Share News

Supreme Court: సుప్రీంను ఆశ్రయించిన అవినాశ్.. బెయిల్ వస్తుందా?

ABN , Publish Date - Sep 09 , 2024 | 03:57 PM

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన టీడీపీ (Telugu Desam) కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇక మిగిలింది పెద్ద తలకాయలు మాత్రమే.. ఇందులోనూ ఇద్దరు ముగ్గురు అరెస్ట్ కాగా.. మరికొందరి కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. అయితే.. అరెస్ట్ నుంచి తప్పించుకోవాలని వైసీపీ యువనేత దేవినేని అవినాశ్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు...

 Supreme Court: సుప్రీంను ఆశ్రయించిన అవినాశ్.. బెయిల్ వస్తుందా?

అమరావతి/న్యూ ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన టీడీపీ (Telugu Desam) కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇక మిగిలింది పెద్ద తలకాయలు మాత్రమే.. ఇందులోనూ ఇద్దరు ముగ్గురు అరెస్ట్ కాగా.. మరికొందరి కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. అయితే.. అరెస్ట్ నుంచి తప్పించుకోవాలని వైసీపీ యువనేత దేవినేని అవినాశ్ (Devineni Avinash) విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే విదేశాలకు పారిపోతుండగా.. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించడం.. న్యాయస్థానం నిరాకరించడంతో ఇక దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


supreme-court.jpg

ఊరట దక్కేనా..

ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో దేవినేని అవినాశ్ పిటీషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్‌‌ను నిరాకరించడంతో.. సుప్రీంకోర్టులో అయినా ఊరట దక్కుతుందేమోనని అవినాశ్ ఆశలు పెట్టుకున్నారు. సుప్రీంను ఆశ్రయించడంతో.. ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేసినట్లు అయ్యింది. ఇదివరకే.. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, తలశీల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో పాటు పలువురు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు ససేమిరా అనడంతో.. ఈ తీర్పును సుప్రీంలో సవాలు చేస్తూ అవినాశ్ పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం నాడు ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడైనా ఊరట దక్కుతుందో లేదో చూడాలి.


ap high court.jpg

హైకోర్టు ఏం చెప్పింది..?

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి, చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు వైసీపీ నేతలకు హైకోర్టు నో చెప్పేసింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ ఇచ్చేది లేదని హైకోర్టు స్పస్టం చేసింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించే ప్రసక్తే లేదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్, అప్పిరెడ్డి, నందిగాం సురేష్, తలశిల రఘురామ్‌తో పాటు 14 మందికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నో చెప్పింది. ఇక చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్‌కు బెయిల్ తిరస్కరించింది ధర్మానసం. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో వీరందరినీ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాగా.. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసు వైసీపీ నేతల మెడకు చుట్టుకుంది. 2021 అక్టోబర్ 19వ తేదీ సాయంత్రం వైసీపీ నేతలు విజయవాడలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటితోపాటు తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడులు చేసి వీరంగం సృష్టించారు. ఈ దాడుల దృశ్యాలు టీడీపీ కార్యాలయంలోని సీసీటీవీ పుటేజీలో రికార్డు అయ్యాయి. అప్పట్లో కార్యాలయంపై దాడికి నిరసనగా చంద్రబాబు రెండు రోజులపాటు మౌన దీక్ష కూడా చేశారు. ఆ తర్వాత రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసును మళ్లీ ఓపెన్ చేయడంతో అరెస్టుల పర్వం కొనసాగుతోంది.

Updated Date - Sep 09 , 2024 | 04:00 PM