Share News

Jagan Effect: జగన్ తీరు.. నీటిపారుదల ప్రాజెక్టులకు శాపం..

ABN , Publish Date - Aug 12 , 2024 | 01:58 PM

అమరావతి: గత ఐదేళ్లలో నీటిపారుదల రంగం పట్ల జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రాజెక్టులకు శాపంగా మారింది. ప్రాజెక్టులపై వైసీపీ సర్కార్ పూర్తిగా నీళ్లొదిలేసింది. తుంగభత్ర గేటు కొట్టుకుపోవడంతో జగన్ ప్రభుత్వంలోని నిర్వహణ లోపాలు బహిర్గతమవుతున్నాయి. నేడు తుంగభద్ర, అంతకుముందు అన్నమయ్య డ్యామ్, పులిచింతల, గుండ్లకమ్మ, పెద్దవాడు, మూసి ఇలా ఏ ప్రాజెక్టు చూసినా నిర్వహణ లోపం కనిపిస్తోంది.

Jagan Effect: జగన్ తీరు.. నీటిపారుదల  ప్రాజెక్టులకు శాపం..

అమరావతి: గత ఐదేళ్లలో నీటిపారుదల రంగం (Irrigation Sector) పట్ల జగన్ ప్రభుత్వం (Jagan Govt.,) వ్యవహరించిన తీరు ప్రాజెక్టులకు శాపంగా మారింది. ప్రాజెక్టులపై వైసీపీ సర్కార్ పూర్తిగా నీళ్లొదిలేసింది. తుంగభత్ర గేటు (Tungabhadra Dam Gate) కొట్టుకుపోవడంతో జగన్ ప్రభుత్వంలోని నిర్వహణ లోపాలు బహిర్గతమవుతున్నాయి. నేడు తుంగభద్ర, అంతకుముందు అన్నమయ్య డ్యామ్ (Annamayya Dam), పులిచింతల (Pulichintala), గుండ్లకమ్మ (Gundlakamma), పెద్దవాగు (Peddavagu) ఇలా ఏ ప్రాజెక్టు చూసినా నిర్వహణ లోపం కనిపిస్తోంది. ప్రాజెక్టుల కనీస నిర్వహణకు కూడా నిధులు కూడా ఇవ్వకుండా వైసీపీ సర్కార్ చూపించిన నిర్లక్ష్యం తేటతెల్లమైంది.


తుంగభద్ర ప్రాజెక్టు భద్రతకు గత ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు నిధులు ఇవ్వకపోవడంతో ప్రస్తుతం అక్కడి పరిస్థితి అద్వాహ్నంగా మారింది. తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంతో నీరు దిగువకు పోతోంది. నిజానికి తుంగభద్ర ప్రాజెక్టు తలుపు జీవితకాలం 45 ఏళ్లు. కానీ ఇప్పటికే ఆ గేటును 70 ఏళ్లుగా సేవలు అందించినట్లు అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఈ రెండు ప్రాజెక్టులను ఖాళీ చేసిన అధికారులు... గత ఏదాడి డ్యామ్ నిర్వాహణ పనులు పకడ్బంధిగా చేయలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పులిచింతల, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోవడంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గేట్లు కొట్టుకుపోవడంతో నిలువ ఉంచాల్సిన నీరు వృధాగా సముద్రంపాలైంది. కనీసం గేట్ల నిర్వహణ గ్రీజుకు కూడా జగన్ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముంపు బాధితులకు కూడా వైసీపీ ప్రభుత్వం ఇళ్లు నిర్మించలేదు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడంలో కూడా అధికారుల నిర్లక్ష్యం ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.


ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు సాగు, తాగునీటి ప్రదాయిని అయిన తుంగభద్ర డ్యామ్‌ గేటు వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది! శనివారం రాత్రి డ్యామ్‌ 19వ గేటును ఎత్తుతుండగా చైన్‌లింక్‌ తెగిపోవడమే ఇందుకు కారణం. ఆ గేటు వద్ద వరద ప్రవాహ ఉధృతి పెరిగి ప్రాజెక్టుకు మరింత ప్రమాదం వాటిల్లకుండా ఉండేందుకు మిగిలిన 32 గేట్లను 2 నుంచి 3 అడుగుల మేర ఎత్తి 1.10 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. వదులుతున్న నీరు సోమవారం ఉదయానికి లక్షన్నర క్యూసెక్కులకు పెరగొచ్చని.. తీరప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని బోర్డు అధికారులు హెచ్చరించారు.


నీటి ఉధృతి కారణంగా మరమ్మతులు చేయలేని పరిస్థితి ఏర్పడడంతో.. శాశ్వత మరమ్మతులు చేసేందుకు స్పిల్‌ లెవల్‌ వరకూ డ్యామ్‌ను ఖాళీ చేయాలని అధికారులు నిర్ణయించి 65 టీఎంసీల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. అయితే, భారీ వర్షాల కారణంగా ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు నిండిపోవడంతో తుంగభద్ర నుంచి వచ్చే నీరంతా సముద్రంలోకి వదిలిపెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. మరమ్మతులకు సంబంధించి సూచనలు చేసేందుకు.. హైదరాబాద్‌కు చెందిన డ్యామ్‌ గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు, కర్ణాటక నీరావరి నిగమ్‌ లిమిటెడ్‌ (కేఎన్‌ఎన్‌ఎల్‌) ప్రాజెక్టు నిపుణుడు రాజేశ్‌ సహా హైదరాబాద్‌, బెంగళూరుకు చెందిన ప్రాజెక్టు నిపుణులు కూడా అక్కడకు చేరుకున్నారు. డ్యాం ఖాళీ చేయకుండా గేటు మరమ్మతు చేయడంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కర్ణాటక, ఏపీలో ఇప్పటికే ఆయకట్టు రైతులు వరి నాట్లు వేశారు. ఖరీఫ్‌ పంటకు సాగునీరు ఇబ్బంది లేకుండా చూసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. టీబీ డ్యాంకు వెళ్లి అక్కడి పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని బాబు ఆదేశించడంతో ఏపీ నుంచి సీఈ శివకుమార్‌రెడ్డి, అనంతపురం సీఈ నాగరాజు వెళ్లారు.


మూడ్రోజులు పట్టే చాన్సు!

కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతూనే ఉంది. 245 టీఎంసీల వరద చేరగా.. గేట్లెత్తి దాదాపు 135 టీఎంసీలు శ్రీశైలం జలాశయానికి వదిలారు. డ్యాం గేటు తెగే సమయంలో 104.182 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 36,739 క్యూసెక్కులు వస్తుండగా.. 54,960 క్యూసెక్కులు నదికి వదులుతున్నారు. 33 గేట్లను అడుగు మేర ఎత్తి నదికి నీరు వదులుతున్న సమయంలో శనివారం రాత్రి 9వ క్రస్ట్‌గేటును మరో అడుగు ఎత్తేందుకు అధికారులు ప్రయత్నించగా.. దానికి ఉండే ఒక చైన్‌ లింక్‌ తెగిపోయింది. ఇదే సమయంలో వరద ఉధృతికి మరో చైన్‌ లింక్‌ కూడా తెగిపోయింది. గేటు కనిపించకుండా నీటిలో కొట్టుకుపోయింది. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. మిగిలిన 32 గేట్లను 2 నుంచి 3 అడుగుల మేర ఎత్తి 1.10 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కొట్టుకుపోయిన గేటుకు శాశ్వత మరమ్మతులు చేయాలంటే స్పిల్‌ లెవల్‌ వరకు ఖాళీ చేయాల్సి ఉంటుంది. అంటే 65 టీఎంసీల వరకు దిగువకు వదిలేయక తప్పని పరిస్థితి. దీంతో ఇన్‌ఫ్లోతోపాటు డ్యామ్‌లోని నీరు అంతా నదికి వదులుతున్నారు. 65 టీఎంసీల నీరు కిందకు వెళ్లడానికి కనీసం మూడ్రోజులు పడుతుందని బోర్డు వర్గాలు తెలిపాయి. స్టాప్‌లాక్‌ ఏర్పాటు లేకపోవడమే తాజా పరిస్థితికి ప్రధాన కారణం. వీటి ఏర్పాటు సర్వే కోసం 2020లో నాటి ఎస్‌ఈ వెంకటరమణ ఇచ్చిన నివేదికను బుట్టదాఖలు చేశారు.

Updated Date - Aug 12 , 2024 | 01:58 PM