Share News

నువ్వు అవినీతిపరుడివి.. నువ్వే నిందితుడివి!

ABN , Publish Date - Sep 30 , 2024 | 03:09 AM

కేంద్ర మంత్రి, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, లోకాయుక్త ఏడీజీపీ మువ్వ చంద్రశేఖర్‌ మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరింది.

నువ్వు అవినీతిపరుడివి.. నువ్వే నిందితుడివి!

  • కర్ణాటకలో కేంద్ర మంత్రి వర్సెస్‌ ఐపీఎస్‌.. గంగేనహళ్లి భూముల వివాదంపై రోడ్డెక్కిన కుమారస్వామి, చంద్రశేఖర్‌

  • కేంద్ర మంత్రిని పందితో పోల్చిన ఐపీఎస్‌.. నిందితుడు, ఆరోపితుడంటూ వ్యాఖ్యలు.. చంద్రశేఖర్‌ కబ్జాకోరన్న మంత్రి

  • పరస్పరం.. తీవ్ర వ్యాఖ్యలు, విమర్శలు.. ఐపీఎస్‌పై కేంద్ర హోం శాఖ సీరియస్‌!.. చర్యలు తప్పవన్న కేంద్ర మంత్రి జోషి

  • కర్ణాటకలో కాకరేపుతున్న వ్యవహారం.. జోక్యానికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య దూరం

బెంగళూరు, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రి, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, లోకాయుక్త ఏడీజీపీ మువ్వ చంద్రశేఖర్‌ మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరింది. ఈ వివాదం ఏకంగా ఢిల్లీని తాకింది. గంగేనహళ్లి భూముల ‘డీ నోటిఫికేషన్‌’ వివాదానికి సంబంధించి కుమారస్వామి రెండురోజుల కిందట లోకాయుక్త ముందు విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. లోకాయుక్త సిట్‌ అధికారి చంద్రశేఖర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ అవినీతి అధికారి అనీ, అలాంటి వారిని పెట్టుకుని రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలన సాగిస్తోందని విమర్శించారు. రాజ్‌భవన్‌ సిబ్బందిపైనే విచారణ జరిపేందుకు సదరు ఐపీఎస్‌ అధికారి అనుమతి కోరారని మండిపడ్డారు.

రాష్ట్రపతి కార్యాలయానికి అనుబంధమైన రాజ్‌భవన్‌ సిబ్బందిపైనే విచారణ జరిపేందుకు సిద్ధమయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని, ఏపీకి చెందిన చంద్రశేఖర్‌.. హిమాచల్‌ప్రదేశ్‌ క్యాడర్‌కు ఎంపికై 25 ఏళ్లుగా రాష్ట్రంలో నే కొనసాగుతున్నారని తెలిపారు. బెంగళూరులో ఆయనకు ఎవరితో సంబంధాలు ఎలాంటివో, ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారో, ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారో తెలుసని వ్యాఖ్యానించారు. గవర్నర్‌ కార్యాలయం నుంచే లేఖలు లీకయ్యాయనే కట్టుకథ చెప్పి రాజ్‌భవన్‌ సిబ్బందిని విచారించాలని లేఖ రాయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ‘‘భూదందాలో రూ.20 కోట్లు డిమాండ్‌ చేసిన విషయమై ఓ ఇన్‌స్పెక్టరే ఫిర్యా దు చేశారు. చంద్రశేఖర్‌ భార్య పేరిట 38 అంతస్తుల కమర్షియల్‌ కాంప్లెక్స్‌ ఉంది. రాజకాలువపై కట్టారు. చెరువును ఆక్రమించుకున్నారు’’ అని కుమారస్వామి తీవ్రస్థాయిలో ఆరోపించారు.


  • బెయిల్‌పై ఉన్న నిందితుడు: చంద్రశేఖర్‌

కేంద్రమంత్రి కుమారస్వామి ఆరోపణలకు ఐపీఎస్‌ అధికారి చంద్రశేఖర్‌ దీటుగా స్పందించారు. కేసులో నిందితుడైన కుమారస్వామికి భయపడేది లేదన్నారు. ఆయన ఎంత శక్తిమంతుడైనా, ఎంత ఉన్నత హోదాలో ఉన్నా బెయిల్‌పై ఉన్న నిందితుడేనని వ్యాఖ్యానించారు. ‘‘పందులతో ఎప్పుడూ కుస్తీ పడరాదు. ఇద్దరికీ మురికి అంటుతుంది. పంది దాన్నే కోరుకుంటుందని జార్జ్‌ బెర్నార్డ్‌ షా వ్యాఖ్యానించారు’’ అని సంచలన కామెంట్లు చేశారు. ఈ మేరకు చంద్రశేఖర్‌ సిట్‌ సిబ్బందికి ఓ లేఖ రాశారు. ‘ఒక ఆరోపితుడు’ అంటూ కేంద్రమంత్రిపై విరుచుకుపడ్డారు. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేశారని మండిపడ్డారు.

‘‘మాన్యతాటెక్‌పార్క్‌ సమీపంలో 38 అంతస్తుల భవనం నిర్మిస్తున్నానని ఆరోపించారు. ఇది నిజం కాదు. నిజానికి ఆయనే పలు కేసులు ఎదుర్కొంటున్నారు. సిట్‌ ప్రాసిక్యూషన్‌ అనుమతులు కోరగా.. కుమారస్వామి బెయిల్‌ తెచ్చుకున్నారు. ప్రస్తుతం మమ్మల్ని ఆత్మరక్షణలోకి నెట్టాలని ఆరోపణలు చేస్తున్నారు’’ అని లేఖలో ప్రస్తావించారు. సిట్‌ ముఖ్యుడిగా నిర్భయంగా పనిచేస్తున్నాననీ, వివాదంలో వాస్తవాలను బయటకు తీస్తానని చెప్పారు. కాగా, ఐపీఎస్‌ అధికారి చంద్రశేఖర్‌ ప్రస్తావించిన అంశాలపై కేంద్రమంత్రి కుమారస్వామి నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు. శనివారం అమిత్‌షాకు ఫోన్‌ చేసిన ఆయన చంద్రశేఖర్‌పై చర్యలు తీసుకోవాలని కోరినట్టు సమాచారం. ఐపీఎ్‌సపై అమిత్‌షా కూడా తీవ్రంగానే స్పందించినట్టు తెలుస్తోంది. కాగా, ఐపీఎస్‌ అధికారి వ్యాఖ్యలను జేడీఎస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది.


  • చంద్రశేఖర్‌ క్షమాపణలు చెప్పాలి: ప్రహ్లాద్‌జోషి

లోకాయుక్త ఏడీజీపీ చంద్రశేఖర్‌ తీరుపై కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి మండిపడ్డారు. కుమారస్వామిపై అసభ్యపదాలు ప్రయోగించడం సరికాదన్నారు. ఆయనపై చర్యలు తీసుకునేలా సూచనలు చేస్తానని, చర్యలు తప్పవని ప్రహ్లాద్‌జోషి హెచ్చరించారు. హుబ్బళ్లిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రమంత్రి పట్ల అనుచితమైన పదాలు వాడడం సరికాదన్నారు. ఏడీజీపీ హోదాలో ఉంటూ సర్వీస్‌ కండక్ట్‌ నిబంధనల గురించి జ్ఞానం లేకుండా లేఖలో ప్రస్తావించారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని సూచించారు. కుమారస్వామి ఎవరిపట్ల అసభ్యంగా మాట్లాడలేదనీ, ఏకవచనంతో మాట్లాడలేదని అన్నారు.

  • అధికారులపై ఆరోపణలు సరికాదు: సిద్దు

లోకాయుక్త ఏడీజీపీపై కేంద్రమంత్రి కుమారస్వామి ఆరోపణలు చేయడం సరికాదని సీఎం సిద్దరామయ్య అభిప్రాయపడ్డారు. మైసూరులో ఆదివారం మాట్లాడుతూ.. ఈ అంశంపై తాను ఇంతకన్నా స్పందించబోనన్నారు. రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర్‌ మాట్లాడుతూ.. రాజ్‌భవన్‌ నుంచి సమాచారం లీకైన వ్యవహారంపై విచారణకు తాము సిద్ధమని తెలిపారు. దీనికి గవర్న ర్‌ అనుమతి ఇవ్వాలన్నారు. రాజ్‌భవన్‌ నుంచి సమాచారం లీకైతే దానికి వారే కారకులన్నారు.

Updated Date - Sep 30 , 2024 | 03:09 AM