Prajwal Revanna's Mother: ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు భవాని
ABN , Publish Date - Jun 04 , 2024 | 03:19 AM
హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలల వివాదంలో బాధితురాలిని కిడ్నాప్ చేసిన కేసు నిందితురాలు, ప్రజ్వల్ తల్లి భవాని ముందస్తు బెయిల్ కోసం సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. కిడ్నాప్ కేసులో రేవణ్ణ తొలి నిందితుడు కాగా, ఇప్పటికే అరెస్టు అయి బెయిల్‌పై బయటకు వచ్చారు.
బెంగళూరు, జూన్ 3(ఆంధ్రజ్యోతి): హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలల వివాదంలో బాధితురాలిని కిడ్నాప్ చేసిన కేసు నిందితురాలు, ప్రజ్వల్ తల్లి భవాని ముందస్తు బెయిల్ కోసం సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. కిడ్నాప్ కేసులో రేవణ్ణ తొలి నిందితుడు కాగా, ఇప్పటికే అరెస్టు అయి బెయిల్‌పై బయటకు వచ్చారు. భవాని రేవణ్ణకు దర్యాప్తు సంస్థ సిట్ నోటీసులు జారీ చేసింది.
ఆమె స్పందించలేదు. ప్రజాప్రతినిధుల న్యాయస్థానంలో భవాని బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీనిపై ఆమె తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిట్ జారీ చేసిన నోటీసుల ప్రకారం తాను చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదని, అరెస్టు భయం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
దర్యాప్తునకు సహకరించాలని ఆమెకు శనివారం రెండోసారి సిట్ నోటీసులు జారీ చేసింది. హొళెనరసీపుర ఇంట్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలవరకు ఉండాలని, విచారణకు సహకరించాలని సూచించారు. ఆమె అందుబాటులో లేకపోవడంతో గుర్తించేందుకు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ప్రజ్వల్‌కు మరోసారి వైద్య పరీక్షలు
అత్యాచార ఆరోపణలతో అరెస్టు అయిన హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు మరోసారి వైద్య నిర్వహించారు. ప్రజ్వల్‌ను సిట్ అధికారులు అంబులెన్స్‌లో సోమవారం శివాజినగర్‌లోని బౌరింగ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కోర్టుకు సమర్పించేందుకు అవసరమైన మూడు, నాలుగు రకాల వైద్యపరీక్షలు చేయాలని వైద్యాధికారులను కోరారు. దీంతో మెడికల్ కాలేజీ డీన్, సూపరింటెండెంట్ సమక్షంలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు.
ప్రజ్వల్‌ను కస్టడీకి తీసుకుని మూడు రోజులు గడిచింది. ఏ ప్రశ్న అడిగినా తాను తప్పు చేయలేదని, ఇదంతా రాజకీయ కుట్ర అని, తనను రాజకీయంగా వేధిస్తున్నారని చెప్పినట్లు తెలుస్తోంది. పంచనామా జరిపేందుకు ప్రజ్వల్‌ను హాసన్ జిల్లా హొళెనరసీపురకు సోమవారం రాత్రి లేదా మంగళవారం తరలించే అవకాశం ఉంది.
లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం ఉండడంతో సిట్ అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రజ్వల్ హాసన్ ఎంపీ అభ్యర్థి. ఇలాంటి సమయంలో ప్రజ్వల్‌ను పంచనామాకు తీసుకెళ్తే శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం