PM Modi Russia Tour: రాజస్ధాని పాట ప్రదర్శనతో ప్రధాని మోదీకి అద్భుత స్వాగతం
ABN , Publish Date - Jul 08 , 2024 | 07:08 PM
రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సోమవారం సాయంత్రం రష్యాకు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అద్భుత స్వాగతం లభించింది. మాస్కోలో దిగిన ఆయనకు తొలుత ఉపప్రధాని...
రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సోమవారం సాయంత్రం రష్యాకు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి (PM Narendra Modi) అద్భుత స్వాగతం లభించింది. మాస్కోలో (Moscow) దిగిన ఆయనకు తొలుత ఉపప్రధాని డెనిస్ మంటురోవ్ సాదర స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి బయటకు రాగానే.. భారతీయులతో పాటు రష్యన్ డ్యాన్స్ ట్రూప్స్ సాంస్కృతిక నృత్యాలతో ప్రధానిని స్వాగతించారు. ఓ అమ్మాయిల బృందం ‘రంగిలో మారో ఢోల్నా’ అనే రాజస్థానీ పాటకు డ్యాన్స్ వేశారు. డ్యాన్స్ చేసింది రష్యన్ అమ్మాయిలే అయినా.. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా దుస్తులు వేసుకుని, డ్యాన్స్ అదరగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
అంతేకాదు.. ప్రధాని మోదీ హోటల్ వద్దకు వచ్చిన వెంటనే, ఆయనను చూసి మాస్కోలోని భారతీయ డయాస్పోరా యువకులు ‘వందేమాతరం’ నినాదాలు చేశారు. 11 ఏళ్లుగా అక్కడే ఉంటున్న అన్షికా సింగ్ అనే ఓ యువతి మాట్లాడుతూ.. ప్రధాని మోదీని కలవడం గౌరవంగా, ఉత్సాహంగా ఉందని తెలిపింది. సిద్ధూ అనే మరో వ్యక్తి మాట్లాడుతూ.. తాను 17 ఏళ్లుగా మాస్కోలో ఉంటున్నానని, ప్రధాని మోదీని కలిసే అవకాశం కల్పించిన భారత రాయబార కార్యాలయానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. అబీర్ ఇంతియాజ్ అనే వ్యక్తి సైతం.. తనకు మోదీని కలిసినందుకు చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చాడు. దీపాలీ చౌదరి అనే ఓ మహిళ.. ప్రధాని మోదీ కోసం ఓ పెయింటింగ్ తీసుకొచ్చింది.
ఇదిలావుండగా.. 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు మోదీ అక్కడికి వెళ్లారు. ఈ సదస్సులో ఇరు దేశాధినేతలు పాల్గొని.. రెండు దేశాల మధ్య వాణిజ్య, రక్షణ, ఆర్థిక సహకారంపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. మరోవైపు.. మోదీ కోసం పుతిన్ ప్రత్యేక విందుని ఏర్పాటు చేశారు. మరుసటి రోజు ప్రవాస భారతీయులతో ప్రధాని ముచ్చటించనున్నారు. అనంతరం.. ఇద్దరు నాయకుల మధ్య క్లోజ్డ్-డోర్ సమావేశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ రష్యా పర్యటనని ముగించుకున్న తర్వాత మోదీ ఆస్ట్రియా వెళ్లనున్నారు.
Read Latest International News and Telugu News