AP Election 2024: ఏపీలో హింసాత్మక ఘటనలు ఎందుకు జరిగాయో ఈసీకి చెప్పిన సీఎస్, డీజీపీ
ABN , Publish Date - May 16 , 2024 | 07:35 PM
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో చెలరేగిన అల్లర్లు, హింసాత్మక ఘటనలపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘానికి గురువారం వ్యక్తిగత వివరణ ఇచ్చారు. సుమారు అరగంట పాటు సీఎస్, డీజీపీ వివరణ ఇచ్చారు. ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
న్యూఢిల్లీ: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో చెలరేగిన అల్లర్లు, హింసాత్మక ఘటనలపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘానికి గురువారం వ్యక్తిగత వివరణ ఇచ్చారు. సుమారు అరగంట పాటు సీఎస్, డీజీపీ వివరణ ఇచ్చారు.
ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. కొన్ని వర్గాల మధ్య ఉన్న వ్యక్తిగత కక్షలు, కార్పణ్యాల కారణంగానే హింస చెలరేగినట్లు జవహర్ రెడ్డి, హరీశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. వీరివురితో పాటు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ కుమార్ విశ్వజిత్ కూడా వ్యక్తిగతంగా హాజరయ్యారు. అయితే హింసాత్మక ఘటనలను ఎందుకు అదుపుచేయలేక పోయారని సీఎస్, డీజీపీలను ఈసీ నిలదీసింది. విచ్చలవిడిగా దాడులు జరుగుతుంటే ఎందుకు అదుపు చేయలేకపోయారని ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం అందింది.
వరుసగా మూడు రోజులపాటు జరిగిన హింసాత్మక ఘటనలకు ఎవరు బాధ్యులంటూ కేంద్ర ఎన్నికల సంఘం మండిపడిందని తెలుస్తోంది. పోలీసు అధికారుల నిర్లిప్తతపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మండిపడ్డారని సమాచారం. ఇంటెలిజెన్సీ సమాచారాన్ని తగిన విధంగా వినియోగించుకోలేకపోయినట్లు తమకు సమాచారం అందిందని డీజీపీపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఒక పక్క హింసాత్మక ఘటనలు జరుగుతుంటే పోలీసు యంత్రాంగం చేష్టలుడిగి పోయినట్ల వ్యవహరించడమేమిటని ప్రశ్నించనట్టు సమాచారం. ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులపైనే దాడులు జరిగినా నివారించలేకపోతే శాంతి భద్రతలు అదుపు తప్పినట్లు కాదా? అని సీఈసీ ప్రశ్నించింది.
ఏ క్షణంలోనైనా ఉత్తర్వులు..
సీఎస్, డీజీపీ వివరణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఏ క్షణంలోనైనా ఉత్తర్వులను జారీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. సీఎస్, డీజీపీలపై తీసుకోబోయే చర్యలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇందుకు సంబంధించి ఉత్వర్వులు వెలువడితే క్లారిటీ రానుంది. కాగా వివరణ సందర్భంగా ఏపీ సీఎస్, డిజీపీలపై కేంద్ర ఎన్నికల సంఘం మండిపడినట్టు తెలుస్తోంది. దీంతో చర్యలపై ఉత్కంఠ నెలకొంది.