Mango: మామిడి కాయ, మామిడి పండు.. ఆరోగ్యానికి ఏది బెటర్?
ABN , Publish Date - May 14 , 2024 | 10:24 PM
మామిడికాయ, మామిడిపండు వేటికవే ప్రత్యేకమని నిపుణులు చెబుతున్నారు. ఒక్కోదానితో ఒక్కో రకమైన ప్రయోజనం ఉందని అంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇది మామిడి పళ్ల సీజన్. రుచికరమైన మామిడి పళ్లను ఇప్పటికే అనేక మంది ఎంజాయ్ చేయడం ప్రారంభించారు. కొందరు మామిడి కాయలతో ఆవపచ్చడి కూడా పెట్టుకుంటూ ఉంటారు. అయితే, మామిడికాయ, పండుల్లో ఆరోగ్యానికి (Health) ఏది బెటర్ అనే సందేహం అనేక మందికి కలిగే ఉంటుంది. దీనికి న్యూట్రిషనిస్టులు సవివరమైన సమాధానమే చెబుతున్నారు.
మామిడి పళ్లల్లో బీటాకెరోటీన్, ల్యూటీన్, జియాజాంథీన్ వంటి యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో చక్కెరలు కూడా అధికమే. రకరకాల విటమిన్లు, మినరల్స్, ఫైబర్ కూడా ఉంటాయి. ఇక మామిడి కాయల్లో విటమిన్ సీ అధికం. ఫలితంగా మామిడికాయల్లో ఆమ్ల గుణం ఎక్కువగా ఉంటుంది. ఇది ఆహారం త్వరగా జీర్ణం అయ్యేందుకు ఉపకరిస్తుంది. ఇందులో పీచు పదార్థం కూడా అధికమేనని నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీఆక్సిడెంట్, యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు క్యాన్సర్, గుండెసంబంధిత సమస్యలను దరిచేయనీయవు (which is better raw mango or ripe mango).
భోజనానికి ముందు, తరువాత టీ, కాఫీలు తాగొద్దు! ఎందుకో తెలుసా?
నిపుణులు చెప్పే దాని ప్రకారం, రోగనిరోధక శక్తి పెంపొందించడంలో విటమిన్ సీ అధికంగా ఉన్న మామిడికాయలు ముందుంటాయి. యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న మామిడి పళ్లు.. క్యాన్సర్, గుండెసంబంధిత సమస్యలను బాగా నిరోధిస్తాయి. ఇక జీర్ణవ్యవస్థకు రెండింటితోనూ ప్రయోజనం చేకూరుతుంది. చక్కెరలు అధికంగా ఉండే మామిడి పండుకు రుచిలో తిరుగేలేనప్పటికీ డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు మామిడిపండ్ల విషయంలో కాస్తంత అలర్ట్‌గా ఉండాలి.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.