AP News: జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీకి బిగ్ షాక్.. పదికి 10 స్థానాలను గెలుచుకున్న కూటమి
ABN , Publish Date - Aug 07 , 2024 | 06:36 PM
జీవీఎంసీ (Greater Visakhapatnam Municipal Corporation) స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి సభ్యులు విజయం సాధించారు. 10కి పది మంది సభ్యులు కూటమి నుంచే గెలుపొందారు. ఈ మేరకు జీవీఎంసీ కమిషనర్ ప్రకటించారు.

విశాఖపట్నం: జీవీఎంసీ (Greater Visakhapatnam Municipal Corporation) స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి సభ్యులు విజయం సాధించారు. 10కి పది మంది సభ్యులు కూటమి నుంచే గెలుపొందారు. ఈ మేరకు జీవీఎంసీ కమిషనర్ ప్రకటించారు. అయితే అధికార బలంతో అక్రమంగా గెలిచారంటూ వైసీపీ అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్యాలెట్ పేపర్‌పై పెన్సిల్‌తో మార్కు వేశారని వైసీపీ ఆరోపించారు. కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేశారు. కాగా వైసీపీ నుంచి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్టు అర్థమవుతోంది.ఏడుగురు సభ్యులకు 60కిపైగా ఓట్లు వచ్చాయి. ఒక సభ్యుడికి అత్యల్పంగా 54 ఓట్లు, మరో సభ్యుడికి అత్యధికంగా 65 ఓట్లు నమోదయ్యాయని అధికారులు ప్రకటించారు.
కాగా జీవీఎంసీ స్టాడింగ్ కమిటీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పెరిగినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. కూటమి అధికారంలో ఉండడంతో అభివృద్ధికి నిధులు రావాలంటే ప్రభుత్వం నుంచి సహకారం ఉండాలని భావించి వైసీపీ సభ్యులు సైతం కూటమి తరపున నిలబడిన వారికి ఓటు వేశారు. అందుకే స్పష్టమైన మెజారిటీలు వచ్చాయి. కాగా గెలిచిన సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఈ ఫలితం తమకు కూడా ఆశ్చర్యంగా అనిపిస్తోందని గెలిచిన సభ్యులు చెప్పారు. వైసీపీ పట్ల కార్పొరేటర్లు అసంతృప్తిగా ఉన్నారు కాబట్టే ఈ ఫలితాలు వచ్చాయని వ్యాఖ్యానించారు. అవకతవకలు జరిగాయంటున్న వైసీపీ నేతల ఆరోపణలను తిప్పికొట్టారు. జగన్ మోహన్ రెడ్డి మీద నాయకులకు, నేతలకు నమ్మకంలేదని, ఈ ఫలితాలే అందుకు నిదర్శనమని అన్నారు. ఏ ఎన్నికలైనా తాము విజయం సాధిస్తామని అన్నారు. పదికి 10 స్థానాలు గెలుస్తామంటూ ఎన్నికలకు ముందే చెప్పామని ప్రస్తావించారు. రానున్న మేయర్, ఎమ్మెల్సీ ఎన్నికలు వార్ వన్ సైడ్ అన్నట్టుగా జరుగుతాయని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.