Share News

కుమ్మేయ్‌... అమ్మేయ్‌!

ABN , Publish Date - Jul 18 , 2024 | 04:33 AM

ఎకరానో, పదెకరాలో కాదు దాదాపు 25 వేల ఎకరాలు! గత ప్రభుత్వం ఇండోసోల్‌కు కారుచౌకగా.. ఎకరం 5 లక్షలు చొప్పున ధారాదత్తం చేసింది.

కుమ్మేయ్‌... అమ్మేయ్‌!

జగన్‌ మార్కు కొత్త దందా

అధికారంలో ఉన్నప్పుడు అస్మదీయ కంపెనీలకు జనం సొమ్మును కుమ్మేయడం! అధికారం పోగానే... ఆ కంపెనీలను మరొకరికి అమ్మేయడం! దీనివల్ల రెండు లాభాలు! అవినీతి ద్వారా సంపాదించిన బ్లాక్‌ మనీని ‘వైట్‌’ చేసుకోవడం! కంపెనీని విదేశీ సంస్థలకు విక్రయించినందున పాపాలు ‘మాఫీ’ చేసుకోవడం! ఇది ‘జగన్‌ మార్కు’ దందా!

ఇండోసోల్‌ కంపెనీ విక్రయానికి సన్నాహాలు

కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్‌కు అమ్మకం!?

ఎన్నికల ముందు ఇండోసోల్‌కు భూసంతర్పణ

ఎకరా 5 లక్షలు చొప్పున 25 వేల ఎకరాలు

యజమానులు జగన్‌ అస్మదీయులే

సర్కారు మారడంతో పాపాలు కప్పిపెట్టే యత్నం

ప్రస్తుతం బ్రూక్‌ఫీల్డ్‌కు 5 వేల ఎకరాలు అమ్మేసి

వేల కోట్లు క్యాష్‌ చేసుకోవాలని ప్రయత్నాలు

అడ్డుకోకుంటే భారీ నష్టమంటున్న నిపుణులు

ఎకరానో, పదెకరాలో కాదు దాదాపు 25 వేల ఎకరాలు! గత ప్రభుత్వం ఇండోసోల్‌కు కారుచౌకగా.. ఎకరం 5 లక్షలు చొప్పున ధారాదత్తం చేసింది. సంప్రదాయేతర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటు పేరిట కట్టబెట్టింది. అసలు విషయం ఏంటంటే.. ఈ కంపెనీ యజమానులు విశ్వేశ్వరరెడ్డి, శరత్‌చంద్రారెడ్డి, రవికుమార్‌రెడ్డి.. నాటి సీఎం జగన్‌కు అస్మదీయులు. అంతే... ఎన్నికల ముందు ఆగమేఘాలపై అనుమతులు, ఉత్తర్వులు, భూకేటాయింపులు జరిగిపోయాయి. ప్రభుత్వం మారడంతో ఇప్పుడు భూములతో సహా కంపెనీని గంపగుత్తగా భారీ ధరకు అమ్మేసి వేలకోట్లు క్యాష్‌ చేసుకోవాలని పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. అంటే... నాటి పాపాలను సమాధి చేసి, అక్రమ సొమ్మును ‘వైట్‌’గా మార్చుకోవడమన్న మాట! ప్రస్తుతం 5 వేల ఎకరాలను కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్‌ కంపెనీకి బేరం పెట్టినట్టు సమాచారం. కూటమి సర్కారు వెంటనే ఈ ప్రయత్నాలను ఆపకపోతే రాష్ట్రానికి భారీ నష్టం జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

జగన్‌ జమానాలో ఆయన అస్మదీయులు భారీగా ‘మేళ్లు’ పొందారు. అతి తక్కువ పెట్టుబడితో వందల కోట్ల విలువైన ప్రాజెక్టు ప్రతిపాదనలు చేసి.. వేల ఎకరాల భూములు కొట్టేశారు. ముఖ్యంగా ఇంధన రంగంలో కారుచౌకగా భూములు సొంతం చేసుకున్నారు. ఎన్నికల్లో జగన్‌ ప్రభుత్వం ఓడిపోయి కూటమి సర్కారు వచ్చింది. దీంతో అప్పట్లో మేళ్లు పొందిన కంపెనీలు ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా పాపాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు మొదలెట్టేశాయి. భూములను భారీ ధరకు అమ్ముకుని క్యాష్‌ చేసుకోవాలని చూస్తున్నాయి. జగన్‌ అస్మదీయులకు చెందిన ఇండోసోల్‌ సరిగ్గా ఇదే ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది.

ఎన్నికలకు ముందు పంప్డ్‌ స్టోరేజీలు, సోలార్‌ విద్యుదుత్పత్తి ప్లాంట్లు, పవన విద్యుత్‌ కంపెనీల పేరిట ఇండోసోల్‌కు భారీ ఎత్తున నజరానాలు దక్కాయి. చీకటి ఒప్పందాలు వెలుగులోకి రాకముందే కంపెనీని చేతులు మార్చేయాలని పావులు కదుపుతున్నట్టు ఇంధన రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా ఇండోసోల్‌.. బ్రూక్‌ఫీల్డ్‌ కంపెనీకి 5వేల ఎకరాల భూములను విక్రయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. తద్వారా వేలకోట్ల రూపాయలను వైట్‌మనీగా మార్చుకునేందుకు ఇండోసోల్‌ ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు ఇండోసోల్‌ దరఖాస్తులు చేసుకున్న కొద్ది గంటల్లోనే కోరిందంతా కట్టబెట్టేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన పెట్టుబడుల కమిటీ, ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల మండలి సమావేశాల్లోనూ అధికారికంగా భారీగా భూసంతర్పణ చేశారు. ఇప్పుడు వాస్తవాలు బయటకు వస్తుండటంతో కంపెనీని బ్రూక్‌ఫీల్డ్‌కు అమ్మేందుకు రంగం సిద్ధం చేసిందని తెలుస్తోంది. రెండు రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా కార్యకలాపాలు జరుగుతున్నాయని, వేల కోట్ల రూపాయలు చేతులు మారబోతున్నాయని చెబుతున్నారు.

నాటి ముఖ్యమంత్రి జగన్‌కు సన్నిహితుడైన పులివెందులవాసి నర్రెడ్డి విశ్వేశ్వరరెడ్డితో పాటు కొల్లా శరత్‌చంద్రారెడ్డి 2022 ఫిబ్రవరి 3న ఇండోసోల్‌ను స్థాపించారు. ఇందులోకి 2022 మార్చి 21న కటారు రవికుమార్‌రెడ్డి చేరారు. ఈ కంపెనీ 2200 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుత్కేంద్రాన్ని, 3500 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను, 1500 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్లాంట్‌ను కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో, ఇంటిగ్రేటెడ్‌ సోలార్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసేందుకు 2024 జనవరి 23న అప్పటి జగన్‌ సర్కారుకు దరఖాస్తు చేసుకుంది. హైదరాబాద్‌లో రిజిస్టర్‌ అయిన ఈ కంపెనీ దరఖాస్తు చేసుకున్న వెంటనే.. అదే రోజున ప్రభుత్వం స్పందించింది. 24 గంటలు గడవక ముందే జనవరి 24న ఇండోసోల్‌ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించాలంటూ ఎన్‌ఆర్‌ఈడీసీ ప్రతిపాదించింది. జనవరి 30న నాటి సీఎం జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పనా మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది. ఇండోసోల్‌ కోరిందంతా ఇచ్చేయాలంటూ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ఫిబ్రవరి 6న ఇంధన శాఖ ఉత్తర్వును కూడా విడుదల చేసింది. అదే రోజున మంత్రివర్గ సమావేశంలోనూ ఇండోసోల్‌కు ప్రోత్సాహకాలు ఇస్తూ ఆమోదముద్ర వేశారు.


ఇండోసోల్‌కు వరాలు

పంప్డ్‌ స్టోరేజీ ప్లాంట్‌ ఏర్పాటుకు తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ సోలార్‌ ప్లాంట్‌కు మెగావాట్‌కు ఆరు ఎకరాలకు తగ్గకుండా ఇండోసోల్‌కు 21,000 ఎకరాలు కేటాయించాలని నాటి జగన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. 1500 మెగావాట్ల పవన విద్యుత్‌కు మెగావాట్‌కు రెండున్నర ఎకరాల భూమి చొప్పున 3,750 ఎకరాలు కేటాయించాలని ఆదేశించింది. ఈ మేరకు అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఊరిచింతల, కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల, కడప జిల్లా మైలవరం మండలంలోని కంబాలదిన్నె, చిన్నవెంతుర్ల, బి.వెంకటాపురం, బేస్తవేముల. నేలనూతల, కల్లుట్లలో సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఇండోసోల్‌కు భూములు కేటాయించారు. నంద్యాల జిల్లాలో డోన్‌ పశ్చిమాన, హేబట్టం, హోళిగుండ మండలంలో సోలార్‌ ప్లాంట్‌కు భూములు కేటాయించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎకరా ఐదు లక్షల రూపాయల చొప్పున ఏకమొత్తం ధరకు దాదాపు 25 వేల ఎకరాల భూములు కేటాయించారు.

5000 ఎకరాలు బేరం!

జగన్‌ ప్రభుత్వంలో వేల ఎకరాలను చేజిక్కించుకున్న ఇండోసోల్‌ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టకుండానే ఇప్పుడు గంపగుత్తగా కంపెనీని చేతులు మార్చేసేందుకు సిద్ధమవుతోందని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా కొలిమిగుండ్ల మండలం బోయలుప్పలూరులోని 5000 ఎకరాలను బ్రూక్‌ఫీల్డ్‌కు అప్పగించేందుకు చేస్తున్న ప్రయత్నాలు చివరకు దశకు చేరుకున్నాయని చెబుతున్నాయి. గత ప్రభుత్వ నిర్ణయాలపై కూట మి సర్కారు పునఃసమీక్ష జరిపితే ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవచ్చని అంటున్నాన్నారు.

ఇతర రాష్ట్రాలకు, ఏపీకి ఎంత తేడా!

జగన్‌ ఇంధన రంగంలో చేసిన విధాన నిర్ణయాలు అస్మదీయులకు మేలు చేకూర్చేందుకేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంప్డ్‌ స్టోరేజీ, సోలార్‌ విద్యుత్‌, పవన విద్యుత్‌ ఉత్పత్తిలో ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలకూ, జగన్‌ ప్రభుత్వం మార్గదర్శకాలకు చాలా తేడా ఉందంటున్నారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌తో సహా ఇతర రాష్ట్రాలో సంప్రదాయేతర ఇంధన విద్యుత్‌ ఉత్పత్తి కోసం మౌలిక సదుపాయాలు అందించినందుకుగాను నిర్ణీత కాలవ్యవధిలో భూములు లీజుకు ఇస్తారు. సంప్రదాయేతర ఇంధన విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసిన సంస్థలు లీజు గడువు ముగిశాక.. ప్లాంట్లను ఉన్నవి ఉన్నట్లుగా యథాతథంగా మిషనరీతో సహా అంతా వదిలేసి పోవాలి. కానీ జగన్‌ ప్రభుత్వం తక్కువ ధరకు వేలాది ఎకరాల భూములు అమ్మేసింది. ఇక మధ్యప్రదేశ్‌ సహా ఇతర రాష్ట్రాల్లో సంస్థలు ఉత్పత్తి చేసిన విద్యుత్‌లో 20శాతం ఆ రాష్ట్రాలకు ఇవ్వాలి. ఏపీలో ఇది అమల్లోలేదు.

Updated Date - Jul 18 , 2024 | 07:34 AM