Delhi: కేంద్రంలో ‘ఇండియా’ సర్కారు: కేజ్రీవాల్
ABN , Publish Date - May 12 , 2024 | 02:08 AM
కేంద్రంలో వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమేనని, దాంట్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) భాగస్వామిగా ఉంటుందని ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో జైలు నుంచి శుక్రవారం విడుదలైన కేజ్రీవాల్ శనివారం ఆప్ ప్రధాన కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు.
ఆప్ భాగస్వామిగా ఉంటుంది.. బీజేపీకి 220-230 సీట్లు మాత్రమే
నియంతలను తరిమికొట్టిన చరిత్ర భారత్‌ది: కేజ్రీవాల్
న్యూఢిల్లీ, మే 11 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమేనని, దాంట్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) భాగస్వామిగా ఉంటుందని ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో జైలు నుంచి శుక్రవారం విడుదలైన కేజ్రీవాల్ శనివారం ఆప్ ప్రధాన కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆప్ కార్యకర్తలు, నేతలు భారీ ఎత్తున తరలి వచ్చిన ఈ సమావేశం బహిరంగ సభను తలపించింది. కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత ఈ 20 గంటల్లో అనేక మంది ఎన్నికల విశ్లేషకులతో మాట్లాడాను. బీజేపీ కేంద్రంలో అధికారం కోల్పోనుందని స్పష్టమైంది. జూన్ 4న కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోవటం లేదు.
నా అంచనా ప్రకారం బీజేపీకి 220-230 సీట్లకు మించవు. ఇండియా కూటమి అధికారాన్ని చేపడుతుంది. ప్రభుత్వంలో ఆప్ భాగస్వామిగా ఉంటుంది. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను ఇస్తాం. ప్రజల మనిషి ఢిల్లీ గవర్నర్‌గా ఉంటారు’ అని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో నియంతృత్వాన్ని నెలకొల్పే ప్రమాదకరమైన ఆలోచనలతో మోదీ ఉన్నారని.. ‘వన్ నేషన్ వన్ లీడర్’ (ఒకే దేశం ఒకే నాయకుడు) దాంట్లో భాగమని ఆరోపించారు. రష్యాలో పుతిన్‌లాగా.. భారతదేశంలో తాను తప్ప మరొక నాయకుడు ఉండకూడదనేది మోదీ ఆలోచన అని విమర్శించారు. 4 వేల ఏళ్ల చరిత్ర ఉన్న మన దేశం.. నియంతలను ఎన్నడూ సహించలేదని, వారి నియంతృత్వాన్ని ప్రజలు కూకటివేళ్లతో సహా పెకిలించి వేశారని.. ఈసారి కూడా అదే జరగనుందని తెలిపారు.
ఓవైపు ప్రతిపక్ష నేతలను జైలుకు పంపటం, మరోవైపు బీజేపీ నేతలందరినీ రాజకీయంగా అంతం చేయటం ద్వారా రెండు విధాలుగా నియంతృత్వం వైపు అడుగులు వేయాలని మోదీ భావిస్తున్నారని కేజ్రీవాల్ చెప్పారు. మోదీ మళ్లీ గెలిస్తే ప్రతిపక్ష నేతలందరినీ జైలుకు పంపుతారన్నారు. మోదీ హాయాంలో బీజేపీ అగ్రనేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, శివరాజ్‌సింగ్ చౌహాన్, వసుంధర రాజే, మనోహర్‌లాల్ ఖట్టర్, రమణ్ సింగ్‌లను రాజకీయంగా అణచివేశారని, ఆయన మళ్లీ గెలిస్తే.. యూపీ సీఎం యోగిని రెండు నెలల్లో సీఎం పదవి నుంచి దించుతారన్నారు.
ఆప్ అంతం కోసం మోదీ కుట్ర
ఢిల్లీలో ఆప్ వరుసగా ఘన ఘనవిజయాలు సాధిస్తుండటంతో వచ్చే 20 ఏళ్ల వరకు ఆప్‌ను ఓడించలేమని బీజేపీకి అర్థమై, దొడ్డిదారిన పార్టీని నాశనం చేయటానికి కుట్ర పన్నిందని కేజ్రీవాల్ తెలిపారు. దీంట్లో భాగంగానే తనతోపాటు ఆప్ అగ్రనేతలు మరో ముగ్గురిని అరెస్టు చేసి జైలుకు పంపిందని, ఇలా జరిగి ఉంటే వేరే ఏ పార్టీ అయినా విచ్ఛిన్నమైపోయేదని, కానీ, ఆప్ ఒక ఆలోచనధార కాబట్టి.. ఈ దాడిని ఎదుర్కొని నిలిచిందన్నారు. తనను జైలుకు పంపితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాడని, అప్పుడు ఆప్ ప్రభుత్వం పడిపోతుందని బీజేపీ భావించిందన్నారు. ఈ కుట్రను గుర్తించే తాను రాజీనామా చేయలేదన్నారు.
బీజేపీ ప్రధాని అభ్యర్థి ఎవరు?
బీజేపీ ప్రధాని అభ్యర్థి ఎవరని కేజ్రీవాల్ ప్రశ్నించారు. 75 ఏళ్లు నిండినవారు రాజకీయాల నుంచి వైదొలగాలని మోదీ బీజేపీలో నిబంధన పెట్టారని, ఆడ్వాణీ, జోషిలకు ఈ విధంగానే రిటైర్మెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. ‘వచ్చే ఏడాది సెప్టెంబరులోమోదీ 75వ ఏట అడుగుపెడతారు. మరి బీజేపీ ప్రధాని అభ్యర్థి ఎవరు? అమిత్‌షాను ప్రధానిగా చేయటానికి మోదీ ఈ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారా’’ అని ప్రశ్నించారు.