Hurricane Beryl: భయంకరమైన హరీకేన్.. స్పేస్ స్టేషన్ నుంచి ఇలా ఉంది..
ABN , Publish Date - Jul 02 , 2024 | 12:58 PM
ISS Captured Hurricane Beryl Visuals :తూర్పు కరేబియన్ ప్రాంతంలో ఏర్పడిన భయంకరమైన హరికేన్ బెరిల్(Hurricane Beryl) అసాధారణ దృశ్యాలను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS) చిత్రీకరించింది. భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తు నుండి తీసిన వీడియో.. హరికేన్ పూర్తి పరిమాణం, తీవ్రతను స్పష్టంగా..
ISS Captured Hurricane Beryl Visuals : తూర్పు కరేబియన్ ప్రాంతంలో ఏర్పడిన భయంకరమైన హరికేన్ బెరిల్(Hurricane Beryl) అసాధారణ దృశ్యాలను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS) చిత్రీకరించింది. భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తు నుండి తీసిన వీడియో.. హరికేన్ పూర్తి పరిమాణం, తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తుంది. బెరిల్ హరికేన్ 4వ కేటగిరి తుఫానుగా మారింది. గంటకు 257 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ హరికేన్ పరిణామం అంతరిక్షం నుంచి స్పష్టంగా కనిపిస్తోంది. నాసా వ్యోమగామి మాథ్యూ డోమినిక్ ఈ హరికేన్ దృశ్యాలను చిత్రీకరించారు. దీనిని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన మాథ్యూ.. ఇది వింత అనుభూతిని, వాతావరణ తార్కిక ఉత్సాహాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.
నేషనల్ హరికేన్ సెంటర్(NHS) బెరిల్ హరికేన్‌ను విపత్తుగా విర్గీకరించింది. ఇది జమైకా, ఇతర కరేబియన్ దీవులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రకటించింది. ప్రస్తుతం ఈ హరికేన్ జమైకా రాజధాని కింగ్‌స్టన్‌కు తూర్పు్-ఆగ్నేయంగా 840 మైళ్లు(1,352 కిలోమీటర్లు) దూరంలో ఉంది. వాతావరణంలో తీవ్రమైన మార్పులు ఉంటాయని శాస్త్రవేత్తలు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో ఏర్పడిన అధిక ఉష్ణోగ్రతలు.. బెరిల్ హరికేన్‌ను మరింత ఉధృతం చేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంతేకాదు.. దీని తీవ్రతను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. గ్లోబల్ వార్మింగ్ పెరుగుతున్న ప్రభావాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు.
కాగా, ఈ తుపాను ప్రభావం ఇప్పటికే తూర్పు కరేబియన్ ప్రాంతంలో తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. విద్యుత్ లైన్లు తెగిపోయాయి. వీధులన్నీ వరదలతో నిండిపోయాయి. సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్‌తో సహా అనేక ద్వీపాలకు హరికేన్ హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో 25 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.
బెరిల్ హరికేన్ పశ్చిమ దిశలో ప్రయాణిస్తోందని.. ఈ వారం చివరిలో జమైకాలో తీవ్ర గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం, మరికొన్ని ప్రాంతాల్లో ఏకంగా 31 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. కాగా, ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ విడుదల చేసిన బెరిల్ హరికేన్ ఫుటేజీని చూసి.. దాని తీవ్రతను, ప్రభావిత ప్రాంతాలను అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు.