Share News

Rahul Gandhi : విపక్ష నేతగా రాహుల్‌

ABN , Publish Date - Jun 26 , 2024 | 06:03 AM

లోక్‌సభలో విపక్ష నేతగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ నియమితులయ్యారు. దశాబ్ద కాలం తర్వాత మళ్లీ లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది. మోదీని దీటుగా ఎదుర్కొనేది రాహుల్‌ ఒక్కడేననే అభిప్రాయంతో ఈ నెల 9న జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం కూడా విపక్ష నేత విషయంలో ఏకగ్రీవంగా తీర్మానించిన విషయం తెలిసిందే..! అయితే.. రాహుల్‌ మాత్రం

 Rahul Gandhi : విపక్ష నేతగా రాహుల్‌

ప్రొటెం స్పీకర్‌కు సోనియా లేఖ.. ఆమోదం

పదేళ్ల తర్వాత.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత

16 రోజుల యోచన తర్వాత రాహుల్‌ ఓకే

విపక్ష నేతకు కీలక పార్లమెంటరీ అధికారాలు

ఎన్నికల కమిషనర్లు, సమాచార కమిషన్‌..

సీబీఐ, విజిలెన్స్‌ చీఫ్‌ నియామకాల్లో పాత్ర

న్యూఢిల్లీ, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభలో విపక్ష నేతగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ నియమితులయ్యారు. దశాబ్ద కాలం తర్వాత మళ్లీ లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది. మోదీని దీటుగా ఎదుర్కొనేది రాహుల్‌ ఒక్కడేననే అభిప్రాయంతో ఈ నెల 9న జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం కూడా విపక్ష నేత విషయంలో ఏకగ్రీవంగా తీర్మానించిన విషయం తెలిసిందే..! అయితే.. రాహుల్‌ మాత్రం తాను ఇంకా ఆలోచించుకోవాల్సి ఉందని అప్పట్లో వ్యాఖ్యానించారు. బుధవారం జరగనున్న లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక విషయంలోనూ.. ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్‌ పదవిని కేటాయించాలనే సంప్రదాయం అంశంలోనూ మోదీని రాహుల్‌ దీటుగా ఎదుర్కోగలరని మంగళవారం రాత్రి ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే ఇంట్లో జరిగిన విపక్ష కూటమి సమావేశం పునరుద్ఘాటించింది. దీంతో.. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండేందుకు రాహుల్‌ తన ఆమోదాన్ని ప్రకటించారు. ఆ వెంటనే కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ప్రొటెం స్పీకర్‌ భర్తృహరికి రాహుల్‌ను తమ పార్టీ తరఫున ప్రధాన ప్రతిపక్ష నేతగా పేర్కొంటూ లేఖ రాశారు. గడిచిన పదేళ్లుగా లోక్‌సభలో విపక్ష నేత హోదా ఖాళీగా ఉంది. ఏదైనా పార్టీ లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదాను పొందాలంటే.. మొత్తం సీట్లలో 10ు స్థానాల్లో గెలిచి ఉండాలి. ప్రస్తుతం లోక్‌సభలో 543 సీట్లున్నాయి. అంటే.. ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే 54 సీట్లు తప్పనిసరి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభంజనంతో.. కాంగ్రెస్‌ 44 సీట్లతో సరిపెట్టుకుంది. 2019లో కూడా కాంగ్రెస్‌ పార్టీ 52 స్థానాలను దక్కించుకోగా.. ప్రధాన ప్రతిపక్ష హోదాకు రెండు సీట్లు తక్కువయ్యాయి. ఈ సారి 99 మంది ఎంపీలుండడంతో.. కాంగ్రెస్‌ ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది.

రాహుల్‌పై గురుతర బాధ్యత..!

లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేతకు ప్రత్యేక సభాహక్కులుంటాయి. లోక్‌సభలో సభ్యులకు సీట్లు, గదుల కేటాయింపులు, అధికారిక పత్రాల సరఫరా, పార్లమెంటరీ కమిటీల నియామకం, సభ రోజువారీ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తారు. సీబీఐ చీఫ్‌, చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌, కేంద్ర సమాచార హక్కు కమిషనర్‌, ఎన్నికల ప్రధాన కమిషనర్‌, ఇతర కమిషనర్ల నియామకానికి సంబంధించిన ప్యానెళ్లలోనూ ప్రధాన ప్రతిపక్ష నేత సభ్యుడిగా ఉంటారు. వీటితోపాటు.. లోక్‌సభలో ప్రజల గళాన్ని వినిపించే అవకాశం విపక్ష నేతకు ఎక్కువగా ఉంటుంది. ‘‘జోడో యాత్రల సందర్భంగా రాహుల్‌ అనేక వర్గాలను కలిశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ కూడా నిరుద్యోగిత, ధరల పెరుగుదల, మహిళా సమానత్వం, సామాజిక న్యాయంపై హామీలు ఇచ్చింది. ఈ అంశాలపై పార్లమెంట్‌లో గళమెత్తాల్సిన అవరముంది. అది రాహుల్‌ వల్లే సాధ్యం. ఎన్నికల ప్రచారంలోనూ మోదీని రాహుల్‌ దీటుగా ఎదుర్కొన్నారు’’ అని కాంగ్రెస్‌ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ వ్యాఖ్యానించారు.

Updated Date - Jun 26 , 2024 | 06:03 AM