Pawan Kalyan: రూ. 10 కోట్ల కష్టార్జీతం విరాళం..
ABN , Publish Date - Mar 27 , 2024 | 02:30 AM
రాష్ట్ర భవిష్యత్తును సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జనసేన సాగిస్తున్న రాజకీయ ప్రయాణానికి తన వంతుగా రూ.10 కోట్లు ఇస్తున్నానని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.
ఈ డబ్బు తన స్వార్జితమని ప్రకటన
ఎన్నికల ప్రచారానికి వినియోగించనున్నట్టు వెల్లడి
అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర భవిష్యత్తును సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జనసేన సాగిస్తున్న రాజకీయ ప్రయాణానికి తన వంతుగా రూ.10 కోట్లు ఇస్తున్నానని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రకటించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు సమక్షంలో పార్టీ కోశాధికారి ఏవీ రత్నంకు మంగళవారం ఆ చెక్కును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచార ఖర్చుల నిమిత్తం ఈ డబ్బు ఇస్తున్నానని తెలిపారు. స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించడానికి మోతీలాల్ నెహ్రూ వంటి గొప్ప నాయకులు తమ స్వార్జితాన్ని విరాళంగా ఇచ్చేవారని గుర్తుచేశారు. ఆ రోజుల్లో తమ సొంత డబ్బును వెచ్చించిన తీరు గొప్పదని, ఓ సదాశయం కోసం తాను రూ.10 కోట్లు అందిస్తున్నానని తెలిపారు. జనసేన పార్టీ ప్రయాణానికి సగటు కూలి తన చిన్నపాటి సంపాదనలో రూ.100 పక్కన పెట్టి ఇవ్వడం.. పార్టీ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుందని చెప్పారు. ఓ బేల్దారీ మేస్త్రీ రూ.లక్ష విరాళం అందించారని, అలాగే తమకు అందుతున్న పింఛన్ సొమ్ములో కొంత భాగం పార్టీకి పంపుతున్న సగటు మనుషులెందరో ఉన్నారని పవన్ వెల్లడించారు. వారంతా ఎన్నో ఆశలతో, ఆశయాలతో నిర్మించిన పార్టీ కోసం తమ వంతు సాయం అందిస్తున్నారని వివరించారు. అలాంటి వారి స్ఫూర్తితో తాను సినిమాల ద్వారా వచ్చిన తన కష్టార్జితాన్ని, ప్రభుత్వానికి పన్నులు కట్టిన తర్వాత పార్టీ కోసం అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత ఐదేళ్లలో 40 నుంచి 50 కోట్లు పన్నులు కట్టానన్నారు. ఎన్నికల వేళ ఈ డబ్బు పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు బి.మహేందర్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.