పోలవరం పరుగులు పెట్టాలి
ABN , Publish Date - Oct 24 , 2024 | 04:03 AM
పోలవరం సాగునీటి ప్రాజెక్టు పనుల వేగాన్ని పెంచి 2027 జూలై నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థలు, జల వనరుల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
2027 నాటికి సాగునీటి ప్రాజెక్టు పూర్తి కావాలి: చంద్రబాబు
అమరావతి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): పోలవరం సాగునీటి ప్రాజెక్టు పనుల వేగాన్ని పెంచి 2027 జూలై నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థలు, జల వనరుల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం జల వనరుల శాఖపై మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజనీరు నరసింహమూర్తి, మేఘా, బావర్ సంస్థల ప్రతినిధులతో ఆయన సమీక్షించారు. 1,396.60 మీటర్ల పొడవైన డయాఫ్రమ్‌వాల్ డిజైన్లను ఆఫ్రై సంస్థ.. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి, విదేశీ నిపుణుల ప్యానెల్‌కు అందజేసిందని అధికారులు ఆయనకు తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో నిపుణుల ప్యానెల్.. డిజైన్లపై వర్క్‌షాపు నిర్వహించి చర్చిస్తుందని, ఆ డిజైన్లను వచ్చేనెల 24 నాటికి ఆమోదిస్తాయని వివరించారు. కొత్త వాల్‌కు రూ. 960.34 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర జలసంఘం ఆమోదించిందని, దానిని 2025 జూలై నాటికి పూర్తి చేస్తామని అధికారులతో పాటు కాంట్రాక్టు సంస్థలు వెల్లడించాయి. ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ పనులను 2025 నవంబరులో ప్రారంభించి 2027 జూలైనాటికి పూర్తి చేస్తామని పేర్కొన్నాయి. భూసేకరణ సహా కీలకమైన పనులన్నీ 2025 జూలై నాటికి పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు.
2026 నాటికి గోదారి, పెన్నా అనుసంధానం
హంద్రీ--నీవా ప్రఽధాన కాలువపైనా సీఎం సమీక్షించారు. రూ. 2,484 కోట్లతో తొలిదశ పనులు మేఘా ఇంజనీరింగ్, రెండోదశ ప్యాకేజీ పనులు రూ. 2,163 కోట్లతో డీఎ్‌సఆర్-వీపీఆర్ సంస్థ చేపట్టనున్నాయని అధికారులు వివరించారు. కుప్పం బ్రాంచి కెనాల్‌ను రూ. 180.61 కోట్లతో చేపడుతున్నామని, ఇక చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని రూ. 3,782 కోట్లతో జూలై 2026 నాటికి పూర్తి చేస్తామన్నారు. గోదావరి-పెన్నా నదుల అనుసంధాన పనులను 2026 జనవరి నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రూ. 9,700 కోట్లతో చేపడుతోన్న వెలిగొండ ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.6,061.60 కోట్లు ఖర్చయిందని, మరో 3,639 కోట్ల వ్యయంతో పనులు చేపడుతున్నామని వివరించారు. వంశధార స్టేజ్-2 ఫేజ్-2 పనులు కూడా చేపట్టనున్నామని తెలిపారు. వరదలు తగ్గేలోగా రిజర్వాయర్లు నింపాలని సీఎం ఆదేశించారు.