Chennai: కస్తూరీ... తెలుగు జాతి చరిత్ర తెలుసా...
ABN , Publish Date - Nov 05 , 2024 | 12:30 PM
తమిళనాడులోని తెలుగు ప్రజల గురించి సినీ నటి కస్తూరి(Film actress Kasturi) చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. తరాలుగా ఈ నేలమీద ఉన్న తెలుగుప్రజలను ఆమె అవమానించారంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు ప్రజల గురించి మాట్లాడేముందు వారి చరిత్ర గురించి తెలుసుకోవాలని పలువురు నేతలు హితవు పలికారు.
- నటి వ్యాఖ్యలపై తెలుగు నేతల ఆగ్రహం
- తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్
చెన్నై: తమిళనాడులోని తెలుగు ప్రజల గురించి సినీ నటి కస్తూరి(Film actress Kasturi) చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. తరాలుగా ఈ నేలమీద ఉన్న తెలుగుప్రజలను ఆమె అవమానించారంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు ప్రజల గురించి మాట్లాడేముందు వారి చరిత్ర గురించి తెలుసుకోవాలని పలువురు నేతలు హితవు పలికారు. కస్తూరి వ్యాఖ్యల వివాదం టీవీ ఛానెళ్లలో హోరెత్తింది. సోషల్ మీడియాలో వాదవివాదాలు వైరల్‌గా మారాయి. తన వ్యాఖ్యలను నటి కస్తూరి తక్షణం ఉపసంహరించుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Taj Mahal: బ్యాడ్ న్యూస్.. తాజ్‌మహల్‌ను ఇక అలా చూడలేమేమో..
కాలగర్భంలో కలిసిపోయారు
- కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి
తమిళనాడు రాష్ట్రంలోని తెలుగు ప్రజల్ని కించపరిచేలా మాట్లాడినవారంతా కాలగర్భంలో కలిసిపోయారని, ఈ విషయాన్ని సినీ నటి కస్తూరికి తెలియకపోవచ్చని తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి పేర్కొన్నారు. తెలుగు ప్రజల గురించి నటి కస్తూరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు. కస్తూరి పరోక్షంగా దివంగత మహానేతలు తందై పెరియార్ రామస్వామి, కలైంజర్ కరుణానిథిలను దెప్పి పొడిచారన్నారు.
కొన్ని దశాబ్దాలుగా సోదరభావంతో కలిసిమెలిసి జీవిస్తున్న తెలుగు ప్రజలను కించపరిచేలా, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసిన వారంతా కాలగర్భంలో కలిసిపోయారన్నారు. ‘అన్నమయ్య’ వంటి ఓ మంచి భక్తిరస చిత్రంలో నటించిన కస్తూరిని తెలుగు ప్రజలు అక్కున చేర్చుకున్నారని, అలాంటి వారు రాజకీయ అవసరాల కోసం ఇలా మాట్లాడటం భావ్యం కాదన్నారు. స్వలాభం కోసం నోరుపారేసుకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, కస్తూరి కూడా తక్షణం క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని కేతిరెడ్డి హెచ్చరించారు.
చరిత్ర తెలియని అజ్ఞాని
- వి.కృష్ణారావు
చరిత్ర ఏంటో తెలియని అజ్ఞాని నటి కస్తూరి అని ద్రావిడ దేశం అధ్యక్షుడు వి.కృష్ణారావు మండిపడ్డారు. కస్తూరి వ్యాఖ్యలను ఆయన ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. సినిమాల్లో కనిపించినంత మాత్రాన ఆమె మహానటి కాజాలరన్నారు. తెలుగు ప్రజల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకోవడమే కాకుండా, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటీవలి ఎన్‌ఎంకే కన్వీనర్ సీమాన్, ఇపుడు కస్తూరి తెలుగువారి ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. ఇలాంటి వారిని ఇకపై ఏమాత్రం ఉపేక్షించేది లేదన్నా రు.
ఒకపుడు చెన్నై మహానగరంలో 90 శాతం మంది తెలుగువారే ఉండేవారన్న విషయాన్ని ఆమె తెలుసుకోవాలన్నారు. చెన్నై నగరాభివృద్ధికి చెన్నయ్య అనే వ్యక్తి స్థలాన్ని ఇచ్చారనే విషయాన్ని ఆమె తెలుసుకోవాలన్నారు. ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వంలో ఐదుగురు తెలుగువారికి మంత్రిపదవులు ఇవ్వడాన్ని కూడా ఆమె జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. రాష్ట్రంలో చెన్నైతో పాటు ధర్మపురి, కృష్ణగిరి, కోవై, మదురై, విరుదునగర్, తిరుచ్చి, తిరువళ్ళూరు, వేలూరు జిల్లాల్లో తెలుగు ప్రజలు అధికంగా ఉన్నారన్నారు. కస్తూరి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పకపోతే ఆందోళనలు చేస్తామని వి.కృష్ణారావు హెచ్చరించారు.
తక్షణం ఉపసంహరించుకోవాలి
- డాక్టర్ పొంగులేటి
సినీ నటి కస్తూరి తెలుగు ప్రజల గురించి చేసిన వ్యాఖ్యలను తక్షణం వెనక్కి తీసుకోవాలని బీజేపీ తమిళనాడు రాష్ట్ర జాతీయ ఇన్‌చార్జ్ డాక్టర్ పొంగులేటి సుధాకర రెడ్డి డిమాండ్ చేశారు. ఇదే విషయంపై ఆయన సోమవారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తెలుగు ప్రజలను ఉద్దేశించి నటి కస్తూరి చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. ‘‘ఎన్నో వందల సంవత్సరాలుగా తెలుగు, తమిళ ప్రజలు కలిసి మెలిసి ఉంటున్నారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో కొన్ని సంవత్సరాలపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఓ భాగంగా ఉంది. ఈ వ్యాఖ్యల వెనుక ఏదైనా అజెండా ఉందా, ఎవరిదైనా హస్తం ఉందా అనేది తెలియదు. ఏదిఏమైనా ఆమె చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. కస్తూరి వెంటనే క్షమాపణలు చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.
ఈవార్తను కూడా చదవండి: మినరల్ కాదు.. జనరల్ వాటరే
ఈవార్తను కూడా చదవండి: 24 గంటల విద్యుత్ అంటూ మోసం: హరీశ్‌రావు
ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్, హరీశ్ ఇళ్ల ముందు ధర్నా చేయండి
ఈవార్తను కూడా చదవండి: అసంక్రమిత వ్యాధులకు ప్రత్యేక క్లినిక్‌లు
Read Latest Telangana News and National News