వివాదాల వర్సిటీ
ABN , Publish Date - May 21 , 2024 | 01:24 AM
కృష్ణా యూనివర్సిటీ వివాదాల వర్సిటీగా మారింది. పరిపాలనా అంశాల్లో తరచూ గొడవలు చోటుచేసుకుంటున్నాయి. విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించిన నగదును ఇష్టానుసారంగా ఖర్చు చేస్తుండటంతో ఉద్యోగులు, అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. యూనివర్సిటీ అధికారుల తీరుపై ఉన్నతవిద్యాశాఖ మండలికి ఫిర్యాదులు చేస్తున్నారు. విద్యార్థులకు మార్కుల జాబితాలు ఇచ్చేందుకు నిబంధనలు అమలుచేస్తున్న యూనివర్సిటీ అధికారులు నిధులను వినియోగించడంలో నిబంధనలు ఎందుకు పాటించడం లేదని వివాదం రేగుతోంది.

కారు అద్దె నెలకు రూ.59,999
50 నెలలుగా ఒకే ఏజెన్సీకి కారు అద్దె కాంట్రాక్టు
పీజీ సెమిస్టర్ ఫలితాలు విడుదల చేసినా గ్రేడ్‌కార్డులు ఇవ్వని వైనం
ఫీజులు చెల్లించాకే మార్కుల జాబితాలు ఇస్తారట
నూతన భవనాలకు మరమ్మతుల పేరుతో రూ.3 కోట్ల బిల్లులు
కృష్ణా యూనివర్సిటీ వివాదాల వర్సిటీగా మారింది. పరిపాలనా అంశాల్లో తరచూ గొడవలు చోటుచేసుకుంటున్నాయి. విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించిన నగదును ఇష్టానుసారంగా ఖర్చు చేస్తుండటంతో ఉద్యోగులు, అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. యూనివర్సిటీ అధికారుల తీరుపై ఉన్నతవిద్యాశాఖ మండలికి ఫిర్యాదులు చేస్తున్నారు. విద్యార్థులకు మార్కుల జాబితాలు ఇచ్చేందుకు నిబంధనలు అమలుచేస్తున్న యూనివర్సిటీ అధికారులు నిధులను వినియోగించడంలో నిబంధనలు ఎందుకు పాటించడం లేదని వివాదం రేగుతోంది.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : వీసీ, రిజిస్ర్టార్‌ల కోసం యూనివర్సిటీ తరపున కార్లు ఉన్నా వాటిని పక్కన పెట్టేశారు. 50 నెలలుగా అద్దెకార్లను తీసుకుని నెలకు రూ.59,999 చొప్పున చెల్లిస్తున్నారు. టెండర్లు పిలవకుండా దొడ్డిదారిన గుట్టుచప్పుడు కాకుండా కార్ల కాంట్రాక్టును గత 50 నెలలుగా ఒకే ఏజెన్సీకి కట్టబెట్టారు. దీనిపై సహచట్టం ద్వారా ఇటీవల కొందరు ప్రొఫెసర్లు వివరాలు కోరారు. ఉన్నత విద్యామండలి అధికారులకు సైతం ఈ అంశంపై పిర్యాదు చేశారు. అయినా చర్యలు లేవు. ఇదే కారు వేరే జిల్లాలో గతంలో ప్రమాదానికి గురైందని, మరమ్మ తుల కోసం రూ.2.40 లక్షల మేర బిల్లులు చేసిన అంశం వెలుగులోకి వచ్చింది.
పూర్తిస్థాయిలో ఫీజులు కట్టినట్లుగా చూపితేనే సర్టిఫికెట్లు
యూనివర్సిటీలో ఎంబీఎ, ఎంకాం, ఎమ్మెస్సీ విద్యార్థులకు ఒకటి నుంచి మూడు సెమిస్టర్‌లకు సంబంధించిన గ్రేడ్ కార్డులు ఇవ్వకుండా ఏడాదిన్నర కాలంగా తొక్కిపెట్టేశారు. విద్యార్థులు మార్కుల జాబితాలు కావాలని కోరితే పూర్తిస్థాయిలో ఫీజులు చెల్లించినట్లుగా నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకువస్తే గ్రేడ్ కార్డులు ఇస్తామని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు.
నూతన భవనాలకు రూ.3కోట్లతో మరమ్మతులట
యూనివర్సిటీ నూతన భవనాలను రూ.87 కోట్లతో నిర్మించారు. నాలుగేళ్ల వ్యవధిలోనే నూతన భవనాలకు రూ.3 కోట్లతో మరమ్మతులు చేసినట్లుగా చూపి బిల్లులు చేసిన అంశంపై కొందరు ప్రొఫెసర్లు, ఉద్యోగులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. యూనివర్సిటీకి సంబంధించి తాగునీటి పైప్‌లైన్ నిర్మాణం కోసం గతంలో రూ.50 లక్షలను ఖర్చు చేశారు. ఈ నగదును ప్రభుత్వం నుంచి తీసుకోకుండా విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించిన నగదు నుంచి మళ్లించారు. అధికార పార్టీ నాయకుడి అనుయాయుడికి ఈ కాంట్రాక్టును కట్టబెట్టడంపైనా అధ్యాపకులు ఇటీవల గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. కృష్ణా యూనివర్సిటీలో పనిచేస్తున్న అధ్యాపకులు, ఇతర సిబ్బంది 78 మంది ఇటీవల మాజీమంత్రి కొల్లు రవీంద్రను ఆయన నివాసం వద్ద కలిసి అవకతవకలను వివరించారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత యూనివర్సిటీకి వచ్చి అక్కడి పరిస్థితులను గమనించి తదుపరి చర్యలు తీసుకుంటామని కొల్లు రవీంద్ర ఉద్యోగులకు హామీ ఇచ్చారు.