Share News

Chandrababu Naidu Collectors Conference: టైమంటే టైమే!

ABN , Publish Date - Mar 26 , 2025 | 03:33 AM

జిల్లా కలెక్టర్ల సమావేశంలో సుదీర్ఘ ప్రసంగాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టిన సీఎం చంద్రబాబు, సమయపాలనపై దృష్టి సారించారు. ప్రతి శాఖ ప్రజెంటేషన్లు ఐదారు స్లైడ్‌లకు పరిమితం చేసి, అజెండాకే కట్టుబడి చర్చలు సాగించాలని స్పష్టంగా సూచించారు.

Chandrababu Naidu Collectors Conference: టైమంటే టైమే!

సుదీర్ఘ చర్చలకు సెలవు

ఇప్పటివరకూ ఏం చే శారు?

ఇకపై ఏం చేయబోతున్నారు?

సుత్తి లేకుండా సూటిగా చెప్పండి

ఏసీ గదుల్లో కూర్చుంటే పనులు కావు

ప్రజల మధ్యకు వెళ్లి పనిచేయాలి

సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం

కొత్త పంథాలో కలెక్టర్ల సదస్సు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సుదీర్ఘ చర్చలు, అంతూపొంతూ లేని ప్రసంగాలకు ఫుల్‌స్టాప్‌ పడింది. టైమ్‌ అంటే టైమే. ఒక్క నిమిషం ఎక్కువ మాట్లాడినా గణగణ అంటూ బెల్‌ మోగాల్సిందే. ‘ఇప్పటివరకూ ఏం చేశారు? ఇకపై ఏం చేయబోతున్నారో సుత్తి లేకుండా సూటిగా చెప్పండి...’ అని సీఎం చంద్రబాబు స్పష్టంగా ఆదేశించారు. మంగళవారం మొదలైన జిల్లా కలెక్టర్ల రెండు రోజుల సదస్సులో ప్రభుత్వం కీలక మార్పును తీసుకొచ్చింది. ఏ విషయంపైనా సుదీర్ఘంగా మాట్లాడకుండా, అనవసరమైన చర్చలు లేకుండా అజెండాకే కట్టుబడి, నిర్దిష్ట సమయం పాటించేలా చంద్రబాబు తనదైన మార్పును ఆచరణలో చూపించారు. గతేడాది డిసెంబరులో జరిగిన కలెక్టర్ల సదస్సు సుదీర్ఘంగా సాగిన సంగతి తెలిసిందే. ఉదయం 10 నుంచి రాత్రి 11.45 గంటల వరకూ ఏకధాటిగా సాగిన ఆ సమావేశంలో అజెండా కూడా సరిగ్గా పాటించలేదు. సగటున ఒక్కో శాఖ రెండు గంటల చొప్పున ప్రజెంటేషన్‌ ఇచ్చి సమావేశాన్ని లక్ష్యానికి భిన్నంగా తీసుకెళ్లారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో సీఎం స్పందించారు. ఇకపై సుదీర్ఘ చర్చలు, ప్రజెంటేషన్లు ఉండవని, సమయ పాలనను పక్కగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం నాటి సమావేశంలో దీన్ని అక్షరాలా అమలు చేసి చూపించారు. అజెండా తయారీ నుంచి అన్నీ క్లుప్తంగా ఉండేలా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక్కో శాఖ ఐదారు స్లైడ్‌లకు మించకుండా ప్రజెంటేషన్‌లో ఉండేలా కట్టడి చేశారు. సమావేశం ప్రారంభంలోనూ, ఆయా శాఖలపై చర్చల సందర్భంలోనూ సమయపాలన గురించి సీఎం పదేపదే గుర్తుచేశారు, తన ప్రసంగం కూడా చాలా క్లుప్తంగా ఉండేలా జాగ్ర త్తపడ్డారు. గంటసేపు మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి 40 నిమిషాల్లోనే ముగించారు. ‘సూటిగా మాట్లాడాలి? మీకేం కావాలో స్పష్టంగా చెప్పాలి?’ అని చంద్రబాబు పలుమార్లు కార్యదర్శులకు చురకలంటించా రు. ఈసారి కలెక్టర్లతో మాట్లాడించే ప్రయత్నం చేశారు.


కలెక్టర్ల పనితీరును ప్రత్యక్షంగా సమీక్షిస్తా

ఈ సమావేశం ఆద్యంతం చంద్రబాబు ఉత్సాహంగా, హుషారుగా కనిపించారు. రెవెన్యూ, వాతావరణ పరిస్థితులు, సంక్షేమం, శాంతిభద్రతలు తదితర అంశాలపై సూటిగా ప్రశ్నలు అడిగారు. అజెండాలోని పలు అంశా ల్లో లోపాలను ఎత్తిచూపి సంబంధిత కార్యదర్శులను ప్రశ్నించారు. ఏసీ గదుల్లో కూర్చొంటే పనులు కావని, ప్రజల మధ్యకు వెళ్లి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ‘ఏజెన్సీలో ఆదాయం తీసుకొచ్చే వాణిజ్య పంటలను సాగు చేసేందుకు మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏమిటి? ’ అని సీఎం ప్రశ్నించారు. స్ట్రాబెర్రీ, అవకాడో, జాక్‌ ఫ్రూట్‌ పంటల సాగు, ధరలు, ఆదాయం గురించి వివరాలు కోరగా అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. ఇకపై కలెక్టర్ల పనితీరును ప్రత్యక్షంగా సమీక్షిస్తానన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే

Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్

Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ

Updated Date - Mar 26 , 2025 | 03:33 AM