Share News

ఔషధాల దందా

ABN , Publish Date - Nov 03 , 2024 | 04:43 AM

జగన్‌ జమానాలో ఆరోగ్యశాఖను కుంభకోణాల మయం చేశారు. ముఖ్యంగా ఏపీఎంఎ్‌సఐడీసీ పరిధిలో జరిగిన టెండర్‌ ప్రక్రియల్లో భారీగా అవకతవకలకు పాల్పడ్డారు.

ఔషధాల దందా

ఆరోగ్య శాఖలో ఔషధాల దందా

ప్రభుత్వ ఆసుపత్రులకు తక్కువ ధరలకు బ్రాండెడ్‌ ఔషధాలను సరఫరా చేసే పేరుతో జగన్‌ హయాంలో భారీ స్కామ్‌కు పాల్పడ్డారు. తక్కువ ధరకే పేద రోగులకు నాణ్యమైన మందులిస్తామని ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం చేకూర్చారు. చివరికి జనరిక్‌ మందులు సరఫరా చేసి నాణ్యతను దెబ్బ తీశారు. ఆరోగ్యమంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ చొరవతో ఆలస్యంగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

‘సెంట్రలైజ్డ్‌’ విధానంతో దోపిడీ

ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్ల నష్టం

మందుల ధర పెంచేసిన శ్రీకృష్ణ ఫార్మా

మార్కెట్‌ ధర కంటే అధిక ధరకు సరఫరా

36ు తక్కువ ధరకే ఇస్తున్నట్లు కలరింగ్‌

జగన్‌ జమానాలో చెలరేగిపోయిన సంస్థ

మంత్రి ఆరాతో వాస్తవాలు వెలుగులోకి

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జగన్‌ జమానాలో ఆరోగ్యశాఖను కుంభకోణాల మయం చేశారు. ముఖ్యంగా ఏపీఎంఎ్‌సఐడీసీ పరిధిలో జరిగిన టెండర్‌ ప్రక్రియల్లో భారీగా అవకతవకలకు పాల్పడ్డారు. తమ వారి కంపెనీలకు టెండర్లు కట్టబెట్టేందుకు ఇష్టారాజ్యాంగా నిబంధనలు మార్చేశారు. కొన్ని కంపెనీలను బెదిరించి మరీ వారి అనుకూల కంపెనీలకు టెండర్లు ధారాదత్తం చేశారు. ఇలా అడ్డగోలు టెండర్‌ ప్రక్రియలో శ్రీకృష్ణ ఫార్మా ముఖ్యమైన టెండర్‌ను దక్కించుకుంది. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రులకు మందులతో పాటు ఏ వస్తువు కావాలన్నా ఏపీఎంఎ్‌సఐడీసీ నుంచే కొనుగోలు చేస్తారు. కార్పొరేషన్‌ అధికారులు ఫెలిటేషన్‌ పర్సంటేజ్‌ తీసుకుని ఆస్పత్రులకు అవసరమైన మందులు, ఇతర వస్తువులు కొనుగోలు చేసి అందిస్తారు. మందుల విషయానికి వస్తే ఏటా ప్రభుత్వం వీటి కొనుగోలుకు దాదాపు రూ.300 కోట్ల వరకు కేటాయిస్తుంది. ఈనిధులను అధికారులు వివిధ ఆస్పత్రులకు కేటాయిస్తారు. వాటినుంచే సూపరింటెండెంట్లు మందులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి ఏటా మందులు కొనుగోలుకు రూ.20కోట్ల వరకు కేటాయిస్తారు. మళ్లీ దీనిని నాలుగు క్వార్టర్లుగా విభజించి, ప్రతి క్వార్టర్‌కు రూ.5కోట్ల చొప్పున ఇస్తారు. ఈ రూ.5కోట్లను మళ్లీ 80శాతం, 20 శాతంగా విభజిస్తారు. ఇలా విభజించిన నిధుల్లో రూ.4 కోట్ల విలువైన మందులను కార్పొరేషన్‌ కొనుగోలు చేసి సరఫరా చేస్తుంది. మిగిలిన రూ.కోటి నేరుగా ఆస్పత్రి అకౌంట్‌లోకి జమచేస్తారు. ఆకౌంట్‌లో జమఅయిన నిధులతో ఆస్పత్రి అధికారులు అత్యవసర మందులను స్థానికంగా కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంది. ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు స్థానికంగా కొనుగోలు చేసే మందులకు కూడా టెండర్లు ఆహ్వానించి స్థానిక కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసుకుంటారు. కొనేళ్ల నుంచి ఇదే పద్ధతి కొనసాగుతోంది.


వైసీపీ హయాంలో అయిన వారికోసం..

వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాలకుల మేలు కోసం ఈ వ్యవస్థను బ్రేక్‌ చేశారు. స్థానికంగా మందులు కొనుగోలు చేయడం వల్ల ప్రభుత్వానికి భారీనష్టం వస్తోందని, దీనివల్ల రూకోట్ల ప్రజాధనం వృథా అవుతోందని చెప్పుకొచ్చారు. ఆ వెంటనే ఆసుపత్రులకు అందించే 20శాతం నిధులను కూడా కార్పొరేషన్‌ దగ్గర ఉంచుకుని, సెంట్రలైజ్డ్‌ కొనుగోలు విధానం తీసుకురావాలని నిర్ణయించారు. ఆస్పత్రుల ఖాతాలో ఒక్క రూపాయి వేయకుండా, రోగులకు అత్యవసర సమయంలో మందులు కొనుగోలు చేసే అవకాశం లేకుండా చేశారు. సెంట్రలైజ్డ్‌ విధానం కోసం టెండర్లు ఆహ్వానించారు. ఇందులో శ్రీకృష్ణ ఫార్మా ఎల్‌1గా వచ్చింది. ఈ కంపెనీ ఎంఆర్‌పీ కంటే 36శాతం తక్కువకు మందులు సరఫరా చేస్తామని అప్పటి కార్పొరేషన్‌ అదికారులతో ఒప్పందం కుదుర్చుకుంది. వెంటనే అధికారులు సెంట్రలైజ్డ్‌ కొనుగోలు బాధ్యతను సదరు కంపెనీకి అప్పగించారు. అయితే, ఈ కంపెనీ ఏ రోజూ ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలకు అనుగుణంగా మందులను సరఫరా చేయలేకపోయింది. పైగా మార్కెట్‌లో అతి తక్కువ ధరకే లభించే మందులకు కూడా ఎంఆర్‌పీ భారీగా కోట్‌ చేసి సరఫరా చేసింది. ఉదాహరణకు పారాసిట్మాల్‌ 10 టాబ్లెట్ల షీట్‌ రూ.20 ఉంటే, సదరు కంపెనీ 36 శాతం తగ్గించుకుని రూ.12.8 ఆస్పత్రులకు సరఫరా చేయాలి.

కానీ, కంపెనీ దీనిని రూ.35గా నిర్ణయించి.. అందులో 36శాతం తగ్గించి రూ.22.4 చొప్పున బిల్లులు పెట్టింది. దీనివల్ల మార్కెట్‌ ధర కంటే ప్రభుత్వం సదరు కంపెనీకి ఎక్కువ మొత్తాన్ని చెల్లించింది. ఇలా అధిక ధరలు కోట్‌ చేసి రూ.కోట్లను నొక్కేశారు. ఈ విషయం గత ప్రభుత్వంలోనే ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు గుర్తించినా మౌనం వహించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో సెంట్రలైజ్డ్‌ మందుల కొనుగోలు విధానంపై అధికారులు తెలివిగా ఆలోచించారు. శ్రీకృష్ణ ఫార్మా చేసిన అడ్డగోలు వ్యవహారం బయటకు వస్తే అందరూ ఇబ్బందులు పడాల్సి వస్తుందని భావించారు. సెంట్రల్‌లైజ్డ్‌ విధానం వల్ల రోగులకు పెద్దగా ప్రయోజనం లేదని, ఈ విధానాన్ని రద్దు చేద్దామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు ఫైల్‌ పెట్టారు. 20శాతం నిధులు సూపరింటెండెంట్లకు అప్పగించి స్థానికంగా వారే మందులు కొనుగోలు చేసే విధానాన్ని తేవాలని ఫైల్‌లో పొందుపరిచారు. దీనిపై అనుమానాలు వ్యక్తం చేసిన మంత్రి.. టెండర్‌ ప్రక్రియ నుంచి ఇప్పటి వరకు జరిగిన వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. విజయవాడ, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, కర్నూలు ఆస్పత్రులకు శ్రీకృష్ణ ఫార్మా సరఫరా చేసిన మందుల వివరాలు తెప్పించారు. ఈ 5 ఆస్పత్రులకు ఆ సంస్థ 106 రకాల మందులు సరఫరా చేసింది. అందులో 67ు మందుల ధరలు మార్కెట్‌ ధర కంటే రెండు, మూడింతలు అధికంగా ఉన్నట్లు తేలడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ ఫార్మా ఏయే ఆస్పత్రులకు ఎన్ని రకాల మందులు సరఫరా చేసింది? ఎంత మొత్తం చేసింది? అన్న వివరాలతో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.


రూ.46 కోట్ల బిల్లులు

2022, జూలైలో శ్రీకృష్ణ ఫార్మా టెండర్‌ దక్కించుకుంది. అప్పటినుంచి ఇప్పటి వరకు రూ.46కోట్ల వరకు కార్పొరేషన్‌కు బిల్లులు పెట్టింది. దీనిలో రూ.26కోట్లకు సంబంధించిన బిల్లులు ప్రాసె్‌సలో పెట్టారు. మరో రూ.20కోట్ల బిల్లులు చెల్లించేసినట్లు తెలుస్తోంది. అసలు ప్రభుత్వం చెల్లించిన రూ.20 కోట్ల విలువైన మందులు అయినా సదరు కంపెనీ సరఫరా చేసిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెంట్రలైజ్డ్‌ కొనుగోలుపై ఆస్పత్రుల సూపరింటెండెంట్లు ఎప్పటి నుంచో ఫిర్యాదులు చేస్తున్నారు. మందులు సక్రమంగా సరఫరా చేయడం లేదని, పైగా జనరిక్‌ మందులు సరఫరా చేస్తున్నారని, అది కూడా మార్కెట్‌ ధర కంటే అధికంగా కోట్‌ చేస్తున్నారని అనేక ఫిర్యాదులున్నాయి. వీటిపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ప్రజాధనం వృథా అయ్యేది కాదు.

Updated Date - Nov 03 , 2024 | 04:44 AM