Dubai Princess: దుబాయ్ యువరాణి సంచలనం.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా భర్తకు విడాకులు
ABN , Publish Date - Jul 17 , 2024 | 08:47 PM
దుబాయ్ యువరాణి షేఖా మహ్రా బిన్త్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ (30) ఓ సంచలన ప్రకటన చేసింది. ఇన్‌స్టాగ్రామ్ మాధ్యమం ద్వారా తన భర్త షేక్ మనా బిన్ హమమ్మద్ బిన్ రషీద్ బిన్ మనా..
దుబాయ్ యువరాణి షేఖా మహ్రా బిన్త్ (Sheikha Mahra Bint) మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ (30) ఓ సంచలన ప్రకటన చేసింది. ఇన్‌స్టాగ్రామ్ మాధ్యమం ద్వారా తన భర్త షేక్ మనా బిన్ హమమ్మద్ బిన్ రషీద్ బిన్ మనా అల్ మక్తూమ్‌కి (30) విడాకులు ఇచ్చింది. ఇస్లాం మతం ప్రకారం.. ట్రిపుల్ తలాక్‌తో విడాకులు ఇస్తున్నట్లు ఆమె ఇన్‌స్టాలో పోస్టు పెట్టింది. అంతేకాదు.. తాను విడాకులు ఇవ్వడానికి గల కారణం ఏంటో కూడా ఆ పోస్టులోనే రివీల్ చేసింది. ఇతర సహచరులతో బిజీగా ఉన్నారు కాబట్టి, ఈ విడాకులు ప్రకటిస్తున్నానని ఆమె బాంబ్ పేల్చింది.
‘‘ప్రియమైన భర్త.. మీరు ఇతర సహచరులతో ఎక్కువ కాలం గడుపుతున్నారు. కాబట్టి.. మీకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నేను మీకు విడాకులు ఇస్తున్నా.. నేను మీకు విడాకులు ఇస్తున్నా.. నేను మీకు విడాకులు ఇస్తున్నా (ట్రిపుల్ తలాక్. ఇకపై మీరు జాగ్రత్తగా ఉండండి.. ఇట్లు మీ మాజీ భార్య’’ అంటూ షేఖా మహ్రా ఆ ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చింది. వీళ్లిద్దరు విడిపోతున్నారని గత కొన్ని రోజుల నుంచే పుకార్లు షికారు చేస్తున్నాయి. ముఖ్యంగా.. తన కూతురితో ఓ ఫోటో పోస్టు చేసి, ‘ఇద్దరం మాత్రమే’ అంటూ క్యాప్షన్ పెట్టినప్పుడు ఆ రూమర్లు ఊపందుకున్నాయి. ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసుకోవడంతో పాటు తమతమ ఫోటోలు కూడా డిలీట్ చేశారు. ఇప్పుడా రూమర్లను నిజం చేస్తూ.. మహ్రా విడాకులు ప్రకటించింది.
ఇదిలావుండగా.. దుబాయ్‌లో ప్రముఖ వ్యాపారవేత్త అయిన షేక్ మనా బిన్ మహమ్మద్‌తో షేఖా మహ్రాకు గతేడాది మే నెలలో వివాహం జరిగింది. వీళ్లు పెళ్లి చేసుకున్న రెండు నెలల తర్వాత.. ఈ జంటకి ఓ పండంటి కుమార్తె పుట్టింది. బిడ్డ పుట్టినప్పుడు.. ఇది తమ జీవితంలో ఎంతో అద్భుతమైన క్షణాలు అంటూ సోషల్ మీడియాలో తమ భావోద్వేగాలను కూడా పంచుకున్నారు. ఇంతలోనే ఏమైందో ఏమో తెలీదు కానీ.. వీళ్లిద్దరి మధ్య దూరం పెరగడం, అది విడాకుల దాకా రావడం జరిగింది. కాగా.. షేఖా మహరా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడి కుమార్తె. యూఏఈలోని డిజైనర్లు, మహిళల హక్కుల కోసం పోరాడే ధీర వనిత.
Read Latest International News and Telugu News