Share News

IOC contract controversy: కాంట్రాక్టు వదులుకోండి

ABN , Publish Date - Mar 26 , 2025 | 03:56 AM

విశాఖ తూర్పు నౌకాదళ నౌకలకు డీజిల్ సరఫరా కాంట్రాక్టును ఓ వ్యక్తి తన అనుకూల కాంట్రాక్టర్‌కు అప్పగించేందుకు బెదిరింపులకు దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాకినాడకు చెందిన రెండు బార్జి కంపెనీలను ఒత్తిడి చేసి, వారి క్లియరెన్స్ ఆపేయించారు. హైకోర్టును ఆశ్రయించిన బాధితులు న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

 IOC contract controversy: కాంట్రాక్టు వదులుకోండి

కాకినాడ ఆయిల్‌ బార్జి యజమానులకు

రాష్ట్రస్థాయి నాయకుడి బెదిరింపులు

అస్మదీయ కాంట్రాక్టర్‌ కోసం ఇద్దరినీ

హైదరాబాద్‌కు పిలిపించి వార్నింగ్‌

ప్రతిగా నెలకు 2 లక్షలు ఇచ్చేలా ఆఫర్‌

తిరస్కరించడంతో పీసీ పత్రాలకు మోకాలడ్డు

ఐవోసీకి బార్జిల అప్పగింతకు 21తో గడువు

కాంట్రాక్టు రద్దు చేస్తామంటూ ఐవోసీ లేఖ

లబోదిబోమంటున్న వ్యాపారులు

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

యన.. రాష్ట్రస్థాయి పదవిలో ఉన్నారు. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ద్వారా విశాఖలోని తూర్పు నౌకాదళ నౌకలకు డీజిల్‌ సరఫరా చేసే కాంట్రాక్టును తనకు కావాల్సిన ఓ కాంట్రాక్టర్‌కు ఇప్పించాలనుకున్నారు. అంతకుముందు టెండర్లలో పాల్గొన్నా సదరు కాంట్రాక్టర్‌కు పని దక్కలేదు. దీంతో సదరు కాంట్రాక్టర్‌తో కలిసి బెదిరింపులకు దిగారు. కొత్తగా వర్క్‌ దక్కించుకున్న కాకినాడకు చెందిన రెండు బార్జి కంపెనీల యజమానులను 22న హైదరాబాద్‌లో ఓ హోటల్‌కు పిలిపించారు. తాను చెప్పిన కాంట్రాక్టర్‌కు వర్క్‌ అప్పగించేయాలంటూ అతడిని పక్కన పెట్టుకుని వార్నింగ్‌ ఇచ్చారు. వారు లొంగకపోవడంతో ‘నెలకు 2లక్షల చొప్పున ఇస్తాం. వర్క్‌ అప్పగించండి’ అని ఒత్తిడి చేశారు. కాకినాడ పోర్టు నుంచి క్లియరెన్స్‌ పత్రాలు రావాలంటే ఈ రెండు కంపెనీలు తమ బార్జిలను తనకు కావాల్సిన కాంట్రాక్టర్‌ నుంచి అద్దెకు తీసుకుంటున్నట్లు అంతర్గతంగా ఒప్పందం చేసుకోవాలని బెదరించారు. వారు వినకపోవడంతో ఆ కంపెనీలకు చెందిన ఆయిల్‌ బార్జిలను ఆ నాయకుడు కాకినాడ పోర్టులోనే నిలిపివేయించారు. పోర్టు అధికారిపై ఒత్తిడి తెచ్చి బార్జిలకు పోర్టు క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ ఆపేయించారు. విశాఖలోని ఐవోసీకి 21లోగా అప్పగించాల్సిన బార్జిలు కదలకపోవడంతో ఆకంపెనీ కాంట్రాక్టు రద్దు హెచ్చరిక జారీచేయడంతో సదరు వ్యాపారులు లబోదిబోమంటున్నారు.


ఎంఎ్‌సఎంఈలను ప్రోత్సహించాలని..

విశాఖ తూర్పు నౌకా దళానికి నిత్యం వేల లీటర్ల డీజిల్‌, బ్లాక్‌ ఆయిల్‌ అవసరం. సముద్రంలో గస్తీ దగ్గర నుంచి వివిధ విన్యాసాలు, కార్యకలాపాలకు నేవీ బోట్లు, నౌకలు, టగ్‌లకు కావాల్సిన ఆయిల్‌ను ఐవోసీ నుంచి సబ్సిడీ ధరలకు కొనుగోలు చేస్తుంటుంది. నౌకలకు ఆయిల్‌ సరఫరా కోసం ఐవోసీ ప్రైవేటు ఆయిల్‌ బార్జిలు(ఆయిల్‌ రవాణా బోట్లు) అద్దెకు తీసుకుంటుంది. ఇందులో భాగంగా 3బార్జిలు కావాలంటూ ఐవోసీ 2024 డిసెంబరులో కేంద్రానికి చెందిన జెమ్‌ పోర్టల్‌ ద్వారా 5కోట్ల విలువైన పనికి టెండర్లు పిలిచింది. ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఒక పెద్ద కంపెనీతో పాటు కాకినాడకు చెందిన 2 చిన్న కంపెనీలను గతనెలలో ఎంపిక చేసింది. సుప్రీం మెరైన్‌ ఎల్‌1, కేసరి మెరైన్‌ ఎల్‌2, కేకే మెరైన్‌ ఎల్‌3గా ఎంపికయ్యాయి. వీటికి 50:30: 20 నిష్పత్తిలో ఐవోసీ కార్గో కేటాయించింది. ఈ కంపెనీలు మార్చి 21 నాటికి బార్జిలను విశాఖ పోర్టులో అప్పగించాలని ఐవోసీ ఆదేశించింది. కాకినాడకు చెందిన రెండు కంపెనీలు తమ బార్జిలను కాకినాడ పోర్టు నుంచి తరలించడానికి సిద్ధమయ్యాయి. దీనికి పోర్టు క్లియరెన్స్‌(పీసీ) కోసం సదరు యజమానులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికీ పీసీ ఇవ్వకుండా అధికారులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. తమ చేతుల్లో ఏమీ లేదని, సదరు నాయకుడు అడ్డుకున్నారని చెప్పినట్టు తెలుస్తోంది. తనకు పీసీ ఇవ్వకుండా అడ్డుకోవడంపై తాజాగా వర్క్‌ ఆర్డరు దక్కించుకున్న ఓ కంపెనీ యజమాని సోమవారం హైకోర్టును ఆశ్రయించారు.

కాగా, ఈ నెల 21నాటికి రెండు కాకినాడ బార్జిలు విశాఖ పోర్టుకు రాకపోవడంతో ఐవోసీ తీవ్రంగా పరిగణించింది. సకాలంలో బార్జిలు పంపకపోవడంతో కాంట్రాక్టు రద్దు చేసి కంపెనీలను ఎందుకు బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టకూడదో చెప్పాలని మెయిల్‌లో నోటీసులు పంపింది. దీంతో నష్టపోతామని బార్జి యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే

Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్

Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 26 , 2025 | 03:57 AM