టీడీపీ ఆఫీసుపై దాడిచేసిన.. మీ కార్యకర్తలపై ఏం చర్యలు తీసుకున్నారు?
ABN , Publish Date - Aug 03 , 2024 | 03:25 AM
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలపై ఏం చర్యలు తీసుకున్నారంటూ..
ఓ పార్టీ శ్రేణులు వందలాదిగా వెళ్లి
వేరే పార్టీ ఆఫీసుపై దాడిచేయడమా?
ప్రజాస్వామ్య దేశంలో దీనినెలా చూడాలి?
ముందస్తు బెయిల్ కోరిన వైసీపీ నేతలకు హైకోర్టు ప్రశ్నలు
అమరావతి, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలపై ఏం చర్యలు తీసుకున్నారంటూ.. ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వైసీపీ నేతలను హైకోర్టు ప్రశ్నించింది. ప్రజాస్వామ్య దేశంలో ఓ పార్టీకి చెందిన వందల మంది కార్యకర్తలు వెళ్లి మరో పార్టీ కార్యాలయంపై దాడి చేయడాన్ని ఎలా చూడాలని నిలదీసింది. శుక్రవారం కోర్టు సమయం ముగియడంతో విచారణను సోమవారాని(5వ తేదీ)కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్ ఉత్తర్వులిచ్చారు. విచారణ సందర్భంగా పోలీసుల తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా స్పందిస్తూ.. ఏ కారణాలతో కేసు దర్యాప్తులో జాప్యం జరిగింది.. టీడీపీ కార్యాలయంపై దాడిలో నిందితుల పాత్ర, సాక్ష్యాధారాలను జత చేసి కోర్టు ముందు ఉంచుతామని తెలిపారు.
మంగళగిరి పరిధిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకదాడి వ్యవహారంలో మంగళగిరి రూరల్ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, వైసీపీ నేత దేవినేని అవినాశ్, మాజీ ఎంపీ నందిగం సురేశ్, వైసీపీ కార్యకర్తలు జి.రమేశ్, షేక్ రబ్బాని బాషా, చిన్నాబత్తిన వినోద్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా.. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, రవిచందర్, వీరారెడ్డి, న్యాయవాది వై.నాగిరెడ్డి వాదనలు వినిపించారు. దాడికి సంబంధించి 2021లో కేసు నమోదైందని.. మూడేళ్ల తర్వాత కొందరి వాంగ్మూలాల ఆధారంగా పిటిషనర్లపై కేసు పెడుతున్నారని,, రాజకీయ వైరంతో ఎంపిక చేసుకున్న వ్యక్తులను ఇందులో నిందితులుగా చేరుస్తున్నారని తెలిపారు. కొందరు వ్యక్తులను భయభ్రాంతులకు గురిచేసేందుకే కేసు దర్యాప్తును పునఃప్రారంభించారని.. పోలీసులు కేసును సరిగ్గా దర్యాప్తు చేయకుంటే అందుకు పిటిషనర్లను బాధ్యులుగా చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు.