Share News

Vizag Steel Plant: చిక్కుల్లోనే విశాఖ ఉక్కు!

ABN , Publish Date - Aug 01 , 2024 | 04:15 AM

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. సంస్థను ప్రైవేటీకరణ చేయబోమని ఎన్‌డీఏ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారే తప్ప ఎటువంటి సాయం చేస్తారనే విషయం వెల్లడించడం లేదు.

Vizag Steel Plant: చిక్కుల్లోనే విశాఖ ఉక్కు!

  • కేంద్ర మంత్రి వచ్చి వెళ్లినా అదే పరిస్థితి

  • మరింత తీవ్రమైన ముడిపదార్థాల కొరత

  • ఒక్క రోజుకే సరిపోయే కోకింగ్‌ కోల్‌ నిల్వ

  • పూర్తిగా అడుగంటిన ఇతర సరుకు నిల్వలు

  • కార్మికులకు 1న జీతాలు ఇవ్వలేని దుస్థితి

  • సాయంపై స్పందించని కేంద్ర ప్రభుత్వం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు (Vizag Steel Plant) పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. సంస్థను ప్రైవేటీకరణ చేయబోమని ఎన్‌డీఏ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారే తప్ప ఎటువంటి సాయం చేస్తారనే విషయం వెల్లడించడం లేదు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఈ ప్లాంటును సందర్శించి 20 రోజులు కావస్తోంది. ఇప్పటి వరకూ ఎటువంటి కదలిక లేదు. ప్రస్తుతం స్టీల్‌ప్లాంటు ఉత్పత్తికి అవసరమైన ముడిపదార్థాలకు తీవ్రమైన కొరత ఏర్పడింది. జిందాల్‌ నుంచి రూ.800 కోట్లు, టాటా, సెయిల్‌ నుంచి రూ.900 కోట్లు, స్థానిక ట్రేడర్ల నుంచి రూ.1,300 కోట్లు తీసుకున్న యాజమాన్యం వాటిని పప్పుబెల్లాల్లా వాడేసింది. గత నెలలో రూ.1,590 కోట్ల స్టీల్‌ను విక్రయించారు. వీటిద్వారా రూ.1,300 కోట్లు మాత్రమే వచ్చింది. మిగిలినవి పాత బకాయిల కింద జమ అయిపోయాయి. ప్రస్తుతం ప్లాంటులో ఉత్పత్తికి అవసరమైన ముడిపదార్థాలు అడుగంటాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కోకింగ్‌ కోల్‌ 10వేల టన్నులు మాత్రమే ఉంది. అదీ ఒక్కరోజుకే సరిపోతుంది. బాయిలర్‌ కోల్‌ రెండో రోజులకు, పీసీఐ కోల్‌, హార్డ్‌ అండ్‌ సాఫ్ట్‌ కోల్‌ నిల్వలు బాగా తగ్గిపోయాయి. బ్లాస్ట్‌ ఫర్నేసులకు అవసరమైన డోలమైట్‌ నాలుగు రోజులకు, సైజ్డ్‌ ఓర్‌ ఐదు రోజులకు సరిపడా మాత్రమే ఉండగా, ఐరన్‌ ఓర్‌ లంప్స్‌ పూర్తిగా అయిపోయాయి. ఉక్కు శాఖ మంత్రి వచ్చి వెళ్లిన తరువాత ఉత్పత్తి మరింత తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్‌ఎండీసీ ఐరన్‌ ఓర్‌ను తగినంత సరఫరా చేయకుండా ప్రైవేటు కంపెనీలకు విక్రయిస్తోంది. మంత్రి కనీసం ఆ మాత్రం మాట సాయం కూడా చేయలేకపోయారనే విమర్శలొస్తున్నాయి.


వాయిదా పద్ధతిలో జీతాలు

స్టీల్‌ప్లాంటులో గత ఆరు నెలలుగా జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదు. వాయిదాల పద్ధతిలో ఇస్తున్నారు. పూర్తిస్థాయి ఉత్పత్తి చేస్తే దానివల్ల వచ్చే వృథా వాయువులు, ఉష్ణోగ్రతల ద్వారా 450 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. తిరిగి గ్రిడ్‌కు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఉత్పత్తి లేకపోవడం వల్ల ఇప్పుడు నెలకు విద్యుత్‌ బిల్లుకే రూ.93 కోట్లు కట్టాల్సి వస్తోంది. పూర్తి ఉత్పత్తి చేస్తే విద్యుత్‌ బిల్లు మొత్తంతో ఉద్యోగులు, కార్మికులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వవచ్చు.

అడిగిందేదీ ఇవ్వడం లేదు

  • ముంబైలో బ్యాంకర్లతో సమావేశమైన రుణం కోరినప్పుడు అంతా నిరాకరించారు. కేంద్రం ‘లెటర్‌ ఆఫ్‌ కంఫర్ట్‌’ ఇస్తే తాము అప్పులు ఇస్తామని తేల్చిచెప్పారు. ఇదే విషయం ప్రభుత్వ పెద్దలకు చెబితే ఆర్థికశాఖ నుంచి ఆ లెటర్‌ ఇప్పిస్తామన్నారు. ఇంతవరకూ రాలేదు.

  • ప్రిఫరెన్షియల్‌ షేర్ల కింద రూ.3,100 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. అది కూడా చేయలేదు.

  • ఎన్‌ఎండీసీ నుంచి రూ.1,500 కోట్ల ఆర్థిక సాయం చేయిస్తామని హామీ ఇచ్చారు. విశాఖలో స్టీల్‌ప్లాంటుకు చెందిన 1,067 ఎకరాల భూమిని లీజుకు ఇవ్వడం ద్వారా ఆ మొత్తం సమకూరుస్తామన్నారు. దానిని కూడా ప్రాసెస్‌ చేయలేదు.

  • ఇప్పటివరకూ స్టీల్‌ ప్లాంటు రూ.54,380 కోట్లు పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించింది. ప్రస్తుతం పరిస్థితి బాగాలేనందున మూడేళ్లు ట్యాక్స్‌ హాలీడే ఇవ్వాలని కోరారు. దీనిపైనా స్పందన లేదు.

  • స్టీల్‌ప్లాంటు భూములన్నీ రాష్ట్రపతి పేరుపై ఉన్నాయి. వాటిని ప్లాంటు పేరిట రిజిస్టర్‌ చేస్తే బ్యాంకులు రుణాలు ఇస్తామని చెప్పాయి. ఈ మేరకు 10,200 ఎకరాలు రిజిస్టర్‌ చేయాలని సీఎండీ ప్రతిపాదన పంపారు. దానినీ పక్కన పెట్టేశారు.

అన్నీ ఉన్నాయి.. ముడిసరుకే లేదు

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటులో మెషినరీ ఉంది. కార్మికులు ఉన్నారు. మార్కెటింగ్‌ వ్యవస్థ ఉంది. కానీ ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడిపదార్థాలే లేవు. వాటిని సమకూరిస్తే పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేసి, నష్టాలు నివారిస్తాం.

- అయోధ్యరామ్‌, కన్వీనర్‌,

ఉక్కు పరిరక్షణ కమిటీ

Updated Date - Aug 01 , 2024 | 08:09 AM