Share News

ఈ ఏడాది 12,000 కొలువులు

ABN , Publish Date - May 13 , 2024 | 01:13 AM

ప్రభుత్వ రంగంలోని భారతీయ స్టేట్‌బ్యాంక్‌ (ఎస్‌బీఐ) పెద్దఎత్తున ఉద్యోగుల నియామకానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఎంత లేదన్నా 12,000 నియామకాలు ఉంటాయని...

ఈ ఏడాది 12,000 కొలువులు

ఇందులో 85 శాతం మంది ఇంజనీర్లే .. టెక్నాలజీ అప్‌గ్రేడేషన్‌పైనే దృష్టి

ఎస్‌బీఐ చైర్మన్‌ దినేశ్‌ ఖారా

ముంబై: ప్రభుత్వ రంగంలోని భారతీయ స్టేట్‌బ్యాంక్‌ (ఎస్‌బీఐ) పెద్దఎత్తున ఉద్యోగుల నియామకానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఎంత లేదన్నా 12,000 నియామకాలు ఉంటాయని బ్యాంక్‌ చైర్మన్‌ దినేశ్‌ ఖారా చెప్పారు. ఇందులో 85 శాతం మంది ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లే ఉంటారన్నారు. ఐటీ రంగం లో ఫ్రెషర్స్‌ నియామకాలు తగ్గిన నేపథ్యంలో ఎస్‌బీఐ ఇలా పెద్దఎత్తున ఇంజనీర్ల నియామకానికి సిద్ధమవడం విశేషం. ప్రొబేషనరీ ఆఫీసర్లు, అసోసియేట్ల పోస్టుల్లో ఈ నియామకాలు ఉంటాయని ఖారా చెప్పారు. ‘కొత్త ఉద్యోగులకు ముందుగా బ్యాంకింగ్‌ విధి విధానాల్లో శిక్షణ ఇస్తాం. తర్వాత వారి యోగ్యత, ఆసక్తిని బట్టి ఐటీ, వివిద వ్యాపార బాధ్యతల్లో నియమిస్తాం. దీనివల్ల బ్యాంక్‌కు నిరంతరం టెక్నాలజీ నైపుణ్యాలు ఉన్న మానవ వనరులు అందుబాటులో ఉంటాయి’ అని ఆయన అన్నారు. సరికొత్త టెక్నాలజీతో ఖాతాదారులను ఆకర్షించేందుకు బ్యాంకులు పోటీపడుతున్న సమయంలో ఎస్‌బీఐ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్ల నియామకాలపై దృష్టి పెట్టడం విశేషం.


టెక్నాలజీనే కీలకం: బ్యాంకుల నిర్వహణకు టెక్నాలజీ అత్యంత ముఖ్యమని ఎస్‌బీఐ చైర్మన్‌ స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ ఈ విషయాన్ని ఏ మాత్రం విస్మరించలేరన్నారు. బ్యాంకింగ్‌ రంగంలో టెక్నాలజీ వినియోగానికి సంబంఽధించి భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కూడా ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేస్తూ.. టెక్నాలజీ వినియోగంలో వెనకబడిన బ్యాంకులపై పెనాల్టీలు విధిస్తున్న విషయాన్ని ఖారా గుర్తు చేశారు.

టెక్నాలజీపై భారీగా ఖర్చు: టెక్నాలజీ అప్‌గ్రేడేషన్‌ కోసం ఎస్‌బీఐ ఎంత ఖర్చు చేస్తోందన్న విషయాన్ని వెల్లడించేందుకు దినేశ్‌ నిరాకరించారు. అయితే ఇది ఇతర బ్యాంకుల కంటే ఎక్కువే ఉంటుందన్నారు. ప్రస్తుతం దేశీయ బ్యాంకులు తమ నిర్వహణ ఖర్చుల్లో సగటున 7 నుంచి 8 శాతం టెక్నాలజీ అప్‌గ్రేడేషన్‌ కోసం ఖర్చు చేస్తున్నాయి. అయితే ఎస్‌బీఐ చైర్మన్‌ మాటలను బట్టి చూస్తే బ్యాంక్‌ ఇంత కంటే ఎక్కువే ఖర్చు చేస్తోందని భావించాలి.

Updated Date - May 13 , 2024 | 01:13 AM