Share News

దేశమంతా 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌

ABN , Publish Date - May 13 , 2024 | 03:59 AM

నన్ను అరెస్టు చేసి ఆప్‌ను విచ్ఛిన్నం చేయాలని, ఆప్‌ ప్రభుత్వాన్ని కూలదోయాలన్న బీజేపీ కుట్ర భగ్నమైంది. నా అరెస్టుతో ఆప్‌ మరింత బలపడింద’ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

దేశమంతా 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌

అగ్నిపథ్‌ పథకం రద్దు... రైతులకు కనీస మద్దతు ధర

పది గ్యారెంటీలను ప్రకటించిన ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ, మే 12: ‘నన్ను అరెస్టు చేసి ఆప్‌ను విచ్ఛిన్నం చేయాలని, ఆప్‌ ప్రభుత్వాన్ని కూలదోయాలన్న బీజేపీ కుట్ర భగ్నమైంది. నా అరెస్టుతో ఆప్‌ మరింత బలపడింద’ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. తాను జైలులో ఉన్నప్పుడు ఆప్‌ ఎమ్మెల్యేలను, నాయకులను బీజేపీ సంప్రదించిందని తెలిపారు. కానీ వారెవరూ బీజేపీ కుట్రలను సాగనివ్వలేదని, ఆప్‌ను వీడి వెళ్లలేదన్నారు. ‘దేశం మిమ్మల్ని చూసి గర్వపడుతోంద’ని తన పార్టీ ఎమ్మెల్యేలను అభినందించారు. ఆదివారం కేజ్రీవాల్‌ వారితో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో లోక్‌సభ ఎన్నికలకు పది గ్యారెంటీలను ప్రకటించారు. కేంద్రంలో ‘ఇండియా’ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా 24 గంటల విద్యుత్తు సరఫరా చేస్తామని, ఢిల్లీలో మాదిరిగా 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తామని చెప్పారు. ఢిల్లీలో చేసినట్టే దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తామని తెలిపారు. ఢిల్లీ మోడల్‌లో దేశమంతటా మారుమూల ప్రాంతాలతో సహా ‘మొహల్లా క్లినిక్‌’లు ఏర్పాటు చేస్తామన్నారు. చైనా ఆక్రమించిన భారత భూభాగాన్ని విడిపిస్తామన్నారు. స్వామినాథన్‌ కమిటీ నివేదికకు అనుగుణంగా రైతులకు కనీస మద్దతు ధర ఇస్తామన్నారు. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర ప్రతిపత్తి కల్పిస్తామన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. బీజేపీ అవినీతిపై దేశవ్యాప్తంగా దాడులు చేయిస్తామని, జీఎస్టీని సరళం చేస్తామని కేజ్రీవాల్‌ తెలిపారు. అయితే, ఈ గ్యారెంటీలను ‘ఇండియా’ భాగస్వామ్య పక్షాలతో చర్చించలేదని, అందుకు సమయం దొరకలేదని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. తాను ప్రధాని పదవి రేసులో లేనని స్పష్టం చేశారు. తర్వాత, కేజ్రీవాల్‌ పంజాబ్‌ సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌తో కలిసి ఢిల్లీలో ఆప్‌ లోక్‌సభ అభ్యర్థుల తరఫున రోడ్‌ షో నిర్వహించారు.

Updated Date - May 13 , 2024 | 03:59 AM