Share News

14న విజయవాడలో ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ సభ

ABN , Publish Date - Dec 07 , 2024 | 04:20 AM

విజయవాడలో ఈ నెల 14న దివంగత ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ సభ జరగనుంది. దీనికి ముఖ్య అతిఽథులుగా సీఎం చంద్రబాబు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరు కానున్నారు.

14న విజయవాడలో ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ సభ

  • హాజరు కానున్న చంద్రబాబు, వెంకయ్యనాయుడు

  • హైదరాబాద్‌లో 100 అడుగుల విగ్రహం: టీడీ జనార్దన్‌

అమరావతి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): విజయవాడలో ఈ నెల 14న దివంగత ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ సభ జరగనుంది. దీనికి ముఖ్య అతిఽథులుగా సీఎం చంద్రబాబు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరు కానున్నారు. ఎన్టీఆర్‌ స్మారక సాహిత్య కమిటీ అధ్యక్షుడు టీడీ జనార్దనరావు శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గత నెల 24నాటికి ఎన్టీఆర్‌ తొలి సినిమా ‘మన దేశం’ విడుదలై 75 ఏళ్ల పూర్తయ్యాయని, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకను నిర్వహిస్తున్నామని తెలిపారు. ‘‘తెలుగు సినీ జగత్తులోనే కాకుండా భారతీయ సినీ రంగంలో ఎన్టీఆర్‌ ఒక మేరునగధీరుడు.

పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘిక... ఇలా ప్రతి పాత్రలోనూ ఆయన మేటి నటుడిగా నిలిచారు. తనను ఎంతో ఆదరించిన ప్రజల రుణం తీర్చుకోవడానికి రాజకీయ రంగంలోకి వచ్చిన ఆయన పేదవాడి మనసు తెలిసి వాళ్ల అవసరాలు తీర్చడానికి ఎంతో ప్రయత్నం చేశారు. వజ్రోత్సవ వేడుకలకు ఎన్టీఆర్‌ కుమార్తెలు, కుమారులు పురందేశ్వరి, రామకృష్ణ, మోహనకృష్ణతోపాటు అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, కృష్ణ, రామానాయుడు కుటుంబ సభ్యులు హాజరవుతున్నారు. సినీ రంగంలో ఎన్టీఆర్‌తోపాటు కలిసి పనిచేసిన కళాకారులు, టెక్నీషియన్లు, దర్శకులనూ ఆహ్వానిస్తున్నాం.

ఈ నెల 14న పెనమలూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న ఓ రిసార్ట్స్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది’’ అని జనార్దనరావు వివరించారు. మన దేశం మొదలుకొని ఎన్టీఆర్‌ నటించిన మూడు వందల సినిమాలకు సంబంధించిన సంక్షిప్త సమాచారంతో ‘తారక రామం’ పేరుతో ఒక పుస్తకాన్ని వజ్రోత్సవ వేడుకలో విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు. తెలుగునాట ఎన్టీఆర్‌ స్మృతి చిరస్థాయిగా ఉండటానికి హైదరాబాద్‌లో ఆయన 100 అడుగుల విగ్రహం ఏర్పాటుచేసి ఆయనకు సంబంధించిన విశేషాలతో డిజిటల్‌ మ్యూజియం ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.

Updated Date - Dec 07 , 2024 | 04:20 AM