Flesh-Eating Bacteria: మాంసం తినే బ్యాక్టీరియా.. అక్కడ అల్లకల్లోలం
ABN , Publish Date - Jun 16 , 2024 | 07:47 AM
ప్రపంచ దేశాలు కొవిడ్-యుగం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఇంకా చాలా చోట్ల దీని ప్రభావం పూర్తిగా తగ్గలేదు. రకరకాల వేరియెంట్స్‌తో ఇది జనాల జీవితాలను అస్తవ్యస్తం..
ప్రపంచ దేశాలు కొవిడ్-యుగం (Covid-19) నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఇంకా చాలా చోట్ల దీని ప్రభావం పూర్తిగా తగ్గలేదు. రకరకాల వేరియెంట్స్‌తో ఇది జనాల జీవితాలను అస్తవ్యస్తం చేస్తూనే ఉంది. ఇది చాలదన్నట్టు.. ఇప్పుడు మరో భయంకరమైన వైరస్ విలయతాండవం చేస్తోంది. అది మనుషుల మాంసం తినే వైరస్ (Flesh-Eating Bacteria). ఒక్కసారి సోకిందంటే చాలు.. రెండు రోజుల్లోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ప్రస్తుతం ఈ బ్యాక్టీరియా జపాన్‌లో విస్తృతంగా వ్యాపిస్తోంది.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (NIID) ప్రకారం.. ఈ సంవత్సరం జూన్ 2వ తేదీ నాటికి స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (STSS) కేసులు 977కి చేరినట్లు తేలింది. గతేడాది మొత్తంలో 941 కేసులు నమోదవ్వగా.. ఈ ఏడాదిలో కేవలం ఆరు నెలల్లోనే అంతకంటే ఎక్కువ కేసులు నమోదవ్వడం ఆందోళనలకు గురి చేస్తోంది. 1999లో ఈ వైరస్ పుట్టినట్లు రిపోర్ట్స్ చెప్తున్నాయి. గ్రూప్-ఏ రకానికి చెందిన స్ట్రెప్టోకోకస్ (Streptococcus) కారణంగా.. పిల్లల్లో వాపు, గొంతునొప్పి వస్తుంది. మరికొన్ని రకాల బ్యాక్టీరియాలు సోకినప్పుడు మాత్రం అవయవ నొప్పులు, వాపు, స్వరం, లో-బీపీ, శ్వాస సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఈ వైరస్ గురించి టోక్యో ఉమెన్స్ మెడికల్ యూనివర్శిటీలో అంటువ్యాధుల ప్రొఫెసర్ కెన్ కికుచి మాట్లాడుతూ.. ఈ వైరస్ సోకిన 48 గంటల్లోనే మరణం సంభవిస్తుందని అన్నారు. ఈ వైరస్ సోకినప్పుడు.. ఉదయం ఆ రోగి పాదంలో వాపు వస్తుందని, మధ్యాహ్నానికే అది మోకాలి వరకు విస్తరిస్తుందని, అనంతరం 48 గంటల్లో చనిపోవచ్చని చెప్పారు. జపాన్‌లో ఇప్పటివరకూ ఈ ఇన్‌ఫెక్షన్ కేసుల సంఖ్య 2,500 చేరుకొని ఉంటుందని, మరణాల రేటు 30% వరకూ ఉందని వెల్లడించారు. కాబట్టి.. ప్రజలందరూ పరిశుభ్రత పాటించాలని, ఏ చిన్న గాయం తగిలినా చికిత్స చేయించుకోవాలని చెప్పుకొచ్చారు.
Read Latest International News and Telugu News