AP Politics: వైసీపీ పెద్దలతో పార్థసారథి చర్చలు విఫలం.. మరో ఎమ్మెల్యే జంపేనా?
ABN , Publish Date - Jan 08 , 2024 | 09:51 PM
వైసీపీ పెద్దలతో ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. పెనమలూరు నుంచి కాకుండా మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ నేతలు కోరగా పార్థసారథి తిరస్కరించారు. ఎంపీగా గెలిపించే బాధ్యతను ఎమ్మె్ల్యేలు తీసుకుంటారని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా పార్థసారథి వెనకడుగు వేయలేదు.
అమరావతి, జనవరి 08: వైసీపీ పెద్దలతో ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. పెనమలూరు నుంచి కాకుండా మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ నేతలు కోరగా పార్థసారథి తిరస్కరించారు. ఎంపీగా గెలిపించే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకుంటారని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా పార్థసారథి వెనకడుగు వేయలేదు.
కాగా, కొలుసు పార్థసారథి పార్టీ మారుతున్నారని సోషల్ మీడియాలో గట్టి ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే.. సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి పిలుపు రావడంతో.. పార్థసారథి క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లారు. సమన్వయకర్తలు అయోధ్యరామిరెడ్డి, మర్రి రాజశేఖర్‌తో భేటీ అయ్యారు పార్థసారథి. ఈ భేటీలో ఎమ్మెల్యేలు అనిల్ కుమార్, కొడాలి నాని కూడా పాల్గొన్నారు. ఎంపీగా పోటీ చేసేందుకు పార్థసారథిని ఒప్పించే ప్రయత్నం చేసినా.. అందుకు ఆయన అంగీకరించలేదు. మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసే ప్రసక్తే లేదని పార్థసారథి స్పష్టం చేశారు.
ఎటూ తేలని నరసరావుపేట పంచాయితీ..
ఇదిలాఉంటే.. వైసీపీ కేంద్ర కార్యాలయంలో నరసరావుపేట పంచాయితీని తేల్చే ప్రయత్నం చేశారు విజయసాయిరెడ్డి. కానీ, ఆయన ప్రయత్నం కూడా విఫలమైంది. తొలుత నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డికే మరోసారి టికెట్ ఇవ్వాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. ఇదే విషయాన్ని నరసరావుపేట సీనియర్ నాయకులు గజ్జల బ్రహ్మారెడ్డికి తెలిపారు. ఈసారి కూడా గోపిరెడ్డికి సపోర్ట్ చేయాలని సూచించారు. అయితే, ఈసారి గోపిరెడ్డికి సపోర్ట్ ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు బ్రహ్మారెడ్డి. దీంతో ఎమ్మెల్యే, వ్యతిరేక వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఎంపీ విజయసాయిరెడ్డి ప్రయత్నించారు. కానీ, ఆయన ప్రయత్నం విఫలమైంది. గోపిరెడ్డికి మద్దతిచ్చే ప్రసక్తే లేదని సమావేశం నుంచి లేచి వెళ్లిపోయారు బ్రహ్మారెడ్డి, ఆయన అనుచరులు.