విజయవాడ)

‘బయట’ నుంచే లోపలకు

దసరా ఉత్సవాలు ప్రారంభం రోజు నుంచి మూడు రోజులపాటు భక్తుల సంఖ్య స్వల్పంగా ఉంటుంది. ఆ తర్వాత రద్దీ పెరుగుతుంది. అమ్మవారి దర్శనానికి భక్తులు వినాయకుడి గుడి నుంచి క్యూల్లో ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. దర్శనానంతరం బయటకు వచ్చిన భక్తులు పెద్ద రాజగోపురం వైపు వెళ్లకుండా శివాలయం వైపునకు వెళ్లేలలాలలదవవలా పోలీసులు రావిచెట్టు ముందు బారికేడ్లు ఏర్పాటు చేశారు. బయటకు రావాల్సిన ద్వారం నుంచి కొంతమంది అమ్మవారి దర్శనాలకు వెళ్తుంటారు. వీఐపీల ముసుగులో కొంతమంది, దేవదాయ శాఖ సిబ్బంది పేరుతో కొంతమంది ఇలా లోపలకు వెళ్లే ప్రయత్నం చేస్తుంటారు. ఉత్సవాల్లో విధులు నిర్వర్తించడానికి వచ్చిన సిబ్బంది తమ కుటుంబ సభ్యులను ఈవిధంగానే దర్శనాలకు తీసుకెళ్తుంటారు. ఇక్కడ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులు విధులు నిర్వర్తి స్తారు. వారితో వివాదం పెట్టుకుని మరీ లోపలకు వెళ్తుంటారు. ఇక్కడ నుంచి లోపలకు వెళ్లే భక్తులు పెరిగిపోవడంతో బయటకు వచ్చే ద్వారం వద్ద ప్రతి ఏడాది ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడు తుంది. ఈ ద్వారం నుంచి లోపలకు వెళ్లిన భక్తులు ఆశీర్వచన మండపం నుంచి ప్రధాన ఆలయం వెనుక వైపు మార్గంలో వెళ్లి వీఐపీ భక్తుల క్యూలో కలుస్తారు. వాస్తవానికి ఈ ద్వారం నుంచి ఆలయం లోపల విధులు నిర్వర్తించే సిబ్బంది మాత్రమే వెళ్లడానికి అనుమతి ఉంటుంది. ఇలా విధులు నిర్వర్తించే ప్రతి ఉద్యోగి కచ్చితంగా పాసును ధరించాలి. ఆలయంలో పనిచేసే సిబ్బంది కొంతమంది పాసులు ధరించకపోవడం, వివిధ జిల్లాల నుంచి వచ్చిన పోలీసులకు వారు ఎవరో తెలియకపోవడంతో కొన్నిసార్లు వివాదాలు వస్తున్నాయి. వీఐపీ దర్శన మార్గంలో వెళ్లాల్సిన భక్తులను ఎగ్జిట్‌ ద్వారం వైపు రాకుండా కట్టడి చేస్తే సమస్య ఉండదు.

ఆలయం వెనుక అలజడి

భక్తుల కోసం అధికారులు ఉచిత దర్శనం, రూ.100, రూ.300, రూ.500 క్యూలను ఏర్పాటు చేస్తారు. ఇవి కాకుండా ప్రధాన ఆలయానికి, రూ.500 టికెట్ల క్యూలైన్‌కి మధ్య కొంత ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రొటోకాల్‌ జాబితాలో ఉన్న వారిని దర్శనాలకు తీసుకెళ్తారు. వాస్తవానికి ఈ క్యూలో ప్రొటోకాల్‌ జాబితాలో ఉన్న వారు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్యూ ప్రారంభం వద్ద బారికేడ్‌కు గేటు ఉంటుంది. దానికి ఆలయ అధికారులు తాళాలు వేస్తారు. వీఐపీలు వచ్చినప్పుడు మాత్రమే ఈ గేటును తీస్తారు. చిన్న రాజగోపురం వద్ద ఉన్న ఈవో కార్యాలయం పక్కన ఉన్న మెట్ల నుంచి కొంతమంది అనధికారికంగా వివిధ వ్యక్తుల సిఫార్సులతో నేరుగా వీఐపీ క్యూ వద్దకు వెళ్తారు. గేటుకు తాళాలు వేసి ఉండడంతో భక్తులు ఇక్కడే ఆగిపోతున్నారు. రూ.500 క్యూలోకి వెళ్లాలని పోలీసులు పదేపదే చెప్పినా భక్తులు కదలని పరిస్థితులు ఉన్నాయి. ఈ ఖాళీ ప్రదేశంలో భక్తులు పెరిగిపోవడంతో అధికారులు చేసేది లేక గేటుకు తాళాలు తీయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. తీరా ఇక్కడికి వచ్చిన భక్తులను క్యూలైన్‌లోకి వెళ్లమనే సరికి వారికి ఆగ్రహం వస్తోంది. దీనితో ఇక్కడ వివాదాలు ముసురుతున్నాయి.

ఆ ప్రదేశమే కీలకం

శరన్నవరాత్రుల్లో భక్తుల రాకలన్నీ ఘాట్‌ రోడ్డు మీదుగానే సాగుతాయి. పాసులు ఉన్న వాహనాలను టోల్‌గేట్‌ వద్ద ఉన్న పోలీసులు కొండపైకి అనుమతిస్తారు. కొండపైకి వెళ్లిన తర్వాత ఓం మలుపు వద్ద మరో చెకింగ్‌ పాయింట్‌ ఉంటుంది. ఇక్కడ పాసులు ఉన్న వారిని, శరన్నవరాత్రి ఉత్సవాల విధులు నిర్వర్తించే వారిని అనుమతిస్తారు. మిగిలిన వారిని పక్కనే ఉన్న క్యూలైన్లలోకి పంపుతారు. ఇక్కడికి వచ్చిన భక్తులు కొంతమంది ఏదో ఒక సిఫార్సుతో ఈ చెకింగ్‌ పాయింట్‌ దాటుకుని వెళ్తున్నారు. మౌనముని విగ్రహం ఉన్న ప్రదేశంలో మీడియా పాయింట్‌ ఉంటుంది. దీనికి ముందు మరో చెకింగ్‌ పాయింట్‌ ఉంటుంది. మీడియా పాయింట్‌కు చెంతన రెండు డీఎఫ్‌ఎండీలు ఉంటాయి. వాటికి పక్క నుంచి క్యూలైన్‌లు వెళ్తాయి. ఈ క్యూలైన్లకు పక్కన విశాల ప్రదేశం ఉంటుంది. ఇక్కడ అధికారులు కూర్చుంటారు. మీడియా ప్రతినిధులు ఇక్కడే ఉంటారు. ఓం మలుపు, మౌనముని విగ్రహం వద్ద ఉన్న చెకింగ్‌ పాయింట్‌ దాటుకుని కొంతమంది ఈ ఖాళీ ప్రదేశంలోకి వచ్చి రాజగోపురం కింద నుంచి దర్శనాలకు వెళ్తున్నారు. ముందు ఉన్న చెకింగ్‌ పాయింట్లు దాటుకుని రావడంతో ఇక్కడ బందోబస్తు నిర్వహించే పోలీసులు గానీ, దేవదాయ సిబ్బంది గానీ వారిని ప్రశ్నించడం లేదు. ఇంత వరకు వచ్చారంటే వాళ్లంతా ఎవరో ఒకరి సిఫార్సులతో వచ్చి ఉంటారని భావిస్తున్నారు. రూ.500 టికెటు కొనుగోలు ఆ లైన్‌లో వెళ్లాల్సిన భక్తులు వాటిని చూపించి రాజగోపురం వద్ద నుంచి దర్శనాలకు వెళ్లిన దాఖలాలు ఇంతకుముందు కనిపించాయి. ఇలాంటి వారిని ఓం మలుపు, మౌనముని విగ్రహం వద్ద ఉన్న చెకింగ్‌ పాయింట్ల వద్ద కచ్చితంగా నిలుపుదల చేయాలి. లేకపోతే రాజగోపురం వద్ద అనధికార దర్శనాల భక్తులు పెరిగిపోయే అవకాశం ఉంది. ఇలా గుంపులు గుంపులుగా క్యూలైన్లలో ఉన్న భక్తులు వెళ్లడంతో గంటల తరబడి నిలబడి ఉన్న వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిణామంతోనే రూ.500క్యూలో ఉన్న భక్తులు ఈవో డౌన్‌డౌన్‌ అంటూ రెండేళ్ల కిందట ఉత్సవాల్లో నినాదాలు చేశారు. రాజగోపురం వైపు ఉన్న మార్గం నుంచి వీఐపీలను తప్ప ఇతర వ్యక్తులు వెళ్లకుండా అధికారులు పక్కాగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఒకేసారి గుంపులుగా

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీఐపీ దర్శనాలకు గుంపులు గుంపులుగా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అప్పటి మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు దీనికి ఆద్యుడు. ఆయన దర్శనానికి వచ్చినప్పుడు ఉదయం, సాయంత్రం పూట వెంట 100 మందికి తక్కువ కాకుండా చూసుకుని తీసుకెళ్లేవారు. ఆయన అధికారంలో ఉండడంతో ఆలయ అధికారులు గానీ, బందోబస్తు నిర్వహించిన పోలీసులు గానీ అభ్యంతరం చెప్పే సాహసం చేయలేదు. గంటల తరబడి క్యూల్లో నిలబడిన భక్తుల ఎదురుగానే అంతమంది వీఐపీ దర్శనానికి ఒకేసారి వెళ్లడం అనేక విమర్శలు తావిచ్చింది. అయినా ఆయన పద్ధతి మార్చుకోలేదు. మంత్రి పదవి పోయిన తర్వాత ఇదేవిధంగా వ్యవహరించారు. వీఐపీ దర్శనాలకు వెళ్లడమే కాకుండా అంతమందికి అంతరాలయం దర్శనాలు చేయించేవారు. సాధారణంగా శరన్నవరాత్రుల్లో అంతరాలయం దర్శనాలను రద్దు చేస్తారు. ఆయన మాత్రం తన మందిమార్బలంతో వచ్చి అంతరాలయం దర్శనాలు చేయించుకునేవారు. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - Oct 02 , 2024 | 07:51 AM