కేసులతో ‘కట్టిపడేసి’!
ABN , Publish Date - May 16 , 2024 | 04:44 AM
‘అనుచరులు’ తమ చుట్టూనే తిరుగుతూ ఉండాలి! తమపైనే ఆధారపడాలి. అధికారం కోల్పోయినా... అవతలి పార్టీలోకి వెళ్లే వీల్లేకుండా చేయాలి!... ఇదీ వైసీపీ వంకర వ్యూహం! దీనికి
అల్లర్ల వెనుక వైసీపీ అసలు వ్యూహం
అనుచరులు చేజారకుండా చర్యలు
కేసులు నమోదైతే తమ చుట్టూ తిరగాల్సిందే
అందుకే.. ప్రత్యర్థులపై వరుస దాడులు
విద్వేషం చల్లారకుండా వ్యూహం
టీడీపీ వైపు వెళ్లకుండా ఆపేందుకే!
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
‘అనుచరులు’ తమ చుట్టూనే తిరుగుతూ ఉండాలి! తమపైనే ఆధారపడాలి. అధికారం కోల్పోయినా... అవతలి పార్టీలోకి వెళ్లే వీల్లేకుండా చేయాలి!... ఇదీ వైసీపీ వంకర వ్యూహం! దీనికి బలవుతున్నది సొంత పార్టీ కార్యకర్తలు, నేతల అనుచరులే! పోలింగ్ తర్వాత కొనసాగుతున్న భారీ హింసపై లోతుగా ఆరా తీసినప్పుడు ఈ సంగతి బయటపడింది. టీడీపీ నాయకులు ఎవరైనా వైసీపీలో చేరాలనుకుంటే... ముందుగా వాళ్లకు ఒక షరతు పెట్టేవాళ్లు. ‘మీరు చంద్రబాబును, లోకేశ్‌ను గట్టిగా తిట్టండి. ఆ తర్వాతే పార్టీ మారండి. తిట్టకుండా రావడం మాత్రం కుదరదు’ అని తేల్చి చెప్పే వాళ్లు. దీనివల్ల ఆ నేతలు తిరిగి టీడీపీలోకి చేరే అవకాశం ఉండదు. వారు చేరాలనుకున్నా... చేర్చుకోరు. ఇదీ వైసీపీ వ్యూహం. ఇప్పుడు పల్నాడుతోపాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కేడర్‌పైనా ఇలాంటి వ్యూహమే అమలు చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా కేడర్‌ను రెచ్చిగొట్టి ప్రత్యర్థులపై దాడులకు ఉసిగొల్పి బలిపశువుల్ని చేస్తున్నారు. వారిపై కేసులు నమోదైతే సాయం కోసం ఐదేళ్లూ తమ చుట్టూ తిరుగుతుంటారు. ప్రత్యర్థులతో ఘర్షణ పెట్టుకోవడం వల్ల ఆ శిబిరం దగ్గరకు రానివ్వదు. దీనివల్ల తమ కిందే ఉంటారనే వ్యూహం దాగి ఉన్నట్టు తెలుస్తోంది. పోలింగ్ ముగిసిన తర్వాత సాధారణంగా చల్లబడాల్సిన రాజకీయ వాతావరణం ఆకస్మికంగా వేడెక్కడానికి, రాష్ట్రంలో పలు చోట్ల హింసాత్మక దాడులు చోటు చేసుకోవడానికి ఈ వ్యూహమే కారణమని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
వందల సంఖ్యలో పోగేసి...
సాధారణంగా పోలింగ్‌కు ముందు, పోలింగ్ రోజు పార్టీల మధ్య దాడులు, గొడవలు అక్కడక్కడా ఉండేవే. కానీఈసారి ఇందుకు భిన్నంగా పోలింగ్ తర్వాత కొన్ని ప్రాంతాల్లో హింస పెరిగింది. వందలసంఖ్యలో అనుచర వర్గాన్ని పోగు చేసి సుత్తులు, ఇనుపరాడ్లు, కర్రలతో స్వైర విహారం చేస్తూ ప్రత్యర్థులపై తెగబడి దాడులు చేయడం అధికార వర్గాలకు విస్మయం కలిగిస్తోంది. ఇందులో అధికార వైసీపీ నేతలే ప్రముఖంగా కనిపిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి సోదరుడు స్వయంగా నాయకత్వం వహించి మారణాయుధాలు చేతబట్టిన అనుచరులతో కలిసి దాడులు నిర్వహించారు. తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తానే నాయకత్వం వహించి టీడీపీ నేతల ఇళ్లపై దాడులు జరిపారు. చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అనుచరవర్గం టీడీపీ అభ్యర్థిని గాయపర్చింది. ఈ ఘటనలు అనుకోకుండా జరిగినవి కావని, వీటి వెనుక ప్రత్యేక వ్యూహం ఉందని కొందరు పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఓటమి భయంతో సొంత పార్టీ కేడర్ చేజారిపోకుండా ఉండటానికి వారిని బలిపశువుల్ని చేస్తున్నారు.
వ్యూహంతోనే దాడులు
‘ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైతే ఆ పార్టీ నేతల వెనుక తిరిగే వారిలో చాలా మంది జారిపోయే వాతావరణం నెలకొంది. దీనిని నాయకత్వం పసిగట్టింది. ఫలితాలు రాక ముందే తమ అనుచర గణాన్ని ఏదో ఒక దాడి ఘటనలో ఇరికించి ప్రత్యర్థి పార్టీ వారికి కోపం తెప్పిస్తే ఇక వారిని చేర్చుకోరు. వైసీపీ నేతలు సరిగ్గా ఇదే కోరుకుంటున్నారు’ అని ఓ పోలీస్ అధికారి విశ్లేషించారు.
విందు రాజకీయం
పోలింగ్ తర్వాత వైసీపీ అభ్యర్థులు కొందరు రకరకాల వ్యూహాలకు పదును పెడుతున్నారు. పోలింగ్ అధికార పార్టీకి వ్యతిరేకంగా జరిగిందన్న ప్రచారం విస్తృతంగా జరగడంతో వైసీపీ కేడర్‌లో నీరసం అలుముకొంది. ఈ పరిస్థితుల్లో కేడర్‌లో నమ్మకం కలిగించడానికి కొందరు వైసీపీ అభ్యర్థులు విందు పార్టీలు ఇస్తున్నారు. ఎన్నికల్లో బాగా పనిచేసి విజయం అందిస్తున్నందుకు అభినందనల పేరుతో ఈ విందులు ఏర్పాటవుతున్నాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసిన మంత్రి రజని ఇటువంటి విందు సమావేశం ఏర్పాటు చేసి కేడర్‌లో నమ్మకం కలిగించే ప్రయత్నంలో ఉన్నారు.